18, ఆగస్టు 2010, బుధవారం

మాటల యుద్ధం ముగిసిన వేళ...

http://naaspandhana.blogspot.com/2009/01/blog-post_06.html (లలిత-నా స్పందన)




"ఏవోయ్"
"................."
"ఇదిగో నిన్నే"
"...................."
"నిన్నేనోయ్ నా అర్ధాంగీ "
"......................."
"దయచూపగరాదా దేవీ........................."
"...................."
"ఐతే ఇక అంతేనా , నే పోనా..............."
"ఏవిటీ అంతేనా"?
"మూడురోజులనుండి బ్రతిమాలుతున్నా "
"ఎవరూ బ్రతిమాలమన్నదీ"
"నువ్వలా వుంటే నాకు వుండబుద్ది కావద్దూ"
"అబ్బో ప్రేమ కారిపోతుంది లెండి "
"మరికాదా"?
"అంత ప్రేమున్నవారు నన్నంత మాట ఎలా అనగలిగారో "?
"ఏ మాట".....ఎప్పుడూ"?
"అబ్బే ఏం ఎరగరుమరి"
" ఒహో...అదా నువ్వింకా అదే తల్చుకు బాధపడితే ఎలా "?
"ఎలా అంటే వదిలెయ్యండి .......ఈ బ్రతిమాలడాలెందుకూ"?
"ఎందుకేవిటీ నువ్విలా వుంటే నాకు పనిమీద మనసు నిలవటం లేదు మరి .ఎంత బాధగా వుందో తెలుసా "
"అంత బాధ పడేవారైతే నన్నంత మాటంటారా"?"............... " అదీ మీ అమ్మగారి ముందు"
"అదన్న మాట అసలు సంగతి ,మొగుడు కొట్టినందుకు కాదు తొడికోడలు నవ్వినందుకు అన్నట్టుంది "..........
"కాదూ మరి "! విన్న అవిడ వూరకే వుంటారా నలుగురికీ చెప్పకుండా "?
"చ అమ్మ అలా చేయదులే "
"ఆహా... మీరు నన్నంత మాట అంటుంటే ఆవిడ మొహం ఎంత వెలిగిపోయిందో గమనిస్తే తెలిసేది "
".............................."
" మా ఆయన నన్ను పల్లెత్తు మాటనరు " అని తోడికోడళ్ళతోనూ, ఆడబడుచుల తోనూ గర్వంగా చెప్పుకునేదాన్ని .............ఇప్పుడు అంతా కూడి నా వెనకే నవ్వరూ"?
"అదేవంత మాట . ఏదో ఆరోజు చికాకులో నోరు జారింది అందుకేగా క్షమించమని నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది "
"............................."
" అయినా ఆ చిన్న మాటకే నువ్వింత మనసు కష్ట పెట్టుకుంటావని తెలియకా................."
అవున్లెండి ...నా కష్టం తమకెప్పుడు తెలియాలి "?
"...................."
"ఇంటెడు చాకిరీ ఒక్క చేత్తో చేసుకొస్తున్నానన్న జాలైనా లేకుండా నన్నంట మాట అంటారా "?
"జాలి లేకేం బంగారూ....." సుకుమారంగా పెరిగిన మా రాణి గారి సేవకి ఒక్క పరిచారికనైనా నియమించలేకపొయితిమని బాధ పడని రోజుంటే ఒట్టు "
"అబ్బో ..........ఈ వెటకారాలకేం తక్కువ లేదు రాజా వారికి " అంత సుకుమారి వైతే పుట్టింటి నుంచి పనిమనిషిని తెచ్చుకోవలసింది అనేకదూ మీ దెప్పిపొడుపు"
"హవ్వ.... " " నా మాటకర్ధం అదికాదోయ్" నా వుద్దేసం ............"
"అర్ధం అదే, వుద్దేసం అదే ఆ మాత్రం పసిగట్ట లేని అమాయకురాలిని అనుకున్నారా"?
"అయ్యో ............ నువ్వలా వూరకే బాధ పడుతుంటే నా కేం మాట్లాడాలో తెలియట్లేదు "
"ఇంకేం తెలియాలి అనాల్సిన మాటలెప్పుడో అనేసారుగా "?
" నేనా......ఏమనేసానూ"?
"మళ్ళీ మొదటికొస్తున్నారా ..........నన్నన్న మాట మరిచిపోయారా"?
"అబ్బ ఇంకా అదే సాగదీస్తే ఎలా"
"నేనా సాగదీసింది "?...........నా మానాన నేనుంటే మీరు కదూ వచ్చి అదిపింది"
"కదపక పోతే ఎలా నువ్వల మూతి ముడుచుకుని ,మాట్లాడకుండా వుంటే నేనెలా హాయిగా బ్రతికేసేది"
"ఆహా....... చాల్లెండి బడాయి. అబ్బ .....చెయ్యొదలండి"
"ఆ............అమ్మా"
"అయ్యో ఏవయిందండీ"?
"నిన్ను బాధ పెట్టినదుకు పగ తీర్చుకుంది కామోలు"......... "నీ గాజు గీసుకుంది"
"అరెరే రక్తం వస్తుందండీ, లోపలికి తెగిందల్లే వుంది . అయ్యయ్యో ఆ చెయ్యిటివ్వండి "
"పర్వాలేదు నా కీ శాస్తి జర్గాల్సిందే
'చీ ,చీ పాపిస్టిదాన్ని అంతా నావల్లే , "చెయ్యి విదిలించి కొట్టాను"
"ఏం కాదులే కొద్దిగానేగా తెగింది"
"ఇంత రక్తం పోతుంటే కొద్దిగా అంటారేం "
"అయ్యో నేనింత పట్టుపట్టాల్సింది కాదు .మూర్ఖపు పీనుగని మీ రక్తం కళ్ళ చూసేవరకూ వదల్లేదు "
"లేదులే నేనా మాట ............."'
" చిరాకులో మొగుడో మాటం టే మటుకు ఇంత రాద్ధంతం చెయ్యాలా ......అంతా నావల్లే"
"నేనసలామాట.............."
" మళ్ళీ ఆ మాటెత్తితే నా మీద ఒట్టే "
"అదికాదోయ్............"
" ఇక చాల్లే వూరుకోండి " "అయినా మీకన్నా వుండక్కరలా'? నేను మిమ్మల్ని అంతలేసి మాటలంటూంటే మీరైనా ఒక్క గసురు గసిరితే ఆగేదాన్ని కాదా.....ఇది ఇంతవరకూ వచ్చేదా"??????
" ఆ............"
"ఆ............."

గెంతు రాజా గెంతు !

http://indralokam.wordpress.com(indra-ఇంద్ర లోకం )

పది అయ్యింది.
రాత్రి పది అయ్యింది.
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది.
ఇంట్లొకి వచ్చి షూ విప్పాను.
బెల్ట్ తీసాను.
అమ్మ, సుప్రజ నా వైపు భయంగా చూశారు.
బెల్ట్ చూసి భయపడ్డారేమోనని బెల్ట్ దాచేసాను.

ఇంకా అలానే చూస్తున్నారు. అప్పుడు గమనించాను.
టివిలో ఏదో ప్రొగ్రాం వస్తుంది. ఎవడో మూతి దగ్గర పెట్టుకోవలసిన మైక్ ని ముక్కు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు.

“అంతా బాగుంది కాని, నువ్వు కాళ్ళతో వెసిన స్టెప్స్ అన్నీ చేత్తొ వేస్తే ఇంకా బాగుండేది.”
“లేదు మాస్టర్, నేను వెయ్యలేను. ఎందుకంటే.. ఎందుకంటే.. నా చిటికిన వేలి గోరు విరిగింది.” అని ఏడ్చింది స్టేజ్ మీద కుక్కకి తిక్క తగిలితే చించిన గుడ్డలతో కుట్టిన గౌను వెసుకున్న చిన్నది. (గమనిక: చిన్నది – చినిగి పోయిన చిన్న డ్రెస్ వేసుకున్నది.)

(ఆలొచిస్తే గుర్తుకు వచ్చింది ఏదో ‘ఫోన్ కొట్టు..నన్ను పట్టు..’ ప్రొగ్రాంలో చూశాను ఈ పిల్లని. అక్కడ ఎవరో కొడితే ఇక్కడ పడినట్లుంది.)

స్లో మోషన్ లో ప్రేక్షకుల మొహాలు ఒకసారి చూపించారు.
కొందరు ఏడుస్తున్నట్లున్నారు.

“బంక మాస్టార్ మన శిల్పకి ఎన్ని మార్కులు ఇచ్చారో తెలుసుకునేముందు మన గెంతు రాజా గెంతు లో ఒక చిన్న (30నిమిషాలు) బ్రేక్ ” అని తన చేతులు గాలిలొ లేపి ఊపి కెమేరాని గుద్దింది.

ఆ గుద్దుకి నేను ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
ఇప్పుడు తెలిసింది వాళ్ళ ఎక్స్ ప్రెషన్ కి గల కారణం. అది భయం కాదు. ఆందోళన.
(డైలీ సీరియల్స్ చూసి చూసి ఎప్పుడు ఏ ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో మర్చిపోయారు.)

హడావిడిగా వంట గదిలోకి వెళ్ళారు నాకు డిన్నర్ రెడీ చెయ్యడానికి.
సొఫాలో కూర్చుంటూ టివి రిమోట్ అందుకుని చానల్స్ మార్చసాగాను.

ఒక న్యూస్ చానల్
“పంది ఇంకా లింగం చుట్టూ తిరుగుతునే వుంది. మరిన్ని వివరాలకు అక్కడే కుక్కలాగా కాచుకుని వున్న రామక్రిష్ట్నని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు రామక్రిష్ట్న.”

ఇంకో చానల్
“నువ్వు ఎంచుకొన్న రాగం ఏంటి…నువ్వు పాడుతున్న తాళం ఏంటి..” ఎవడో బోడి గుండు వెదవ 3ఏళ్ళ పాపని బెదిరిస్తున్నాడు.

ఇంకో చానల్
“మీ టివి వాల్యుం కొంచం తగ్గిచండి.”

ఒక చానల్లో
ఒక కుటుంబం మొత్తం దేనిగురించో మాట్లాడుకుంటుంది. జాగ్రత్తగా గమనించాను. అందులో ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవుడు ఒకేలాగ ఉన్నారు.
ఒకేలాగా ఎంటి.. ఒక్కడే… మన ‘కమలాకర్ ‘ (పేరు మార్చడం జరిగింది). ఏదో చానల్లో కొడితే ఈ చానల్లో పడ్డాడు.

మరో చానల్లో
“కావ్య ప్రదీప్ ని కలుసుకుంటుందా? సుశాంత్ మొబైల్ బిల్లు ఎంతవచ్చింది? తులసమ్మ ఏమి పీకుతుంది? అని తెలుసుకోవాలంటే ‘ దిక్కుమాలిన బ్రతుకులు ‘ చూడండి”

ఇంకో చానల్లో
“…ఇదంతా తెలియని రామయ్య యదావిదిగా ఇంటికి వచ్చాడు. ఇంటిముందున్న కుక్కని కాలుతొ తన్నాడు. అప్పటివరకు నిద్రపోతున్నట్లు నటిస్తున్న కుక్క అతని పిక్క పట్టుకొంది.”
స్క్రీన్ మీద ‘ కల్పిత పాత్రలతో’ (కుక్కతో సహా) అని వుంది.

ఇంకో చానల్లో
“…దానమ్మకి కోపం వచ్చింది. ఇప్పటివరకు దాన్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు. నీ ఎంకమ్మ, అనవసరంగా దాని పిల్లను తెచ్చావ్.”
డైనోసార్ జీప్ ని పడేసి తొక్కుతుంది. ‘జురాసిక్ పార్క్’ తెలుగులో వస్తుంది అనుకుంటా…

మరో చానల్ మార్చాను.
“ఇక్బాల్ కి స్వైన్ ఫ్లూ వస్తుందంట.”
స్క్రీన్ మీద అడవి పందులు దేన్నొ పీక్కు తింటున్నాయ్. ‘ నెషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ‘.
నేను షాక్ తిన్నాను. ఇంగ్లిష్ ఛానల్లో తెలుగు మాటలేంటానని మ్యూట్ లొ పెట్టాను.

