9, మార్చి 2010, మంగళవారం

చీర(ల)పురాణం

http://anamdam.blogspot.com/2010_02_01_archive.html( జంబలకడి పంబ-ఆనందం )



చీర ఎంతో ముద్దుగా, చిన్నగా, అమాయకంగా ఉన్న పేరులా అనిపిస్తుంది కదూ. అలా అనుకునే చాలా మంది మగవీరులు చరిత్రలో డంగైపోయారు. శ్రీదేవీ మహాపురాణంలో పదహారో అధ్యాయం నూట నాలుగో శ్లోకం ప్రకారం, చీర అన్నది ఆడవారికి మగవాళ్ళని శిక్షించే ఓ ఆయుధం.

చీమ ఎంతో చిన్నది , పొదుపులోన మిన్నది --- పాతపాట
చీర ఎంతో చిన్నది, ఖర్చులోన మిన్నది -- కొత్తపాట

నేను డిగ్రీలోఉన్నప్పుడు ఓసారి ఏదో పండక్కి నాన్న అందరికీ డబ్బులిస్తున్నారు బట్టలు కొనుక్కోటానికి. నాకు వెయ్యి రూపాయలిచ్చి, అమ్మకో అయిదువేలు, బామ్మకో అయిదువేలిచ్చి, ఆఖరికి పనమ్మాయి లక్ష్మికి ఓ రెండువేలిచ్చారు. సిగ్గుతో కాసేపు చితికి, రోషంతో వెయ్యికేమొస్తాయ్ ఛీ నాకొద్దన్నా. అంతలో అమ్మ అందు(ఆడు)కుంది...

రేయ్ ఆనందూ, ఆ వెయ్యితో నువ్వు తొడుక్కునే ఆ కుక్కతోలు (అమ్మ భాషలో అది జీన్స్) ప్యాంట్లు రెండొస్తాయి. అయినా ఎప్పుడో నెలో,రెండ్నెల్లకోసారి ఉతికే నీకంతకన్నా ఎక్కువ అనవసరం అని దబాయించింది. పోనీ అంతగా నీకింకో ప్యాంటు కావాలంటే, కిందటేడాది తద్దినాలప్పుడు కొన్న ఆ నీలం జంపకానా టైలరుకిచ్చి కుట్టించుకోరా, బాగా మురికిపట్టి అచ్ఛం నువ్విప్పుడు తొడుక్కున్న ప్యాంటల్లే ఉంటుందిరా అంది అమ్మ.

ఏంటీ జోకా, ఏమనుకుంటున్నారు మీరు నన్ను? గాండ్రించా నేను.

అంతలో బామ్మ నా దగ్గరికి వచ్చి, మీరేంటే పాపం వాణ్ణి ఆటపట్టిస్తారు, రారా ఆనందూ, ఆ పాత జంపకానా నీకెందుకులేగానీ, ఇదిగో ఈ రెండొందలు తీసుకెళ్ళి ఓ కొత్త జంపకానా కొనుక్కుని ప్యాంటు కుట్టించుకో నాన్నా అంది.

"బామ్మా.." అని క్రోధంతో కళ్ళెర్ర చేసి శంకరాభరణం శంకరశాస్త్రి "శారదా" అన్న రేంజ్లో ఎఫెక్ట్ వచ్చేలా అరిచా.

అలా అరిచిన నోరు మూసే లోపలే బామ్మ అప్పుడే వంటింట్లో చేసిన తొక్కుడు లడ్లు ఓ రెండు నా నోట్లో కుక్కి నా నోరు నొక్కేసింది.

ఛీ.. ఈ చీరల పిచ్చికి చిన్నా, పెద్ద, ముసలి, పడుచు తేడాలుండవని అర్ధమై దీనంగా బయటకి నడిచా.

నా బాధ చెప్పుకుందామని మా కిరణ్ గాడింటికెళ్ళా. వాడింట్లో యమా హడావిడిగా ఉంది. ఏంట్రా సంగతి అన్నా?

మా చెల్లికి మొదటిసారి చీర కడుతున్నార్రా, అందుకే ఈ జనాలకి పార్టీరా అన్నాడు.