అప్పుడు తెలిసింది ఆ మాటలు వంట గదిలోనుండి వస్తున్నాయని.

ఆసక్తిగా విన్నాను.
” …స్వైన్ ఫ్లూ నా? ఎలా వచ్చింది? ఇక్బాల్ అమెరికా వెళ్ళలేదే?”
“వెన్నెలని ఎయిర్ పొర్ట్ లో డ్రాప్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు అటాక్ అవుతొందంట.”
“అబ్బ పాపం ఇక్బాల్ కి అన్ని కష్టాలు వెన్నెల వల్లనే.”

నేను అటెన్షన్లోకి వచ్చెసాను.

“ఇందాక అనసూయ ఆంటి సన్ టివీలొ తమిళ్లో చూసిదంట.”
ఇప్పుడు నాకు పూర్తిగా అర్దమయ్యింది వాళ్ళు దేని గురించి మాట్లడుకుంటున్నారో…”మొగలి రేకులు పిచ్చి ఆకులు” అనే సీరియల్ గురించి…
నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మొదలైనట్లు గుర్తు.

“ఐనా అనసూయ ఆంటీకి తమిళ్ ఎలా వచ్చింది? వాళ్ళు ఎప్పుడైనా చెన్నైలో ఉన్నారా? స్కూల్ తమిళ్ మీడియంలో చదివిందా? మీ ప్రశ్నకు సమాధానం ‘ అవును ‘ ఐతే …..”
“అయ్య బాబోయ్.. కొంచం సేపు టివి చూస్తేనే ఇలా ఆలోచిస్తున్నానేంటి..”

అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు ఒక భయంకరమైన నిజం.

వాళ్ళు కొన్ని రోజులు ‘ చెన్నై షాపింగ్ మాల్ ‘ పక్క వీదిలో ఉన్నారు.

నా డిన్నర్ రెడీ అయ్యింది.
వాళ్ళెందుకో కొంచం హడవిడిగా కనిపించారు. దేని కోసమో వెతుకుతున్నట్లున్నారు.
సుప్రజ కళ్ళు నా చేతిలొ ఉన్న రిమోట్ మీద పడ్డాయి. మొహంలో ఆందొళన కనిపించిది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆనందం అని తర్వాత తెలిసింది.)

నేను రిమోట్ ఇచ్చేసాను.

“వెల్కం బ్యాక్ టూ గెంతు రాజా గెంతు.” టివిలో ప్రొగ్రాం మొదలైంది.

నేను డిన్నర్ చేస్తున్నంత సేపూ ఏవో అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించాయి. అప్పుడప్పుడు కొన్ని ‘బీప్’లు కూడా వినిపించాయి.

డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళ వేపు చూసాను. వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించింది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆందోళన అని అప్పుడే అర్ధమయ్యింది.)

నేను నా ‘లాప్ టాప్’ ఆన్ చేసి ఈ కధ వ్రాయడం మొదలు పెట్టాను.

(అయిపోయింది.)

“చెత్త చెత్త సీరియల్స్ తో, పరమ చెత్త ప్రొగ్రాములతో, బ్రేకింగ్ బేకింగ్ న్యూస్ లతో ప్రేక్షకులని హింసిస్తున్న టివి చానల్స్ కి నా ఈ కధ అంకితం.”

నా తరై -నా తరై

http://naatarai.blogspot.com/2009/03/blog-post.html?showComment=1266951664279#c4594426609512046870




చాలా రోజుల క్రితం "బాబాయ్ అబ్బాయి" అని జంధ్యాల గారి సినిమా ఒకటి వచ్చింది - బాలకృష్ణ, "సుత్తి" వీరభద్రరావు ముఖ్య తారాగణం. దాంట్లో "సుత్తి" గారి ఊత పదం "నా తరై". దానికి అర్ధం అప్పట్లో నాకు తెలియలేదు. కాని కొన్నాళ్ళ తర్వాత కరుణానిధికి కళ్ళద్దాలు లాగా, రజనీకాంత్ కి సౌండ్ లాగా ఎప్పడు నా వెంట ఉండే దురదృష్టం నన్ను లటుక్కని లాగేసి చెన్నై అనబడు చీకటి కూపం లోకి తోసేసింది. అక్కడ ఎటు చూసినా జాంగ్రీలు జిలేబిలు కలిపి వేసేసినట్టు ఉండే అక్షరాలు, గులకరాళ్ళని గ్లాసులో వేసి గిరా గిరా తిప్పినట్టు ఉండే శబ్దాలు అర్ధమయ్యి అలవాటయ్యాక తెలిసింది గురువుగారి చమత్కారం. అప్పటి నుంచి ఆ పదం నాకు తెగ నచ్చేసింది("నా తరై" అంటే నేను ఇస్తాను అని అర్ధం. మీకు కూడా గురువుగారి చమత్కారం అర్ధం కావాలంటే మీరు ఆ సినిమా చూడాల్సిందే).



ఎందుకో తెలియదు గాని అరవ వాళ్ళుఅంటే గురువుగారికి కూసింత కచ్చి అని నా అభిప్రాయం. రెండు సంవత్సరాలు చెన్నైలో కాలాపానీ అనుభవించాక నా అభిప్రాయానికి ఊతం వచ్చింది. నాకు జీవితం అంటే విరక్తి వచ్చింది. అర్ధరాత్రి ఐదు గంటలకి చూసినా తెల్లవారు ఝామున తొమ్మిది గంటలకి చూసినా సిటీ బస్సుల్లో నిండా జనం, రజనీకాంత్ కి జుట్టు మొలిస్తే చూడటానికి వెళ్తున్నట్టు, బాలకృష్ణ సినిమా ఇంటెర్వెల్లో గేట్లు తీసేసినట్టు, జనం.



శివుడికి నెత్తి మీద గంగ ఉందో లేదో తెలియదు గాని అక్కడ సిటీ బస్ లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ ఒక శివుడే. ప్రతి ఒక్కరూ కైలాసం నుంచి దిగి వచ్చిన ఫీలింగ్‌కి లోనవుతారు. ఇలా అనటానికి సర్వాంగాలని తడిపేసే గంగా ప్రవాహం ఒక్కటే కారణం కాదు. బస్సులో ప్రయాణించే శివంగులు కూడా. అక్కడ అందరు ఆడవాళ్ళు పొద్దున్నే లేచి పూజ చేసి, కమండలంలో నీళ్ళు నింపుకుని, బస్ ఎక్కుతారు. పురుష శ్పర్శ్య కాదు కదా ప్యాంట్ నీడ పడినా శపించేస్తారు. అందుకనే అక్కడ బస్ ఎక్కగానే అందరు మగవాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తారు - "ఈ బస్ లో ప్రయాణించే ఆడవాళ్ళు అందరు నాకు చెల్లి లేదా కూతురితో సమానం (మీకు అభ్యంతరం లేకపోతే అక్కా లేదా తల్లి అని కూడా ఫిక్స్ అవ్వచ్చు). వాళ్ళని నేను తాకను. తాకినా ఆనందపడను. ఆనందపడినా వాళ్ళకి తెలిసేలా ఆనందపడను.సూపర్ గుడ్ ఫిల్మ్స్ లొ హీరొలా ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతానికి స్టెప్స్ వేస్తూ బస్ దిగుతాను. అందరి సానుభూతి చూరగొంటాను".



చెన్నై గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం ప్రస్తావించవలసిన ఇంకొక గొప్ప విషయం - నీరు. బంగారం లాంటి నీరు. నేను చెప్తున్నది నీటి రంగు గురించి. ప్రతి వీధికి ఒక గుడిని చూసి వాళ్ళ దైవభక్తికి అబ్బురపడిన నేను, వాటర్ టాంకెర్ దగ్గర నీళ్ళ కోసం వాళ్ళు చేసే వయొలెన్స్ చూసి విస్మయం చెందాను. కొన్నాళ్ళకి ఆ ఫీలింగ్ వికారంగా రూపాంతరం చెందింది. అన్ని రంగాల్లో అణగతొక్కబడ్డ స్త్రీలు ఈ విషయం లొ మాత్రం అక్కడ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. (చెన్నైలొ నూటికి నూటపదిమంది వాటర్ టాంకర్ లొ వచ్చే నీళ్ళ మీద ఆధారపడతారు). వాటర్ టాంకర్ రాగానే రంగు రంగుల బిందెలతో, నోటినిండా బూతులతో లబ లబ మంటూ ఆడవాళ్ళు , వాళ్ళతో పాటు కలం కాగితాలతొ ఆహా ఓహొ అంటు కొంతమంది మగవాళ్ళు వచ్చేస్తారు. మొదట్లో ఈ రెండో బ్యాచ్ ఎవరొ అర్ధం కాలేదు. తర్వాత తెలిసింది వాళ్ళు కొత్త సినిమా పేర్లు కొసం, డైలాగ్స్ లొ పంచ్ లైన్స్ కొసం వెతుక్కునే తమిళ సినీ రైటర్స్ అని (ఈ మధ్యనే శింబు హీరో గా రిలీజ్ ఐన "నాటుకట్టి అడిపట్టి" అనే సినిమా టైటిల్ అక్కడ నుంచి వచ్చినదే. దీనిని తెలుగులోకి "కపాలం కన్నుకొట్టింది" అన్న పేరుతో డబ్ చెయ్యబోతున్నారు.)



నీళ్ళ విషయంలో చెన్నై వాసులకి దేవుడు చాలా అన్యాయం చేసాడని అక్కడి వాళ్ళ గట్టి నమ్మకం. నాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే ఒక రొజు ఎదురింటి ఆర్ముగం గాడు ప్రార్థన చేస్తుండగా విన్నాను. "దేవుడా!! ఓ మా మంచి దేవుడా! మాకు అన్నీ ఇచ్చావు. తాగటానికి సాంబార్ ఇచ్చావ్, తినటానికి ఇడ్లీలు ఇచ్చావ్, ఎత్తుకోవటానికి లుంగీలు ఇచ్చవ్, లోపల వేసుకున్నా బయటకి కనిపించేటట్టు చారల చడ్డీలు ఇచ్చావ్, ఎండా కాలంలో ఎండ ఇచ్చావ్, చలి కాలం లొ కూడ ఎండ ఇచ్చావ్, వర్షం పడినప్పుడు బురద ఇచ్చావ్, వర్షం పడనప్పుడు గబ్బు ఇచ్చావ్, అరవటానికి "అరవం" ఇచ్చావ్("అరవం" "అరవం" అంటూనే ఎందుకు అంత అరుస్తారో నాకు అర్ధం కాదు), కంటి నిండా సరిపోయే హేరోయిన్లని ఇచ్చావ్. కాని దేవుడా! ఇన్ని ఇచ్చిన నువ్వు ఎందుకు కావేరిని మాత్రం కర్ణాటకకు ఇచ్చావ్??!!!"

28, మార్చి 2010, ఆదివారం

శభాష్ శభాష్ శభాష్ 1

http://ayaskantam.blogspot.com/2009/04/1_29.html (అయస్కాంతం.....ఆకర్ష ఆకర్ష !!!-ashok varma)




మనం చేసే కొన్ని పనులు, అబ్బా మనలో ఇంత మ్యాటర్ వుందా అని మనకే సందేహం తెప్పించి మనల్ని మనమే మెచ్చుకునేలా చేస్తుంటాయి. అదేదో సినిమాలో కోట తన భుజాన్ని తనే తట్టుకుంటూ... 'శభాష్ శభాష్ శభాష్' అనుకుంటాడు...
సరిగ్గా అలా అనుకున్న సంఘటనలను ఇక్కడ పోస్టుతాను.

--------------------------------

మా పేరంట్స్ నాకు పెళ్ళి చేసేయ్యాలని డిసైడ్ అయిపోయి సెర్చింగ్ మొదలెట్టారు. ఆళ్ల దృష్టిలో మనం ఇంకా హమామ్ బాయ్ కాబట్టి ఆ ఇమేజ్ డామేజ్ కాకుండా కాపాడుకుంటూ, మన ప్రయత్నం మనమూ చేద్దామని telugumatrimony.comలో ప్రొఫైల్ యాక్టివేట్ చేసా.

ఒక అమ్మాయి ప్రొఫైల్ నచ్చడంతో 'Express Interest' కొట్టా. అందులో ఫొటో లేదు, సో ఫొటో రిక్వెస్ట్ పెట్టాను. నేను మాత్రం నా దగ్గరున్న ఖర్చీఫ్ డీటేల్స్‌తో సాహా అన్నీ నా ప్రొఫైల్‌లో పెట్టేసా. నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది తను నా ఇంటరెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిందని.

అస్సలు చిక్కు ఇక్కడే మొదలయ్యింది. నేను పెయిడ్ మెంబర్ కాదు, తను కూడా కాదు. ఇద్దరి ప్రొఫైల్స్‌లో ఫోన్ నంబర్స్ యాడ్ చేసి వున్నాయి కాని పెయిడ్ మెంబర్స్ మాత్రమే చూడగలరు. జీవితంలో ఇంటర్నెట్‌లో నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. కాని లైఫ్ మ్యాటర్ కాబట్టి ఓ పది రుపాయలు...ఇరవై రుపాయలు వుంటే కట్టేద్దాంలే అని రెండు రోజులు ఆలోచించాక కన్విన్స్ అయ్యా. కానీ వాళ్ళ ఫీ చూస్తే...3 నెలలకే 1500 పైన వుంది. ఆ పైన ఇంకా చాలా రూల్స్, తొక్కా తోటకూర చాలా వున్నాయి. ఒక వేల ఈ అమ్మాయికీ, నాకు సెట్ అవ్వకపోతే ఆ అమౌంట్ బొక్క కదూ అని పెయిడ్ మెంబర్‌షిప్ వద్దనుకున్నా.

మొత్తానికి ఇద్దరం పర్లేదు అనదగ్గ పీనాసులం కావడంతో, మ్యాటర్ ముందుకు జరగకపోవడంతో ఆ సైట్ వాళ్ళు సినిమాల్లో విలన్లలా కనిపించారు. ఫోన్ నంబర్ వుంది అని వుంటుంది కాని తెలియాలంటే పెయిడ్ మెంబర్ అవ్వు అంటుంది. ఇలా కాదు ఎలాగైనా ఆ అమ్మాయి కాంటాక్ట్ పట్టాలని డిసైడ్ అయ్యా.

అస్సలు ఆ సైట్ వాళ్ళు ఎంత మాత్రం సైట్ మెయింటేన్ చేస్తున్నారో చూద్దామని నా ప్రొఫైల్‌లో 'About Me' మార్చా, ' ఐ లవ్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్ లైక్ అయస్కాంతం.కామ్ ' అని యాడ్ చేసా. ఆ అమ్మాయికి మినిమం బల్బ్ వెలిగే క్యాపబిలిటి వుంటే ఆ సైట్ చూసి అందులో 'Contact Us' మెను ఐటమ్ నుంచి నా మెయిల్ ఐడి పట్టుకొని ఈజీగా కాంటాక్ట్ అవ్వొచ్చు అన్నది నా అవిడియా. కాని నా ప్రొఫైల్ సేవ్ చెయ్యగానే, 'u r profile is under validation, will be updated in 24 hrs' అని వచ్చింది. అమ్మో వీళ్ళు భలే హుషారు గున్నారే అని అనుకున్నా. మరుసటి రోజు ఆ సైట్ వాళ్ళు మెయిల్ కొట్టారు. మాష్టారు మీరు పర్సనల్ డీటెయిల్స్ తెలిసేలా మ్యాటర్ పెడుతున్నారు. ఇలా పెట్టడం మా పాలసీకు విరుద్ధం, దయ చేసి ఇక మీదట ఇలా చెయ్యకండి అని చెప్పి.. ' ఐ లవ్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్ ' వరకే పెట్టి నెక్స్ట్ ముక్క కట్ చేసారు. మామా నీలో తెలంగాణ శకుంతల పూనినట్టుంది ( 'నువ్వు నేను ' సినిమాలో) అనుకుని ఛ అనుకున్నా.

నాలో ఇంక పావు కిలో పౌరుషం పెరిగింది. అంతే వెంటనే తన ప్రొఫైల్‌ని జల్లెడ పట్టా. ఆ అమ్మాయి పేరు కాస్త యూనిక్‌గా వుంది - పల్లవి చరణ్ (పేరు మార్చబడింది). ఏజ్, హైట్, వెయిట్, తను వర్క్ చేసే కంపెని పేరు, తన సొంత వూరు మాత్రమే వున్నాయి. స్కూల్, కాలేజ్ డీటేల్స్ లేవు. వాళ్ల కంపెనీలో కూడా తెలిసిన వారు లేరు. తెలుసుంటే తన పేరుతో అడిగి తెలుసుకోవచ్చు. వెంటనే ఆర్కుట్‌లో ఆ అమ్మాయి పేరుతో వెదికా. ఒకటి రెండు ప్రొఫైల్స్ వచ్చాయి. కాని అవి 100% ఇన్‌కంప్లీట్ ప్రొఫైల్స్ అని అర్థమయ్యింది. సో ఈ అమ్మాయికి ఆర్కుట్‌తో టచ్ లేదు అని తెలిసింది. గూగుల్, JNTU సైట్స్...వగైరా ట్రై చేసినా నో లక్. కానీ ఎలాగైనా కనుక్కోవాలి, telugumatrimony.comను బైపాస్ చెయ్యాలి అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యా. అప్పుడు తట్టింది, మిలియన్ డాలర్ ఐడియా. అఫ్‌కోర్స్ మరీ అంత కాకపోయినా, మూడు నెలల సబ్‌స్క్రిప్‌షన్ ఫీ అంత ఐడియా.

పల్లవి చరణ్ - ఇలాంటి పేరు చాలా తక్కువ మందికి వుంటుంది అని అనిపించి వెంటనే
pallavi.charan@gmail.com
pallavi_charan@gmail.com
pallavi.charan@yahoo.com
pallavi_charan@yahoo.com
ఇలా రక రకాల కాంబినేషన్స్‌తో 16 మెయిల్ ఐడిలు తయారు చేసా. అన్నింటినీ CCలో పెట్టి, కామన్ మెసేజ్ కొట్టా:
" హాయ్ మీరు ఫలానా కంపెనీలో వర్క్ చేసే పల్లవి చరణ్ ఐతే, ప్లీజ్ రీడ్ ఫర్‌దర్ ఆర్ ఎల్స్ ఇగ్నోర్ దిస్ మెయిల్. నేను సో అండ్ సొ.....telugumatrimony.comలో ఎక్స్‌ప్రెస్స్‌డ్ ఇంటరెస్ట్. మీరు వారే ఐతే డూ రిప్లై మీ." అని మెయిల్ చేసా.
వెంటనే 14 మెయిల్ ఐడీలు బౌన్స్ అయ్యాయి. కానీ మిగతా 2 అన్నా కరక్ట్ ఐడిలు అని తెలిసింది. తర్వాత తిని తుంగున్నా. సాయంత్రం మెయిల్ అకౌంట్ ఓపెన్ చెస్తే, టు మై సర్‌ప్రైజ్ సరిగ్గా ఆ అమ్మాయి నుంచే రిప్లై వచ్చింది. తను టూ మచ్‌గా థ్రిల్ అయ్యింది. తన ఫోన్ నంబర్ ఇచ్చింది !!!
నాకు ఇంత కన్నా హ్యాపీ అనిపించిన విషయం, ద్వార పాలకుడిగా బిల్డప్ ఇచ్చిన telugumatrimony.com టోల్ గేట్‌ను బ్రేక్ చెయ్యడం. శబ శబ శభాష్....అని నన్ను నేను చాలా మెచ్చుకున్నా. కుదిరితే ప్రొఫెషనల్ CVలో పెట్టుకోదగ్గ పాయింట్ అన్న రేంజ్‌లో పొగుడుకున్నా !!!.

12, మార్చి 2010, శుక్రవారం

శ్రీ ఏసుక్రీస్తుడు

http://anilroyal.wordpress.com ((తెలుగోడు- అబ్రకదబ్ర ))

* * * * * * * *

All characters and incidents in the following piece of work are purely fictional and bear no resemblance to persons living or dead and places and times

* * * * * * * *



“ఏదీ, ఇప్పుడోసారి మొత్తం కథ టూకీగా చెప్పు”

“మన కథానాయకుడు జమీందార్ల ముద్దుబిడ్డ. చిన్నప్పుడు దుష్టరాజు తరమటంతో అతని తల్లిదండ్రులు బీహారు తీసుకెళ్లి పెంచుతారు. యుక్తవయసులో మరదళ్లతో ఆడిపాడుతూ జాలీగా గడిపేస్తుండగా ఓరోజు హిమాలయాల్లో ముని శాపానికి గురౌతాడు. దాంతో జ్ఞానోదయమై ఆస్థిని త్యజించి ప్రజలకి శాంతిమార్గం బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. అతని పేరుప్రఖ్యాతులు చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజును రెచ్చగొట్టి హీరోకి మరణశిక్ష పడేలా చేస్తారు. క్లైమాక్స్‌లో ఉరి తీయబడ్డ హీరో - తల్లి పాడిన ఆవేదనాభరిత పాటకి దేవుడు కరిగి కరుణించటంతో - మళ్లీ బతుకుతాడు. కథ సుఖాంతం”

“బాగుంది. ఇది ఫైనల్ చేద్దాం”

“అలాగే గురూజీ. ఐతే .. నాదో చిన్న అనుమానం”

“ఏమిటది?”

“ఇది ఏసుక్రీస్తు కథ అని ఎవరికీ అర్ధమవదేమో .. ??”

* * * * * * * * * * * *

(వారం క్రితం)

“హలో, జి.హెచ్.భైరవి స్పీకింగ్”

“నేను .. జె.వైభవేంద్రరావు, సి.ఎ”

“గుడ్‌మోణింగ్ గురూజీ. చాన్నాళ్ల తర్వాత ఫోన్! ఏమిటి విశేషం?”

“కొత్త పౌరాణిక చిత్రం తీసే ఆలోచనలో ఉన్నా. అందుకే నీకు ఫోన్”

“భలే. నా పెన్నుకి మళ్లీ పని. ఈ సారెవరి గురించేం?

“ఏసు క్రీస్తు”

“అదేం .. మన పురాణాలు బోలెడున్నాయిగా!!”

“ఎప్పుడూ అవే తీస్తే మొనాటనీ వచ్చేస్తుందయ్యా. అందుకే ఈ సారి రొటీన్‌కి భిన్నంగా వెళ్దామని. అదీకాక, ఇప్పుడు పాత తెలుగు సినిమాలకి రీమేక్కొట్టే ట్రెండ్ నడుస్తుంది కదా”

“నిజమే గురూజీ. అసలా ట్రెండ్ మొదలెట్టిందే మనం. అలనాటి గోండురంగ మహత్యం పట్టుకుని మొన్న గోండురంగడు తీసేశాం. ఇప్పుడు పాత కరుణారసమయుడుని రీమేక్ చేసేద్దాం”

“రీమేకే కానీ మన బాణీలో ఉండాలి”

“అర్ధమైంది. హీరో ఎవరేంటి మరి?”

“ఇంకా ఎవరూ అనుకోలేదు”

“యువవజ్ర గోలకృష్ణ ఐతే బాగుంటుందేమో?”