చీర కడితే పార్టీనా, ఒరే అన్యాయంరా ఇది. నేను మొట్ట మొదటిసారి టెన్త్ క్లాసులో ప్యాంటు కడితే, పార్టీ సంగతి దేవుడెరుగు, ఇప్పుడంత తొందరేమొచ్చిందిరా వెధవా అని ప్యాంటు ఇప్పదీసి మరీ కొట్టాడ్రా మా బాబు. అలాంటిది ఇక్కడ పార్టీలా. ఒరే ఇది పచ్చి మోసం, దగా. మన జనాలు పిచ్చిమొహాల్లాగా తెలంగాణాని దోచుకుంటున్నారు అని కొట్టుకుచస్తున్నారు గానీ, అసలు దోపిడీ అంతా చీరల రూపంలో మొత్తం మొగాళ్ళకి అనాదిగా జరిగిపోతోందిరా.

అయినా లాభం లేదురా. మగాడు ప్యాంటేం ఖర్మ చీర కట్టి, బొట్టు పెట్టినా పార్టీ ఇయ్యర్రా అదంతే అన్నాడు కిరణ్ నన్ను ఓదారుస్తూ.

అద్సరే గానీ నిన్ను మాతో టూర్ పంపటానికి డబ్బుల్లేవని ఏడ్చిన మీ నాన్న ఏమాత్రం వదిలించుకున్నాడురా ఈ కార్యక్రమానికి?

ఏమోరా, కానీ అమ్మతో నాన్న అంటే విన్నా, అరలక్షట్రా? కానీ తిండికి అయింది పదివేలేట, మిగతా నలభైవేలు చీరల ఖర్చు అంట్రా.

"చీరలా", అదేంట్రా ఉన్నట్టుండి బహువచనం వాడావ్, కట్టేది ఒక్క చీర కాదా?

పిచ్చివాడా. చీర అన్నది పుస్తకాల్లో రాసుకోటానికి మాత్రమే వాడే ఏకవచన ప్రయోగం. నిజ జీవితంలో చీర ఎప్పుడూ బహువచనమే. కావాలంటే అటు చూడు అక్కడ గంటకో చీర మార్చి ఎలా ఫొటోలు దిగుతున్నారో.

అవునా ఎంత గొప్ప నిజం చెప్పావ్రా, నా కళ్ళు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. ఈ బాధ నుంచి బయటపడాల్రా, ఎక్కడికైనా పోదాం పదరా.

ఎక్కడికో ఎందుకురా, మన అమ్మన సూరి వాళ్ళ చుట్టాల పెళ్ళి ఇవ్వాళేరా, అక్కడికెళ్ళి కాస్త రిలాక్స్ అవుదాం.

ఇద్దరం కలిసి అలా పెళ్ళికెళ్ళి ఓ మూలన కూచున్నాం. అది ఆషామాషీ పెళ్ళికాదు. అమ్మన బ్రదర్స్, దంచన సిస్టర్స్ వాళ్ళ పెళ్ళి. అక్కడ మాకు కొంచెం దూరంలో అంతలో అమ్మన, దంచన వాళ్ళ ఆడవాళ్ళొచ్చి కూచున్నారు.

ఏం వదినా, బొత్తిగా నల్లపూసై పోయావ్?

చాల్లే బడాయి, అక్కడికి నువ్వేదో పెద్ద తెల్లపూసైనట్లు. మొన్నెప్పుడో శుక్రవారం గుళ్ళో కలిసాం. ఇవ్వాళ ఆదివారం. మధ్యలో శనివారం కనపడకుండా ఎటుపోయావమ్మా. ఏమిటీ చీరలు గానీ కొన్నావా? అయినా మీదే అంత పెద్ద దుకాణం పెట్టుకుని బయటికెందుకొదినా అసయ్యంగా?

అదేమరి నంగనాచి కబుర్లంటే. అక్కడికేదో నువ్వు మీ షాపులోనే నీ చీరలు కొనుక్కుంటున్నట్లు. ఇప్పుడు నువ్వేసుకున్న ఆ వెంకటగిరి చీర మా షాపులోది కాదూ?