“వద్దులే. ఉన్న డబ్బంతా ఆయన విగ్గులకే ఐపోతుంది. సెట్టింగులకి ఇంకేమీ మిగల్దు. మొన్న గోండురంగడికీ అంతే అయింది. దానికి తోడు మొత్తం లిప్‌స్టిక్కులు, మేకప్పు సామాన్లు కూడా ఆయనకే వాడేసే సరికి పాపం హీరోయిన్ ‘కుమారి’ స్నేషకి మేకప్ లేకుండానే లాగించాల్సొచ్చింది”

“ఔనౌన్నిజమే. పైగా తొడకొట్టే సీన్ ఒక్కటన్నా లేకపోతే ఆయనొప్పుకోడు. ఏసుక్రీస్తు తొడకొడితే బాగోదేమో. పోనీ .. బుల్లిబాబు లక్కినేని గానార్జున ఐతే? ఈయన మనకి లక్కీ మస్కట్ కూడాను. రెండు హిట్లు తీశాంగా ఈయన్తో. ఇంకా, బుల్లిబాబైతే ఎంచక్కా ఎంత కావాలంటే అంత సొంత జుట్టు, గెడ్డం కూడా పెంచుకుంటాడు. ఆ వారా మనకి విగ్గుల ఖర్చు మిగులుద్ది”

“బుల్లిబాబైతే బానే ఉంటుంది కానీ ఈయనీ మధ్య దుష్ట గాంక్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నాడు. తెల్సు కదా, నేను తెలుగురాష్ట్రం వాడ్ని. బుల్లిబాబొద్దులే”

“మరి పరంజీవి ఐతే? పురాణ పాత్రలెయ్యాలనే గుల వీరిక్కూడా ఉంది. అందుకే కదా శ్రీచెంచునాధలో చిన్న పాత్రే ఇచ్చినా ఎగిరి గంతేసి చేసేశారు. ఇప్పుడు ఫుల్‌ప్లెడ్జ్‌డ్ రోల్ అంటే మహదానందంగా ఒప్పుకుంటారేమో”

“ఏమయ్యా భైరవి. బొత్తిగా లోక జ్ఞానం లేదు నీకు. పరంజీవి సినిమాలు మానేసి సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు తెలీదా? ఎప్పుడూ పురాణాలే కాకుండా అప్పుడప్పుడూ న్యూస్‌పేపర్లూ చదూతుండాలయ్యా”

“ఓ. పరంజీవి సినిమాలు మానేశారా? మరి ఇంకెవరున్నారబ్బా?”

“తుమ్ముబాటి సంకటేష్ ఐతే ఎలా ఉంటాడని ఆలోచిస్తున్నా”

“అద్భుతం సార్, సూపర్ ఐడియా. ఈయనొక్కడితోనే మనం పౌరాణికం తియ్యలేదు ఇందాకా. ఫ్యామిలీ హీరోగా సంకటేష్ ఇమేజ్ కూడా మన సినిమాకి ప్లస్సవుద్ది. ఏసుక్రీస్తు పాత్ర ఈయనకి టైలర్ మేడ్ రోల్. ఇంకెందుకాలస్యం, సంకటేష్‌నే ఫైనల్ చేసెయ్యండి సార్”

“అదే అనుకుంటున్నా. పైగా వీళ్ల నాన్న మా తెలుగురాష్ట్రం పార్టీవోడే. సంకటేషే ఫైనల్”

“ఇంతకీ, సినిమా పేరు ఏమనుకుంటున్నారు”

“శ్రీ ఏసుక్రీస్తుడు”

“అబ్బో అదిరిపోయింది. పేర్లోనే తెలుగు నేటివిటీ కుమ్మేశారు”

“నేనెప్పుడూ చెబుతా కదా. నేటివిటీ లేపోతే సినిమా ఎంత బాగున్నా ఫ్లాపే. మొన్న గోండురంగడు అంత బాగుండీ ఢామ్మనటానిక్కారణం దాన్ని బ్యాంకాక్‌లో తియ్యటమే. ఈసారలాంటి సిల్లీ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడాలి సుమీ”

“ఔనౌను. పైగా గోండురంగడు థాయ్ అమ్మాయిల్తో గెంతులేసినట్లు కూడా చూపించాం. అదే దెబ్బ కొట్టింది”

“అలాంటి తప్పులు మళ్లీ దొర్లకూడదు. ఏసుక్రీస్తు మీద తెలుగు సినిమా తీస్తే ఆయనది రాయలసీమో, తెలంగాణో అని చూపించాలి. నేటివిటీ ముఖ్యం …. ఏమ్ముఖ్యం?”

“అర్ధమైంది సార్. సినిమాకి నేటివిటీ ముఖ్యం”

“భేష్. అందుకేనయ్యా నువ్వు నాకు నచ్చుతావ్. ఏం చెప్పినా ఠకీమని పట్టేస్తావ్. సరే, నేను సంకటేష్‌కి ఫోన్ చేసి కాల్షీట్ల గురించి మాట్లాడాలి. నువ్వు కథొండే పని మీదుండు”

“ఆగండాగండి, ఫోన్ పెట్టేసేముందు .. క్రీస్తు గురించి ఏవన్నా రిఫరెన్సు బుక్కులుంటే ఇద్దురూ”

“బైబిల్ చదవ్వయ్యా. అంతకన్నా పెద్ద రిఫరెన్సేముంటది”

“అలాగలాగే. ఐతే నేనో వారం తర్వాత కలుస్తా, స్చ్రిప్టుతో సహా”

“మంచిది. బై ఇంక”

“బై”

* * * * * * * *

(ప్రస్తుతం)

”నమస్తే గురూజీ”

“రావయ్యా భైరవి. కూర్చో. ఎంతవరకూ వచ్చిందేమిటి స్క్రిప్టు?”

“రెడీ సార్. వింటారా?”

“ఊఁ కానీ”

“జనాభా లెక్కల కోసం జోసఫ్ మేరీతో కల్సి సొంతూరికి బయల్దేరటంతో సినిమా మొదలౌతుంది. గాడిదల మీద ప్రయాణం, ఎక్కడా ఆశ్రయం దొరక్కపోటం, ఎక్కే గడపా దిగే గడపా, పశువులపాకలో క్రీస్తు జననం, ముగ్గురు జ్ఞానులు రావటం .. ఇదంతా టైటిల్సప్పుడు చూపిస్తాం. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా ఉంటుంది”

“బావుంది, బావుంది. జోసఫ్ పాత్రకి పాత సినిమాలో క్రీస్తు వేషమేసినాయన్ని పెడదాం. మేరీ ఎవరనేది చూడాలి. మదర్ సెంటిమెంటు కురిపించేవాళ్లు కావాలి”.

“జోసఫ్‌గా విజయసుందర్? అబ్బో .. మీకు మీరే సాటి గురూజీ. వెరీ యాప్ట్ ఛాయిస్”

“సరె, సరె. తర్వాత?”

“టైటిల్స్ తర్వాత, బాల ఏసుని చంపేయమని హేరోదు సైనికుల్ని పంపిస్తాడు. అప్పుడు మేరీ, జోసఫ్ ఏసునెత్తుకుని ఈజిప్టుకి పారిపోతారు”

“భలే. ఇక్కడో సిటుయేషనల్ సాంగ్ పెట్టొచ్చు. ‘బ్రోచేవారెవరురా’ బావుంటుంది”

“క్రీస్తు కథలో త్యాగరాజ కీర్తనా!?!”

“చెప్పా కదయ్యా. నేటివిటీ, నేటివిటీ ముఖ్యం”.

“ఓహ్. మర్చిపోయా సార్. అలాగే .. బ్రోచేవారెవరురా బాగుంటుంది. ఏసుబోస్ గారితో పాడిద్దాం”

“ఆయన పెద్దాడైపోయాడయ్యా. వాళ్లబ్బాయి వినయ్ ఏసుబోస్‌తో పాడిద్దాంలే. వాళ్ల నాన్నకన్నా బాగా ముక్కుతో పాడతాడు”

“అలాగే గురూజీ. ఇంతకీ సంగీత దర్శకుడెవరు?”

“ఉన్నాడుగా ఆస్థాన విద్వాంసుడు ఎన్.ఎన్.కూరవాణి. యూ కంటిన్యూ”

“ఇక్కడో ..”

“వెయిటే సెకండ్.. ఇందాక ఈజిప్టన్నావు? మార్చెయ్ .. దాన్ని బీహార్ చేసెయ్. హీరో బీహార్లో కొన్నాళ్లుండటం తెలుగు సినిమాల్లో లేటెస్ట్ ఫ్యాషన్. ట్రెండ్‌కి తగ్గట్లుండాలయ్యా”

“కానీ సార్ .. “

“కానీ గీనీ లేదు. కథ .. కథ ముఖ్యమయ్యా - ప్రదేశాలు కాదు”

“సరే గురూజీ. నేపధ్యంలో వినయ్ ఏసుబోస్ ‘బ్రోచేవారెవరురా’ వస్తుండగా బాల ఏసునెత్తుకుని జోసఫ్, మేరీలు బీహారుకి పారిపోతారు”

“దట్స్ మచ్ బెటర్. నౌ, కంటిన్యూ”

“ఇక్కడో డిజాల్వ్ షాట్, ఫేడిన్, తర్వాతో ఎస్టాబ్లిష్‌మెంట్ షాట్. మట్టి ఇల్లొకటి చూపిస్తాం. తర్వాత ఎక్స్‌ట్రీం క్లోజప్. కొయ్యని చిత్రిక పడుతున్న ఏసుక్రీస్తు – అదే మన సంకటేష్ బాబు – చేతులమీదనుండి జూమౌట్ చేస్తాం. హీరో ఇంట్రడక్షన్ కదా, కూరవాణి రీరికార్డింగ్ అదరగొట్టాలిక్కడ”

“ఆగాగు .. చిత్రిక పట్టటమేంటి? టూ సింపుల్. ఇంట్రడక్షన్ సీన్లు రాసేటప్పుడు హీరో ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకోవాలయ్యా. ఆ సీన్ మార్చు. క్రీస్తు పిడికిలి బిగించి ఒక్కటి గుద్దితే దూలం విరిగిపోయినట్లు చూపిద్దాం. అలాగే గుద్ది గుద్ది చెక్కలన్నీ ముక్కలు చేసేస్తాడన్నమాట”

“వావ్. సూపర్ సార్. అందుకే మీరు దర్శకచంద్రులయ్యారు. అలాగే మారుద్దాం. ఒక్కో గుద్దునీ నాలుగైదు యాంగిల్స్‌లో తిప్పి తిప్పి చూపిద్దాం, స్లో మోషన్లో. ఎడిటర్‌కి ఫుల్లు పనే పని”

“సరె, సరె. కంటిన్యూ”

“ఓకే. చెక్కలు ముక్కలయ్యాక క్రీస్తు చెమటలద్దుకుంటూ ఇంటి బయటికొస్తాడు. అక్కడ అప్పటికే ఆయన ఉపదేశాలు వినటానికొచ్చిన జనం వెయిట్ చేస్తుంటారు”

“ఆగాగు మళ్లీ. చెమటలేంటి? హీరోకి చెమటలు పట్టకూడదు. మార్చు. ఇంకోటి .. అప్పుడే ఉపదేశాలేంటి? అవన్నీ సెకండాఫ్‌లో. ఫస్టాఫ్‌లో రొమాన్సేది, డ్యూయెట్లేవి?”

“ఏసుక్రీస్తు కథలోరొమాన్సు .. ?? బైబిల్‌లో అలాంటివి లేవు గురూజీ”

“నువ్వేం మనిషివయ్యా భైరవి. షో సమ్ క్రియేటివిటీ. బైబిల్‌లో లేకపోతే మాత్రం మనం ఇరికించకూడదని ఉందా? ఏం .. అక్కమయ్య, శ్రీఆదిదాసు కథల్లో రొమాన్సు దూర్చలా? ఇదీ అంతే”

“అలా చేస్తే హిందువులొప్పుకున్నారు కానీ క్రైస్తవులొప్పుకోరేమో?”

“అవి లేకపోతే ప్రేక్షకులొప్పుకోరయ్యా. నే చెప్పినట్లు చెయ్యి”

“ఎలా గురూజీ, ఎక్కడ ఇరికించాలి?”

“క్రీస్తు ముప్పయ్యేళ్లొచ్చేదాకా ఏం చేశాడో ఎవరికీ తెలీదు కదా. మనం సరిగా దాన్నే వాడుకుంటాం. ఆ సమయంలో ఆయన డ్యూయెట్లు పాడినట్లు చూపించేస్తే సరి”

“ఎవరితో గురూజీ?”

“ఇంకెవరితో …. మేనమామ కూతుళ్లతో. మొత్తం ముగ్గురు. ‘కుమారి’ స్నేష, ‘కుమారి’ త్రిహ, ‘కుమారి’ అనూహ్య ఐతే మంచి స్టార్ వాల్యూ కూడా వస్తుంది సినిమాకి. బిజినెస్ అదిరిపోతుంది”

“క్రీస్తు మేనమామ గురించి బైబిల్‌లో లే ..”

“లేకపోతే మనం పుట్టిద్దాం. ఎం.బేలయ్యతో ఆ పాత్ర వేయిద్దాం. రాసెయ్. ఎవరన్నా గొడవ చేస్తే క్రీస్తుకి మేనమామ లేడని వాళ్లనే రుజూ చెయ్యమందాం. ఎంత కాంట్రవర్సీ ఐతే అంత బిజినెస్”

“అలాగే గురూజీ. రాసేద్దాం”

“మరదళ్లతో మంచి బీటున్న పాటోటి పెట్టాలి. గుర్తుంచుకో”

“తప్పకుండా గురూజీ. పల్లవి ‘నగుమోము చూడరా, నజరేతు వీరుడా’ అనుంటే బాగుంటుందేమో”

“భేషో. ఆశుకవివైపోతున్నావయ్యా. పల్లవి బాగుంది. అదే ఉంచేద్దాం”

“అబ్బే ఆశుకవా పాడా. ఏదో అప్పుడప్పుడూ కవితావేశం తన్నుకొస్తుంది. అంతే సార్”

“సర్లె, సర్లె. ఫస్టాఫ్‌లో కామెడీ మిస్సవకూడదు. అది చాలా ముఖ్యం”

“కామెడీ ట్రాక్ సంగతొక్కటే తట్టలేదు గురూజీ. మీరే హెల్ప్ చెయ్యాలి”

“దానికంతాలోచనెందుకయ్యా. పరమానందంతో ఓ ట్రాక్ పెడదాంలే. ఆయన పాత్ర పేరు పిలక శాస్త్రులు. పక్కన మరో ఇద్దరు పంతుళ్లనేసుకుని హడావిడి చేస్తుంటాడు. వీళ్లకి మెయిన్ స్టోరీతో ఏం సంబంధం లేకుండా జాగ్రత్త పడితే సరిపోద్ది”.

“బాగుంది కానీ, గురూజీ .. బైబిల్లో బ్రాహ్మల్లేరు కదా!?!”

“పిచ్చి భైరవీ. నేటివిటీ, నేటివిటీ”.

“సరే సార్. మరదళ్లతో జాలీగా పాటలు పాడేస్కుంటూ తిరుగుతున్న హీరోని చూసి పైన యెహోవాకి కోపమొస్తుంది. నేను ఇతన్ని భూమ్మీదకెందుకు పంపాను, ఇతను అక్కడేమి చేస్తున్నాడు అని కోపించి అసలు పని గుర్తు చేయమని దేవదూత గేబ్రియెల్‌ని కిందకి పంపుతాడు …. గురూజీ, యెహోవా పాత్రకి సుందర నటుడు అమన్ ఐతే బాగుంటాడేమో. ఆయనకి ఎస్.బి.పాలసుబ్రహ్మణ్యంగారితో డబ్బింగ్ చెప్పిద్దాం”

“అమన్ .. గుడ్ ఐడియా. కానీ మధ్యలో గేబ్రియల్ ఎందుకు దండగ. యెహోవానే కోయవాడి వేషంలో భూమ్మీదికొచ్చి క్రీస్తుకి జ్ఞానోదయం చేస్తాడు”

“అలాగే మారుద్దాం. ఇక్కడ మళ్లీ ఓ సిటుయేషనల్ సాంగ్. ‘కోయవాడి ధాటికి మారిపోయె యేసువా’ అంటూ. సంకర మహదేవన్‌తో ఓ పదినిమిషాల బ్రీత్‌లెస్ వేయిద్దామిక్కడ”

“ఆగాగు. అప్పుడే మారిపోతే ఎలా? మన హీరో ధీరోదాత్తుడు. దేవుడే దిగొచ్చినా అతను మారడు, తనంతట తానుగా మారాల్సిందే”

“దేవుడు చెప్పినా మారనోడు ఉత్తినే తనంతట తానే మారాడంటే కన్విన్సింగ్‌గా ఉండదేమో?”

“ఐతే ఎవరన్నా మునితోనో, ముష్టివాడితోనో హితబోధ చేయిద్దాం”

“మునే బెటరేమో గురూజీ”

“ఐతే ఈ లైన్ వేస్కో. హీరో హిమాలయాల్లో ఆడిపాడుతూ దుర్వాసన మహర్షి ధ్యానానికి భంగం కలిగిస్తే ఆయన ఆగ్రహించి ‘నువ్వు శిలువమీద కొట్టబడుదువుగాక’ అని శపిస్తాడు. అప్పుడు జ్ఞానోదయమైన హీరో మన్నించమని అడిగితే ఆయన ‘నా శాపానికి తిరుగులేదు, కానీ ఓ విరుగుడుంది. ఇకనుండీ జనులకి మంచి బోధిస్తూ బ్రతుకు. అలా చేస్తే నువ్వు మరణించిన మూడో రోజు మళ్లీ బ్రతుకుతావు’ అని చెబుతాడు”

“.. మునులూ, శాపాలూ అంటే జానపదం ఐపోతుందేమో గురూజీ? ఇది పౌరాణికం కదా”

“ఇప్పుడా తేడాలన్నీ ఎవరికి తెలుసోయ్? బాగుంటుంది. అలాగే ఉంచు”

“అలాగలాగే. ముని శాపం సినిమాకే హైలైట్. ఈ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పెడదాం. అన్నట్లు, ముని వేషానికి కనెక్షన్‌కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ) ఐతే బాగుంటుంది సార్. ఆయన మామూలుగా మాట్లాడినా బూతులు తిట్టినట్లుంటుంది. శాపాలిచ్చే ముని వేషానికి ఆయనే పర్‌ఫెక్ట్ ఫిట్”

“ఎగ్జాక్ట్‌లీ…. నేనూ కనెక్షన్‌కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ) నే అనుకుంటున్నానయ్యా. సంకటేష్ బాబుకి లెక్చరివ్వాలంటే ఆ మాత్రం స్టేచరు, నేచరు, సీనియార్టీ ఉన్న లెజెండు కావాలి. ఆయన్నే ఖాయం చేద్దాం. యూ కంటిన్యూ నౌ”

“ఇంటర్వెల్ తర్వాత జ్ఞానోదయమైన హీరో జల్సాజీవితానికి స్వస్తి చెప్పి ప్రజలకి శాంతిమార్గాన్ని బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. ప్రజల్లో ఆయనకి పెరుగుతున్న ఆదరణ చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజుకి క్రీస్తుపై పితూరీలు చెప్పి ఆయన్ని శిక్షించమని గొడవచేస్తుంటారు. ఆయన శిష్యుల్లో ఒకడైన జూదాస్ వెన్నుపోటుతో క్రీస్తుని సైనికులు పట్టుకుంటారు. అక్కడినుండీ క్లైమాక్స్ సీన్ మొదలౌతుంది”

“హోల్డిట్ దేర్. సెకండాఫ్‌లో ఎంటర్టెయిన్‌మెంటేదీ? మరీ ఇంత డ్రైగా ఉంటే ఒక వర్గం ప్రేక్షకులు లేచెళ్లిపోతారు. కాబట్టి ఇక్కడో రొమాంటిక్ సాంగ్ పెడదాం”

“మరదళ్లని వదిలేశాడు కదా. రొమాన్స్‌కి తావెక్కడ?”

“పిచ్చోడా. రచయిత తల్చుకుంటే చెయ్యలేని పనుందా? మేరీ మాగ్దలీన్ అని ఓ క్యారక్టరుంది చూడు. ఆవిడతో పాటొకటి పెట్టేద్దాం”

“గొడవలైపోతై సార్. ఇలాంటి విపరీత కల్పనలు చేస్తేనే డావించీ కోడ్ సినిమాని బ్యాన్ చేశారు”

“వెర్రివాడా. ఏం చేసినా తెలివిగా చెయ్యాలయ్యా. ఇది పిలక శాస్త్రులు ఊహించుకునే డ్రీమ్ సీక్వెన్స్‌లా పెడతాం. అప్పుడు మనల్నెవరూ తప్పు పట్టలేరు”

“భలే ఐడియా. ఎంతైనా మీరు మీరే సార్”

“పొగడ్తలాపు. అన్నట్లు, గుర్తుంచుకో. ఈ పాట కోసం పది లారీలు ఖర్జూరాలు, ఇరవై లారీలు ఈత పండ్లు ఆర్డరివ్వాలి. చాలా రిచ్‌గా తియ్యాలీ పాట”

“అలాగే సార్. నాదో సలహా. మాగ్దలీన్ పేరుని ముగ్ధ అని మారుద్దాం”

“నేటివిటీ పాఠం బాగానే వంటబట్టిందన్నమాట. అలాగే మారుద్దాం. ముగ్ధ పాత్రకి డాబు ఐతే బాగా సూటవుతుంది”

“డాబు సూపర్ సెలక్షన్ గురూజీ. మీ కాస్టింగే కాస్టింగు”

“సర్లే, సర్లే. కంటిన్యూ”

“ఎక్కడున్నాం…. ఆఁ.. క్లైమాక్స్ మొదలౌతుందా, లాస్ట్ సప్పర్ చేసి ప్రార్ధన కోసం క్రీస్తు కొండమీదికెళతాడు. అక్కడ సైతానొచ్చి క్రీస్తుని టెంప్ట్ చెయ్యటానికి ట్రై చేస్తాడు, ‘ఈ కొండ మీంచి దూకు, నీ తండ్రొచ్చి రక్షిస్తాడేమో చూస్తా, ..’ ఇలాగన్నమాట”

“ప్చ్..ప్చ్.. తెలుగు సినిమా హీరో కొండమీంచి దూకితే దేవుడొచ్చి రక్షించటమేంటి? మార్చెయ్. టెంప్టింగంటే ఇదా? సైతాను నునైత్ ఖాన్ రూపంలో వచ్చి మాంఛి ఐటెమ్ సాంగ్ చేసినట్లు పెడదాం – కూరవాణితో అదిరిపోయే మసాలా బాణీలొండిద్దాం. అది చూసి కూడా హీరో చలించడు”

“అలాగే చేద్దాం సార్. పాటవ్వగానే సైనికులొచ్చి హీరోని పట్టుకుపోతారు. విచారణ, శిక్ష విధించటం, శిలువెయ్యటం, మరణించటం .. చివరి పావుగంటలో నడిపిస్తాం ఇవన్నీ. మూడో రోజు శాప విమోచనమై తిరిగి లేస్తాడు. ది ఎండ్”.

“ఏదో మిస్సైనట్లుందే .. ఆఁ.. మదర్ సెంటిమెంటేదీ?”

“శిలువ వేసినప్పుడు సిటుయేషనల్ సాంగ్ మదర్ సెంటిమెంటుది పెడదాం సార్. అన్ని రకాల పాటలూ కవరైపోతాయి”

“మరో ఐడియా. సెంటిమెంటు సాంగు కాకుండా ఆమె దేవుడిని ప్రశ్నిస్తూ పాడే పాటలా పెడదాం. దెబ్బకి దేవుడు దిగొచ్చి హీరోని బ్రతికిస్తాడు”.

“శాప విమోచనం ప్రకారం మూడో రోజు ఎటూ బ్రతుకుతాడు కద సార్”

“శాప విమోచనం క్యాన్సిల్. మునితో ఓన్లీ శాపం. నో విమోచనం. ఆ పని ఇప్పుడు మదర్ పాటపాడి చేయిస్తుంది”.

“మూడు రోజుల పాటు పాడుతూనే ఉంటుందా సార్!?!”

“నో. అదీ మారుద్దాం. అదే రోజు పునరుత్థానం జరుగుతుంది”.

“అలాగే. ఇదే బాగుంది. మార్చేద్దాం”

“ఇంకోటి. క్రీస్తుగురించి వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆయన్ని శిలువేసినట్లే చూపించారు. మనం వెరైటీగా ఉరి తీసినట్లు చూపిద్దాం”

“మరీ ఇన్ని మార్పులా?”