నీ దగ్గర దాపరికమా వదినా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లు, మన మొగుళ్ళు మనల్ని మన షాపుల్లో చీరలు కొనుక్కోనిస్తే ఈ దొంగచాటు వేషాలెందుకొదినా?

అవునొదినా మంచిమాటన్నావు. ఈ మగాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయాయొదినా. నా మొగుడు వారానికో బంగారం నగ తెచ్చి దిగేస్తున్నాడొదినా. మొదట్లో తెలీక లవ్వనుకున్నా, తర్వాత తెలిసింది ఇలా డబ్బంతా బంగారంలా పోగేసి, మనల్ని కాపలాకుక్కల్ని చేద్దామని వెధవ ప్లాను.

సరి సరి, నా మొగుడే అనుకున్నా, మీ ఆయన తంతూ ఇదేనా. నిజంగా చస్తున్నా వదినా, వేసినవే వేసుకుని మొహమ్మొత్తింది. పాడయిచావవు, పెట్టవూ. ఎంచక్కా చీరలయితే అవతలపారేసి, నెలకో కొత్తచీర కొనుక్కోవచ్చును.

భయపడమాకొదినా. నేనేం తక్కువ తిన్నానా. రెండు డూప్లికేట్ నగలు చింతలపూడిలో చేయించి, మొత్తం నగల్లో కలిపేసా. అసలు నగలు అమ్మేసి ఇవిగో ఇలా ఎప్పటికప్పుడు కొత్త చీరలు కొంటున్నా వదినా. ఇప్పుడు అన్ని నగల్లో ఏది అసలో ఏది నకిలీనో ఆయన దాకా ఎందుకు, నాకే తెలిచ్చావదు.

ఎంత తెలివొదినా నీకు. వీటినే చావు తెలివితేటలంటారు కాబోలు. అది సరే, ఆ బ్యాగులో చీరలేంటి?

అవి, ముహూర్తమప్పుడు ఒకటి, అయ్యాక మరోటీ కడదామని తెచ్చుకున్నా వదినా?

ఏది ఆ నల్లి సిల్క్ హౌసులో కొన్నావా?

లేదొదినా, వాడు మరీ కూల్ డ్రింకొక్కటే ఇస్తున్నాడు, ఆ పక్క సందులో పిల్లి సిల్క్ హౌసులో కొన్నా వదినా. వీడు కూల్ డ్రింకుతో పాటు బిస్కెట్లు కూడా ఇచ్చాడులే. ఇది గద్వాల చీరొదినా. పాతికవేలు పెట్టా. ఎలా ఉంది?

ఏదిటు చూడనీ, నేను నల్లిలో కొన్న గద్వాల చీరల్లే ఉందే. ఇదిగో చూడు. నేను ఇరవై వేలకే కొన్నా.

కాదులే వదినా, నా చీరకి పమిటంచులో ఈ చంద్రుడి బొమ్మ ఎంబ్రాయిడరీ ఉంది చూసావా, అందుకే ఆ రేటు.

ఆ బడాయి, కాదులేవమ్మా. నీదసలు డామేజీ చీర. అంచులో చిరుగు కనపడనీకుండా అలా ఆ చిల్లుని చంద్రుడిలా ఎంబ్రాయిడరీ చేయించి నిన్ను మోసం చేసాడు ఆ పిల్లి వెధవ.

ఛీ..చుప్పనాతి మొహమా, మెచ్చుకోవటం రాకపోగా కుళ్ళుపుట్టి నా చీరని తిడతావా, నీతో మాట్లాట్టం వేస్ట్. పోవే.

నోర్ముయ్యవే ఆల్చిప్ప మొహమా, నువ్వే పెద్ద చుప్పనాతివి, శూర్పణఖవి..పోవే...

నువ్వే పోవే, అయినా వారానికో కొత్తచీర కొనే నాకూ, రెండువారాలకొకటి కొనే నీకూ పోలికేంటే?

నా సంగతి నీకేం తెల్సే. నెలకింద కొన్న డజను చీరలు ఆ గిన్నెల వాడికేసి, ఈ బుజ్జి నెయ్యి గిన్నె తీసునున్నదాన్నే నేను.

నీ మొహం మండ, వారం కింద కొన్న చీరలు రంగు నచ్చక, అదే గిన్నెల సత్తిగాడి కేసి ఇదుగోనే ఈ చిట్టి ఉగ్గిన్నె తీసుకున్న వంశమే నాది. నీ జిమ్మడ.

ఏంటే వంశం వంశం అని ఏడుస్తున్నావ్, నువ్వు, నీ బోడి వంశం, నేనేసిన చీరలతో అదే సత్తిగాడు చీరల షాపు పెట్టుకున్నాడన్న సంగతి తెలుసుటే నీకు వాగుతున్నావ్?

అదా నీ పొగరు, కానీ వారానికోసారి నేనేసే చీరలకి గిన్నెలివ్వటానికి ఆ సత్తిగాడేకంగా స్టీలు సామాను షాపే తెరిచాడన్న సంగతి తెలిస్తే సిగ్గుతో చస్తావే?

నీ కెంత పొగరే, కొత్తచీరలు కొనటం కోసం వారం కిందకొన్నవి ఇస్త్రీ పెట్టెతో కాల్చి మొగుడితో కొత్తవి కొనిపించిన వంశమే నాది.

అవునా, అసలు తొడగని చీరలు నీ బీరువాలో ఏమైనా ఉన్నాయిటే. నాకు మూడు బీరువాల నిండా కొని నచ్చక తొడగని చీరలున్నాయే.

ఓసి ఆ మాత్రానికే అంత కులుకటే నీకు, నీకింకా కొన్నాక నచ్చలా, కానీ నేనసలు షాపుకెళ్ళానుకదాని, నచ్చకపోయినా కొన్న చీరలు నాలుగు బీరువాల్లో ఉన్నాయే.

కంచి పట్టుచీర కొని కత్తిరించి కూతురికి పంజాబీ డ్రస్సుగా కుట్టించిన వంశమే నాది.

బెనారస్ పట్టుచీర కొని కత్తిరించి మొగుడికి చొక్కాగా కుట్టించిన వంశమే నాది.

ఇద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు నోటికొచ్చినంత మనస్ఫూర్తిగా మెచ్చుకుని కాసేపటికెళ్ళిపోయారు, మళ్ళీ సోమవారం కలుసుకోటానికి.

అంతలోకి పెళ్ళి అయిపోయి, వ్రతం కూడా మొదలయింది. ఆడాళ్ళ దెబ్బకి కిరణ్, నేను బుర్రవాచి పెళ్ళిపందిరి దగ్గరికెళ్ళాం. పంతులు గారు వ్రతం కధ చదువుతున్నాడు.

మొదటి అధ్యాయము:

పూర్వం తుంగధ్వజుడనే రాజు, భార్యతో కలిసి నగర పర్యటన చేయుచూ దారిలో ఓ బట్టల దుకాణం మీదుగా పోవుచూ హడావిడిగా అందులో భార్యకు చీరలు కొనకుండా అట్లే ముందుకు పోయెను. అటు పిమ్మట, తన భవనానికి తిరిగి వెళ్ళిన తుంగధ్వజునికి ఆస్థులు, భవనములు అన్నీ నేలకూలిన దృశ్యము చూసి గుండె ద్రవించి, దీనికి కారణం ఏమియో అని ఆలోచింపగా, ఆకాశంలో ఓ మెరుపు మెరిసి, చీరలమ్మ ప్రత్యక్షమై, ఓ రాజా, నీవు బట్టల దుకాణం ముందు నుంచి వెళ్ళి కూడా భార్యకు చీరలు కొనకపోతివి. అందుకే నీకీ శిక్ష నాయనా. వెంటనే వెళ్ళి నీ భార్యకు ఓ డజను చీరలు కొని ఇచ్చి, అటుపై సర్వసౌఖ్యములు అనుభవించుమని చెప్పి అదృశ్యమాయెను. ఆ మాటవిని రాజు పరమానందభరితుడై, భార్యకు ఒకటికి పది డజన్ల చీరలు కొని సుఖపడెను. ఒకటో అధ్యాయము సమాప్తం.