“అమాయకుడా. వీటిని మార్పులూ చేర్పులూ అనకూడదు .. ఇంప్రొవైజేషన్స్ అనాలి. అంటే అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పటం అన్నమాట”

“ఓ. ఐతే ఓకే. మీరెలాగంటే అలాగే గురూజీ”

“మరోటి. బిగినింగ్‌లో క్రీస్తు పశువులపాకలో పుడతాడన్నావు .. ?”

“అవున్సార్. బైబిల్లో అలాగే ఉంది”

“దాన్నీ మార్చెయ్. హీరో అంత పేదవాడంటే సంకటేష్ బాబు ఇమేజ్ దెబ్బ తినుద్ది. బాగా రిచ్ ఫ్యామిలీలో - వీలైతే జమీందారీ కుటుంబంలో -పుట్టినట్లు చూపిద్దాం”

“ఓకే సార్. మీకలా బాగుందంటే అలాగే మారుద్దాం”

“గుడ్. ఏదీ, ఇప్పుడోసారి మొత్తం కథ టూకీగా చెప్పు”

“మన కథానాయకుడు జమీందార్ల ముద్దుబిడ్డ. చిన్నప్పుడు దుష్టరాజు తరమటంతో అతని తల్లిదండ్రులు బీహారు తీసుకెళ్లి పెంచుతారు. యుక్తవయసులో మరదళ్లతో ఆడిపాడుతూ జాలీగా గడిపేస్తుండగా ఓరోజు హిమాలయాల్లో ముని శాపానికి గురౌతాడు. దాంతో జ్ఞానోదయమై ఆస్థిని త్యజించి ప్రజలకి శాంతిమార్గం బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. అతని పేరుప్రఖ్యాతులు చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజును రెచ్చగొట్టి హీరోకి మరణశిక్ష పడేలా చేస్తారు. క్లైమాక్స్‌లో ఉరి తీయబడ్డ హీరో - తల్లి పాడిన ఆవేదనాభరిత పాటకి దేవుడు కరిగి కరుణించటంతో - మళ్లీ బతుకుతాడు. కధ సుఖాంతం”

“బాగుంది. ఇది ఫైనల్ చేద్దాం”

“అలాగే గురూజీ. ఐతే .. నాదో చిన్న అనుమానం”

“ఏమిటది?”

“ఇది ఏసుక్రీస్తు కథ అని ఎవరికీ అర్ధమవదేమో .. ??”

“పిచ్చివాడా. ప్రేక్షకులు మరీ అంత దద్దమ్మలనుకున్నావా? సినిమా టైటిల్లోనే ఉంది కదా అదెవరి కథో. తెలుగు సినీగోయెర్స్‌కి కథలో నవరసాలుండటం ముఖ్యమయ్యా, ఒరిజినల్ స్టోరీతో పోలికుందో లేదో వాళ్లు పట్టించుకోరు. కథకన్నా కథనం ముఖ్యమనే సినీ సామెత విన్లేదా? నీకు మరీ అంత అనుమానమైతే సినిమా మొదట్లో ‘ఈ కథలోని పాత్రలన్నీ కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు’ అని ఓ ముక్క పడేద్దాంలే. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు – అటు సెన్సారోళ్ల పేచీ ఉండదు, ఇటు చరిత్రకారుల గొడవా ఉండదు - ప్రేక్షకజనాలకి మాత్రం ఇది ఎవరో ఒకర్ని ఉద్దేశించి తీసిందే అని అర్ధమైపోద్ది”

“సూపర్ సార్. ఎంతైనా వంద సినిమాలు తీసిన తెలివితేటలెక్కడికి పోతాయి? మీలాంటి గురువుగారు దొరకటం నిజంగా నా అదృష్టం”

“పొగడ్తలాపవయ్యా. నాకవి నచ్చవని తెల్సుగా. వెళ్లు, వెళ్లి స్క్రిప్టు రివైజ్ చేసే పన్లో ఉండు. నేను రేపట్నుండే గెడ్డం పెంచటం మొదలెడతా. పది రోజుల్లో సినిమా మొదలెట్టి క్రిస్మస్ నాటికి విడుదల చెయ్యాలి”

“అలాగలాగే. మళ్లీ వారంలో స్క్రిప్ట్ పక్కాగా రాసుకుని కలుస్తా సార్”

“శుభం”

11, మార్చి 2010, గురువారం

కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు

http://thotaramudu.blogspot.com/2008/12/123.html(రెండు రెళ్ళు ఆరు - తోట రాముడు )


నేను పడుకుని 50 గంటలు అవుతోంది....

గత రెండు రోజులుగా ఆపకుండా ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకం పేరు "నిద్రపోవటం ఎలా?"..ఒక పెన్ను తో ఆ పుస్తకం మీదున్న టైటిల్ కొట్టేసి "నిద్ర రాకుండా పోవటం ఎలా?" అని మార్చాను..

ఏదో trance లో ఉన్నట్టుంది..నేను నుంచున్నానో, కూర్చున్నానో కూడా తెలియట్లేదు. ఆకలేస్తొందో లేదో అర్థమవ్వట్లేదు....ఏమయినా తిందామని ఫ్రిజ్ తెరిచాను........కానీ ఎందుకు తెరిచానో గుర్తుకు రావట్లేదు. నా మెదడుకు ఏదయినా ప్రాబ్లం వచ్చిందేమోనని భయమేసింది.....ఛ...అలాంటిదేమీ అయ్యుండదు. ఫ్రిజ్ మూసేసి వెనక్కు రెండడుగులు వేసాను....." ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతుకుదాము " అనిపించింది! వామ్మో...నా మెదడు ఖచ్చితంగా దెబ్బతినింది..లేకపొతే ఇలాంటి విపరీతమైన ఆలోచనలు రావటమేంటి? కాస్త చల్ల గాలి కోసమని తలుపు తెరిచి...బాల్కనీ లోని బెంచి మీద కూర్చున్నాను.

ఎదురుగా ఉన్న సముద్రం నుండి చల్ల గాలి వీస్తోంది.. బెంచి మీద నా పక్కన బంగారు కిరీటం, నగలు పెట్టు కునికూర్చున్న ఆయనతో - "ఎంత హాయిగా ఉంది కద సార్.. ఈ గాలి, ఈ బెంచి, మీరు, నేను.....కానీ నాకు హాయితో పాటూ ఒక డౌటు కూడా ఉంది సార్...మా ఇల్లు గ్రౌండు ఫ్లోర్ లో కదా ఉండేది - మరి తలుపు తెరవగానే ఈ బాల్కనీ, బెంచి ఏంటి...పైగా బెంగళూరులో సముద్రం ఏంటి.....అవును...మీరెవరు?????

ఆ కిరీటం, నగలాయన నాకు తన చెయ్యి ఇస్తూ " కాల్ మి డు...దేవుడు " అన్నారాయన..

"OK...డు - దేవుడు గారు...ఎవరు మీరు...ఈ బాల్కనీ, సముద్రం ఎలా వచ్చాయని నేను తలబద్దలు కొట్టుకుంటుంటే..మీరు మా ఇంట్లోకి ఎలా వచ్చారు?" అనడిగాను...

"ఓరీ భక్తి లేని భక్తా! నేను దేవుడిని రా..మొన్నేదో మంచి పని చేసి ఏడ్చినట్టున్నావు...నీకో వరమిమ్మని పంపించారు నన్ను....నీ బుర్ర మామూలు కండిషన్ లో ఉన్నప్పుడు వస్తే తట్టుకోలేవని ఈ రోజు వచ్చా. ఇప్పుడయితే..ఏది కలో, ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నావు కాబట్టీ అంత షాక్ తినవు...సరే..ఈ ఉపోద్ఘాతము చాలు కానీ, ఏ వరం కావాలో కోరుకో." అన్నారాయన...

"వరాలు తరువాత...మీ ID కార్డు ఏదయినా ఉంటే చూపించండి " అనడిగాను..

"ఏరా...తిమ్మిరి తిమ్మిరిగా ఉందా?"

"లేకపోతే మీరు దేవుడని ఎలా సార్ నమ్మటం? పోనీ ఏదయినా మ్యాజిక్ చేసి చూపించండి"

"సరే - 1 నుండి 50 లోపు ఒక నంబరు అనుకో....."

"మీరు 1 నుండి 500 లోపు ఒక నంబరు అనుకోండి - ఏదనుకున్నారో నేను చెప్పేస్తా....ఇలాంటి మ్యాజిక్ లు కాదు సార్. దిమ్మ తిరిగి పోవాలి..అలాంటిదేదయిన ఉంటే చూపించండి."

"OK....నీకు ఇష్టమయిన క్రికెటర్ ఎవరో చెప్పు" అనడిగారు...కిరీటం తీసి పక్కన పెడుతూ..

"జయమాలిని.........
అదేంటి సార్ ' టెండుల్కర్ ' అందామనుకుంటే ' జయమాలిని ' అని వచ్చింది నోట్లోంచి?"

"మరదే...ఇప్పుడు తెలిసిందా నా శక్తుల గురించి..."

నేను జవాబిచ్చేలోపు వెనక నుంచి నా తలపైన ఎవరో బలంగా కొట్టారు. వెనక్కు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు...

దేవుడు నా తల మీద రుద్దుతూ " దిమ్మ తిరిగిపోవాలి అన్నవుగా....అందుకే ఈ ఏర్పాటు..... సరే అడుగు ఏ వరం కావాలో?" అన్నాడు, అరచెయ్యి వరమిచ్చే పొజిషన్ లో పెడుతూ....

"ఏముంది సార్....ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో, సకల సంపదలతో......."

"ఆగు - నిజం చెప్పు"

"ఈ సారి నా Annual appraisal లో నాకు నూట ఇరభై పర్సెంటు ఇంక్రిమెంటు వచ్చేట్టు చూడండి సార్...ఇదయ్యాక కూడా నా వరం లో ఇంకొంచం మిగిలుంటే - ఆ హిమాన్షు గాడి ఉద్యోగం ఊడేట్టు చూడండి "..అనడిగాను వినయంగా..

"ఇంతోటి దేవుణ్ణి...అంత దూరం నుంచి వస్తే ఇదా నువ్వు కోరుకునేది?? కమాన్ యార్..ఇంకాస్త ఆలోచించు. మొన్నెప్పుడో ఎవరితోనో 'ఏంటి ఈ జీవితం - ఇక ఇంతేనా?' అన్న డైలాగ్ అన్నట్టున్నావ్"...

"బాగా గుర్తుచేసారు సార్..ఏమి చెప్పమంటారు - ఈ ఉద్యోగం బొరు కొడుతోంది...ఏదో అసంతృప్తి...రోజూ చిరాకే. ఇలా కాకుండా బాగా exciting గా ఉన్న ఉద్యోగం ఇప్పించండి సార్...ప్రతి రోజూ థ్రిల్లింగ్ గా ఉండాలి..." అన్నాను..

" రైట్....కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు తెరిచాను..

ఒక పెద్ద బోను లో ఉన్నాను. చేతిలో హంటర్ ఉంది. చిన్న అలికిడి లాగ వినిపిస్తే కిందకు చూసాను......

......నా ఎదురుగా నేల మీద ఆరు సింహాలు కూర్చుని ఉన్నాయి!

మాంచి conditioner తో తల స్నానం చేసొచ్చినట్టున్నాయి...జూలు గాలికి అటూ ఇటూ ఎగురుతోంది..

నా ప్రమేయం లేకుండానే నా కుడి చేయి హంటర్ ను నేల మీద గట్టిగా కొట్టింది...ఆ చప్పుడు కు సింహాల కన్నా ముందు నాకు భయమేసింది. ఒక్కొక్క సింహం పైకి లేచి మెల్లగా నా చుట్టూ తిరగటం మొదలు పెట్టింది..నా చొక్కా, నా ప్యాంటు తడిసి పోయాయి (రెండూ చమట వల్లే.........అనుకుంటా)..