రెండవ అధ్యాయము:

పూర్వము పీతాంబరం అను ఓ యువకుడు ఉండెడివాడు. వాడు పేరుకు తగ్గట్లు చక్కని రంగురంగుల బట్టలు ధరించుచూ, పూలరంగడివలె ఉండెడివాడు. ఓ రోజు వాడు ఓ సినిమా చూచుటకు వెళ్ళి అందులో శవాలమీద పేలాలు ఏరుకునే విధంగా ఓ దుర్మార్గుడు వ్రాసిన "దోమ కుడితే చికెన్ గునియా, ప్రేమ కుడితే సుఖం గునియా.." అనే ఓ పాట విని, సుఖం గునియా పుట్టి కనకాంబరం అను యువతిని ప్రేమించి ఆపై పెళ్ళి చేసుకొనెను. కనకాంబరమునకు చీరలు కొనిపెట్టే విషయమున వాడు కొంత పిసినారిగా వ్యవహరించసాగెను. కాలక్రమములో చీరలమ్మ కోపాగ్ని వలన వాని ఆస్థులు అన్నీ కరిగిపోయి, పీతాంబరుడు మెల్లగా శ్వేతాంబరుడిగా మారి అటుపై భార్య విడిచిపెట్టగా ఏకాంబరంగా మారి రోడ్లుపట్టి తిరగసాగెను. అంతట ఓ దినము రోడ్డుపై దిగంబరునిగా తిరుగుచున్న పీతాంబరుని పరిస్థితిని చూసి జాలిపడిన చీరలమ్మ ఆ విషయం ఆతని భార్య కనకాంబరమునకు కలలో కనపడి తెలిపెను. అంతట కనకాంబరం అతనిని ఇంటికి తీసుకువచ్చి చీరలమ్మ వ్రతం చేయించి, ఓ డజను చీరలను అతనిచే అప్పుచేయించి మరీ కొనిపించుకొనగా అంతట వారు సర్వ సౌఖ్యములు పొంది సుఖపడిరి.

ఈ వ్రత కధ విని, ప్రసాదం తీసుకోకుండా, కనీసం ఒక చీర కొని నచ్చిన వారికివ్వని మగవారు చీరలమ్మ ఆగ్రహానికి గురయి కష్టాలు అనుభవించెదరు అని ముగించాడు.


ఆ వ్రతకధ విన్న నాకు పూర్తిగా బుర్ర తిరిగి, పంతులు గారూ, ఇదేం వ్రతం ఎప్పుడూ విన్లేదు అన్నా.

ఇది చీరలమ్మ వ్రతం నాయనా, నీక్కూడా చేయించాలా బాబూ అన్నాడు.

వద్దులే స్వామీ నాకింకా పెళ్ళి కాలేదు. అనిచెప్పి వెనక్కి తిరక్కుండా ఇంటికొచ్చి పడుకున్నా.

ఎందుకొచ్చిన ఖర్మ అనుకొని, మా బాబు ఇచ్చిన వెయ్యితో ఓ చీర కొని అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చా. అమ్మ సంతోషం పట్టలేక, తట్టుకోలేక ఇంకో జంపకానా కొనిస్తానని మాటిచ్చింది. ఓ పక్క ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. వెంటనే నా పెళ్ళిసంబంధం కోసం వాళ్ళు ఇచ్చిన ప్రకటనని ఇలా మార్చేసా...

"అందమైన, బుద్ధిమంతుడైన, బ్లాగులు రాసుకునే పదహారణాల ఇరవై రెండేళ్ళ తెలుగు యువకుడు, అందమైన, బుద్ధిమంతురాలైన బ్లాగుల జోలికెళ్ళని, చీరల పిచ్చిలేని ఇరవై సంవత్సరాల తెలుగు యువతి కొరకు తీవ్రంగా వెతుకుచున్నాడు. చీరల పిచ్చి ఉండీ మోసగించినట్లయినచో హిందూ చీరల చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడును. వివరాలకు సంప్రదించండి. ఫోన్: 1122334455"

1 కామెంట్‌:

నేస్తం చెప్పారు...

ఈయన బ్లాగ్ అప్పుడప్పుడు చదువుతాను చాలా బాగా నవ్విస్తారు..చక్కని బ్లాగ్
ఈ పోస్ట్ మొన్నే చదివాను భలే బాగా నవ్వు వచ్చింది