నా చుట్టూ మూడు ప్రదక్షణాలు అయ్యాక సింహాలన్నీ ఒక మూల చేరి ఏవో మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి.. పది సెకెండ్ల తరువాత సింహాలన్నీ "high five" అని చేతులు కొట్టుకుని నా వైపు తిరిగాయి..అందులో ఒక సింహం కింద కూర్చుని తమలపాకులకు సున్నం రాస్తోంది...నన్ను తినేసాక వేసుకోవటానికి తాంబూలాలు రెడీ చేస్తున్నట్టుంది...మిగతా సింహాలు నా వైపు అడుగులేస్తున్నాయి...ఇంకొద్ది సేపట్లో ఈ బోను లోని సింహాలు నన్ను తిని, నా బోన్స్ తో పాచికలు చేసుకోవటం ఖాయం...ఒక్క సారిగా సింహాలు నా మీదకు ఎగిరాయి..కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను - "దేవు............."

"..........డా" అని కళ్ళు తెరిచాను.........

మళ్ళీ బాల్కనీలో బెంచి మీద కూర్చుని ఉన్నా. ఎదురుగా దేవుడు. అంతా నిశ్శబ్దం.

ఇందాక నేను సింహాలు బోనులోకి వెళ్ళినప్పుడు 'pause' చేసిన సీను మళ్ళీ 'play' చేసాడు దేవుడు....మళ్ళీ సముద్రపు హోరు, చల్ల గాలి, మొదలయ్యాయి..

"ఏంటి సార్....అంత పని చేసారు?" అన్నాను చమట తుడుచుకుంటూ...

"చిన్న ప్రివ్యూ ఇచ్చాను తమ్ముడూ...ఇందాక నువ్వు చేసావే...రోజూ exciting గా, థ్రిల్లింగ్ గా ఉండే ఉద్యోగం అదొక్కటే....వేరే ఏ ఉద్యోగం అయినా...కొద్ది రోజులకు బోర్ కొడుతుంది..మంచి వ్యాపకాలేవయినా ఏర్పరచుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు........సరే - ఏ వరం కావాలో కోరుకో"..

"ఉండండి సార్...భయం తో గొంతు ఎండిపోయింది..లోపలకెళ్ళి నీళ్ళు తాగొస్తా. మీకూ ఓ గ్లాసు పట్రమ్మంటారా?" - అడిగాను...

"వద్దు....నేను మా లోకం నుంచి ఫ్లాస్క్ లో అమృతం తెచ్చుకున్నాను...నువ్వు నీళ్ళు తాగి రా"..

నేను వెళ్ళి నీళ్ళు తాగుతుంటే నా వెనకాలే దేవుడు కూడా వచ్చాడు..

"ఈ గిటార్ నీదేనా? వాయిస్తుంటావా?" అనడిగాడాయన నా మంచం పక్కనున్న నా గిటార్ ను చూపిస్తూ..

"అంటే సార్...అది...అప్పుడప్పుడూ...ఎప్పుడోఅప్పుడు"

"రేయ్ మూర్ఖా...ఇటువంటి వాయిద్యాలు ఇంట్లో ఉంచుకుని కూడా ఎప్పుడో ఒక సారి వాయిస్తాననటం మహా పాపం రా"

"ఊరుకోండి సార్..అలా భయపెట్టకండి..ఇప్పటికే తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేసుంటాను...ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడ పాపాల లిస్టులో చేరిస్తే ఇక నా లాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళటం అసాధ్యం" అన్నాను...

"సరే...ఆ గిటార్ సంగతి చెప్పు...ఎందుకు రోజూ సాధన చెయ్యట్లేదు?"

"సమయం దొరక్క సార్...ఒక్క గిటార్ అనే కాదు...ఎన్నో ఉన్నాయి సార్ నేను చేయాలనుకునేవి...టైం లేదంతే..రోజుకు ఇంకొక్క
' ఆరు గంటలు ' ఎక్కువుంటేనా........"

"కావాలా?"

" అంటే...కుదురుతుందా సార్....రోజుకు 30 గంటలు...నిజంగా వీలు అవుతుందా?" అనడిగాను...

" కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు మెల్లగా తెరిచాను..నా మంచం మీద పడుకుని ఉన్నాను..పక్కనే గడియారం...టైం ఉదయం 7:30 అయ్యింది..ఎదురుగా TV ఆన్ చేసి ఉంది....NDTV 30/7 అనే చానెల్ వస్తోంది....ఆహా...ఐతే రోజుకు 30 గంటలు వచ్చేసాయన్నమాట...మెల్లగా నిద్ర లేచి, తయారయ్యి ఆఫీసుకు చేరేప్పటికి 10:30 అయ్యింది..ఆఫీసు మెయిల్ నిదానంగా చెక్ చేసుకోవచ్చని G-talk లోకి లాగిన్ అయ్యాను...

'Hi....Hi.....Hi.....Hi....' అని నాలుగు విండోలు తెరుచుకున్నాయి....హేమ, లలిత, విద్య, నీల్ విజయ్ ఆన్లైన్ ఉన్నారు..

(ఈ క్రింది సన్నివేశం లో కెమేరా నా లాప్టాప్ స్క్రీన్ వైపు తిప్పబడింది)

-----

హేమ - ఏంటి లేటయ్యింది?
నేను - అవును..లేటయ్యింది..

లలిత - చాక్లెట్ తెచ్చావా?
నేను - నువ్వు డబ్బు తెచ్చావా?
లలిత - తెచ్చా
నేను - ఇలా ఇవ్వు...వెళ్ళి పట్టుకొస్తా

విద్య - భవ్......హహహ....భయపడ్డావా
నేను - ప్లీజ్ యా....పొద్దున్నే అలా భయపెట్టకు

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ డేట్ ఎంత?
నేను -

-------

హేమ - టిఫిన్ చేసావా....ఇవ్వాళ మా ఇంట్లో ఇడ్లీ..చట్నీ భలే ఉండింది...నీకు పెట్టనుగా...హహహ.
నేను - నేను కూడా ఇడ్లీనే తిన్నా...మీ నాన్న అదే హోటల్ నుండి పార్సెల్ కట్టించుకెళ్ళాడు..

లలిత - నీకొక విషయం తెలుసా...హిమాన్షు ఇవ్వాళ పొద్దున్నే బాసుకు రవ లడ్లు, మెరపకాయ బజ్జీలు తెచ్చిచ్చాడు...ఈ సారి వాడి ప్రమోషన్ గ్యారంటీ..
నేను - అసలు వాడికి సిగ్గుందా?? ఇరిటేటింగ్ ఫెలో..
లలిత - నాకు కూడా అదే అనిపించింది...ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారటమా?
నేను - ప్రమోషన్ గురించి కాదు లల్లీ..బుధ్ధున్నోడు ఎవడయినా మెరపకాయ బజ్జీలు పొద్దున తెస్తాడా?? సాయంకాలం స్నాక్స్ టైములో తీసుకురావాలి కానీ....

నీల్ విజయ్ - రేయ్...ఉన్నావా....రిప్లై ఇవ్వరా...
నేను -

--------

విద్య - బోర్ కొడుతోంది...బ్రేక్ కు వెళదామా?
నేను - టూ మినిట్స్

హేమ - నువ్వు, విద్య బ్రేక్ కు వెళ్తున్నారట గా...ఇప్పుడే పింగ్ చేసింది..అవును లే..మమ్మల్ని ఎందుకు పిలుస్తారు..పెద్ద వాళ్ళయిపోయారు..
నేను - ఏంటి హేమ..అలా అంటావు..నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నా ...ఈ లోపే నీకు చెప్పేసిందా??

లలిత - నిన్న రాత్రి మీ ఇంట్లో ఏమి కూర?
నేను - ఒక్క నిముషం..ఇప్పుడే వస్తా..

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ రాత్రికి PVR లో సెకెండ్ షో టికెట్లు దొరికాయి..
నేను - ఆ చెప్పరా...ఇంతసేపు ఒక కాల్ లో ఉన్నాను.....షో ఎన్నింటికి?

--------

బ్రేక్, లంచ్, తరువాత ఇంకో బ్రేక్ తీసుకున్నాక నా మెయిల్ చెక్ చేసుకున్నా....నా బాసు దగ్గర్నుండి ఏదో మెయిల్....అందులో చివరి వాక్యం మాత్రం 16 ఫాంటు సైజు లో, బోల్డు అక్షరాలతో, ఎర్రటి రంగులో - "send it to me by the end of day, today" అని ఉంది...పని మొదలెడదామని గడియారం చూస్తే మధ్యాహ్నం 3:40 అయ్యింది...ఇవ్వాళ పని జరగటం అసంభవం...రేపటి దాక టైం అడుగుదామని నా బాసు క్యాబిన్ కు వెళ్ళాను..తలుపు తెరవంగానే "be aggressive, be proactive, take initiative, by the end of the day, youtube blocked, Gtalk blocked, messenger blocked" లాంటి నాలుగైదు విషయాలు మొరిగి నన్ను పంపించేసాడు...వాడి మాటల హోరుకు నాకు కళ్ళు తిరిగి పడిపోయాను...

కళ్ళు తెరిచేప్పటికి మళ్ళీ ఇంట్లో ఉన్నాను...దేవుడు నా గిటార్ వాయిస్తూ కనిపించాడు..

"చూసావా..30 గంటలు కాదు..రోజుకు 300 గంటలు ఇచ్చినా నీ బుధ్ధి మారదు....కాబట్టి వేరే వరమేదయినా కోరుకో.."

నేను అడిగేలోపు దేవుడు "హలో..ఆ చెప్పు...OK...OK" అంటున్నాడు....ఎవరో ఫోన్ చేసినట్టున్నారు...మనకు వైర్ లెస్ లాగా వీళ్ళకు ఫోన్ లెస్ అనుకుంటా..చేతిలో ఏ ఫోనూ లేకుండా రెండు నిముషాలు మాట్లాడేసాడు దేవుడు..

"ఏంటి సార్ ఏమయినా ప్రాబ్లమా?" అడిగాను ఆయన ఫోను పెట్టంగానే..

"Recession అయ్యా...అందుకే అందరికీ టెన్షన్ గా ఉంది..మీరు బచ్చాగాళ్ళు..ఓ పది, పదిహేను బాంకులు మూసేసారు...మాకున్న క్రైసిస్ కు మేము 3 గ్రహాలు మూసేసాము తెలుసా..ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు..."

నాకు తలియకుండానే గట్టిగా నవ్వేసాను...

"ఏరా కొవ్వెక్కిందా...నా ఉద్యోగం ఊడుతుందంటే నవ్వొస్తోందా నీకు? నా గురించి నీకు పూర్తిగా తెలిసి నట్టు లేదు రా రేయ్..నీ Engineering Graphics పేపర్ గుర్తుందా? పరీక్ష ముందు రోజు కూడా ఏదో తోక ఆడించావు...అందుకే 34 మార్కుల దగ్గర ఆపేసాను నీ పేపర్"

"అది చేసింది మీరా??????????????"

"అన్ని క్వశ్చన్ మార్కులెందుకు?"

"లేకపోతే ఏంటి సార్...ఏదో పొరబాటున రెండు మాటలు అనుంటాను..దానికి Engineering Graphics లాంటి పేపర్ ఇంకో సారి రాయించారా నాతో..." అని మొహం మాడ్చుకుని ఏడ్చేసాను..

"సర్లే ఊరుకో..ఇప్పుడెందుకు ఏడుపు... అయినా ఆ తరువాతి సారి పాస్ చేయించాగా...లేకపొతే నువ్వేసిన పూలకుండి, సైకిల్ టైర్ బొమ్మలకు ఎవడిస్తాడు చెప్పు 65 మార్కులు.....ఏడుపాపి ఏమి కావాలో కోరుకో.." అన్నారాయన నాకు కర్చీఫ్ అందిస్తూ...

"ఇంతకు ముందు కోరుకున్నవేవీ వద్దు సార్....ఈ ఒక్క కోరిక తీర్చండి...ఇక జీవితం లో ఎప్పుడూ ఏమీ కోరుకోను" అన్నాను..

"నేను చిన్నప్పుడు పేపర్ కిరీటాలు పెట్టుకునే రోజుల నుండి చూస్తున్నాను..ఏ కోరిక కోరినా 'ఇదొక్కటే తీర్చు స్వామీ..ఇంకేమీ అడగను ' అంటూనే ఉన్నారు మీరు...సరే అడుగు "....

"ఒక అందమైన, తెలివైన అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్ళి చెసుకునే వరమివ్వండి సార్" అన్నాను...

"బాగుంది రా....' బాబుకి లేక బాలకృష్ణ సినిమా దొంగ DVD చూస్తుంటే, కొడుకొచ్చి జేంస్ బాండ్ కొత్త సినిమా కు మొదటి రోజు టికెట్లు అడిగాడంట '......నాకే 700 సంవత్సరాలుగా పెళ్ళి కుదరట్లేదంటే...నీకొక అమ్మాయిని చూడాలా...."

"ఇవ్వలేనప్పుడు ఎందుకు సార్ అడగటం??? అయినా ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం లేదులెండి...మీ మంత్రం గుర్తుంది నాకు........' కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు ' "....అని కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచాను........

మళ్ళీ ఒక బోనులో ఉన్నాను..ఈ సారి బోను ఊసలకు కరెంటు కనెక్షనుంది....కిందకు చూసాను...ఎదురుగా కుర్చీలో కూర్చుని నవ్వుతూ దినకర్ గాడు కనిపించాడు....నేను తల పైకి లేపి చూసాను...దేవుడు తన బండి స్టార్ట్ చేస్తూ కనిపించాడు....

"మంత్రాన్ని దొంగలించినంత మాత్రాన....ఇంత పెద్ద శిక్ష విధించాలా సార్?"......

ఆయన నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా... ఫస్ట్ గేర్ వేసుకుని వెళ్ళిపోయారు...

9, మార్చి 2010, మంగళవారం

చీర(ల)పురాణం

http://anamdam.blogspot.com/2010_02_01_archive.html( జంబలకడి పంబ-ఆనందం )



చీర ఎంతో ముద్దుగా, చిన్నగా, అమాయకంగా ఉన్న పేరులా అనిపిస్తుంది కదూ. అలా అనుకునే చాలా మంది మగవీరులు చరిత్రలో డంగైపోయారు. శ్రీదేవీ మహాపురాణంలో పదహారో అధ్యాయం నూట నాలుగో శ్లోకం ప్రకారం, చీర అన్నది ఆడవారికి మగవాళ్ళని శిక్షించే ఓ ఆయుధం.

చీమ ఎంతో చిన్నది , పొదుపులోన మిన్నది --- పాతపాట
చీర ఎంతో చిన్నది, ఖర్చులోన మిన్నది -- కొత్తపాట

నేను డిగ్రీలోఉన్నప్పుడు ఓసారి ఏదో పండక్కి నాన్న అందరికీ డబ్బులిస్తున్నారు బట్టలు కొనుక్కోటానికి. నాకు వెయ్యి రూపాయలిచ్చి, అమ్మకో అయిదువేలు, బామ్మకో అయిదువేలిచ్చి, ఆఖరికి పనమ్మాయి లక్ష్మికి ఓ రెండువేలిచ్చారు. సిగ్గుతో కాసేపు చితికి, రోషంతో వెయ్యికేమొస్తాయ్ ఛీ నాకొద్దన్నా. అంతలో అమ్మ అందు(ఆడు)కుంది...

రేయ్ ఆనందూ, ఆ వెయ్యితో నువ్వు తొడుక్కునే ఆ కుక్కతోలు (అమ్మ భాషలో అది జీన్స్) ప్యాంట్లు రెండొస్తాయి. అయినా ఎప్పుడో నెలో,రెండ్నెల్లకోసారి ఉతికే నీకంతకన్నా ఎక్కువ అనవసరం అని దబాయించింది. పోనీ అంతగా నీకింకో ప్యాంటు కావాలంటే, కిందటేడాది తద్దినాలప్పుడు కొన్న ఆ నీలం జంపకానా టైలరుకిచ్చి కుట్టించుకోరా, బాగా మురికిపట్టి అచ్ఛం నువ్విప్పుడు తొడుక్కున్న ప్యాంటల్లే ఉంటుందిరా అంది అమ్మ.

ఏంటీ జోకా, ఏమనుకుంటున్నారు మీరు నన్ను? గాండ్రించా నేను.

అంతలో బామ్మ నా దగ్గరికి వచ్చి, మీరేంటే పాపం వాణ్ణి ఆటపట్టిస్తారు, రారా ఆనందూ, ఆ పాత జంపకానా నీకెందుకులేగానీ, ఇదిగో ఈ రెండొందలు తీసుకెళ్ళి ఓ కొత్త జంపకానా కొనుక్కుని ప్యాంటు కుట్టించుకో నాన్నా అంది.

"బామ్మా.." అని క్రోధంతో కళ్ళెర్ర చేసి శంకరాభరణం శంకరశాస్త్రి "శారదా" అన్న రేంజ్లో ఎఫెక్ట్ వచ్చేలా అరిచా.

అలా అరిచిన నోరు మూసే లోపలే బామ్మ అప్పుడే వంటింట్లో చేసిన తొక్కుడు లడ్లు ఓ రెండు నా నోట్లో కుక్కి నా నోరు నొక్కేసింది.

ఛీ.. ఈ చీరల పిచ్చికి చిన్నా, పెద్ద, ముసలి, పడుచు తేడాలుండవని అర్ధమై దీనంగా బయటకి నడిచా.

నా బాధ చెప్పుకుందామని మా కిరణ్ గాడింటికెళ్ళా. వాడింట్లో యమా హడావిడిగా ఉంది. ఏంట్రా సంగతి అన్నా?

మా చెల్లికి మొదటిసారి చీర కడుతున్నార్రా, అందుకే ఈ జనాలకి పార్టీరా అన్నాడు.

చీర కడితే పార్టీనా, ఒరే అన్యాయంరా ఇది. నేను మొట్ట మొదటిసారి టెన్త్ క్లాసులో ప్యాంటు కడితే, పార్టీ సంగతి దేవుడెరుగు, ఇప్పుడంత తొందరేమొచ్చిందిరా వెధవా అని ప్యాంటు ఇప్పదీసి మరీ కొట్టాడ్రా మా బాబు. అలాంటిది ఇక్కడ పార్టీలా. ఒరే ఇది పచ్చి మోసం, దగా. మన జనాలు పిచ్చిమొహాల్లాగా తెలంగాణాని దోచుకుంటున్నారు అని కొట్టుకుచస్తున్నారు గానీ, అసలు దోపిడీ అంతా చీరల రూపంలో మొత్తం మొగాళ్ళకి అనాదిగా జరిగిపోతోందిరా.

అయినా లాభం లేదురా. మగాడు ప్యాంటేం ఖర్మ చీర కట్టి, బొట్టు పెట్టినా పార్టీ ఇయ్యర్రా అదంతే అన్నాడు కిరణ్ నన్ను ఓదారుస్తూ.

అద్సరే గానీ నిన్ను మాతో టూర్ పంపటానికి డబ్బుల్లేవని ఏడ్చిన మీ నాన్న ఏమాత్రం వదిలించుకున్నాడురా ఈ కార్యక్రమానికి?

ఏమోరా, కానీ అమ్మతో నాన్న అంటే విన్నా, అరలక్షట్రా? కానీ తిండికి అయింది పదివేలేట, మిగతా నలభైవేలు చీరల ఖర్చు అంట్రా.

"చీరలా", అదేంట్రా ఉన్నట్టుండి బహువచనం వాడావ్, కట్టేది ఒక్క చీర కాదా?

పిచ్చివాడా. చీర అన్నది పుస్తకాల్లో రాసుకోటానికి మాత్రమే వాడే ఏకవచన ప్రయోగం. నిజ జీవితంలో చీర ఎప్పుడూ బహువచనమే. కావాలంటే అటు చూడు అక్కడ గంటకో చీర మార్చి ఎలా ఫొటోలు దిగుతున్నారో.

అవునా ఎంత గొప్ప నిజం చెప్పావ్రా, నా కళ్ళు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. ఈ బాధ నుంచి బయటపడాల్రా, ఎక్కడికైనా పోదాం పదరా.

ఎక్కడికో ఎందుకురా, మన అమ్మన సూరి వాళ్ళ చుట్టాల పెళ్ళి ఇవ్వాళేరా, అక్కడికెళ్ళి కాస్త రిలాక్స్ అవుదాం.

ఇద్దరం కలిసి అలా పెళ్ళికెళ్ళి ఓ మూలన కూచున్నాం. అది ఆషామాషీ పెళ్ళికాదు. అమ్మన బ్రదర్స్, దంచన సిస్టర్స్ వాళ్ళ పెళ్ళి. అక్కడ మాకు కొంచెం దూరంలో అంతలో అమ్మన, దంచన వాళ్ళ ఆడవాళ్ళొచ్చి కూచున్నారు.

ఏం వదినా, బొత్తిగా నల్లపూసై పోయావ్?

చాల్లే బడాయి, అక్కడికి నువ్వేదో పెద్ద తెల్లపూసైనట్లు. మొన్నెప్పుడో శుక్రవారం గుళ్ళో కలిసాం. ఇవ్వాళ ఆదివారం. మధ్యలో శనివారం కనపడకుండా ఎటుపోయావమ్మా. ఏమిటీ చీరలు గానీ కొన్నావా? అయినా మీదే అంత పెద్ద దుకాణం పెట్టుకుని బయటికెందుకొదినా అసయ్యంగా?

అదేమరి నంగనాచి కబుర్లంటే. అక్కడికేదో నువ్వు మీ షాపులోనే నీ చీరలు కొనుక్కుంటున్నట్లు. ఇప్పుడు నువ్వేసుకున్న ఆ వెంకటగిరి చీర మా షాపులోది కాదూ?

నీ దగ్గర దాపరికమా వదినా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లు, మన మొగుళ్ళు మనల్ని మన షాపుల్లో చీరలు కొనుక్కోనిస్తే ఈ దొంగచాటు వేషాలెందుకొదినా?

అవునొదినా మంచిమాటన్నావు. ఈ మగాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయాయొదినా. నా మొగుడు వారానికో బంగారం నగ తెచ్చి దిగేస్తున్నాడొదినా. మొదట్లో తెలీక లవ్వనుకున్నా, తర్వాత తెలిసింది ఇలా డబ్బంతా బంగారంలా పోగేసి, మనల్ని కాపలాకుక్కల్ని చేద్దామని వెధవ ప్లాను.

సరి సరి, నా మొగుడే అనుకున్నా, మీ ఆయన తంతూ ఇదేనా. నిజంగా చస్తున్నా వదినా, వేసినవే వేసుకుని మొహమ్మొత్తింది. పాడయిచావవు, పెట్టవూ. ఎంచక్కా చీరలయితే అవతలపారేసి, నెలకో కొత్తచీర కొనుక్కోవచ్చును.

భయపడమాకొదినా. నేనేం తక్కువ తిన్నానా. రెండు డూప్లికేట్ నగలు చింతలపూడిలో చేయించి, మొత్తం నగల్లో కలిపేసా. అసలు నగలు అమ్మేసి ఇవిగో ఇలా ఎప్పటికప్పుడు కొత్త చీరలు కొంటున్నా వదినా. ఇప్పుడు అన్ని నగల్లో ఏది అసలో ఏది నకిలీనో ఆయన దాకా ఎందుకు, నాకే తెలిచ్చావదు.

ఎంత తెలివొదినా నీకు. వీటినే చావు తెలివితేటలంటారు కాబోలు. అది సరే, ఆ బ్యాగులో చీరలేంటి?

అవి, ముహూర్తమప్పుడు ఒకటి, అయ్యాక మరోటీ కడదామని తెచ్చుకున్నా వదినా?

ఏది ఆ నల్లి సిల్క్ హౌసులో కొన్నావా?

లేదొదినా, వాడు మరీ కూల్ డ్రింకొక్కటే ఇస్తున్నాడు, ఆ పక్క సందులో పిల్లి సిల్క్ హౌసులో కొన్నా వదినా. వీడు కూల్ డ్రింకుతో పాటు బిస్కెట్లు కూడా ఇచ్చాడులే. ఇది గద్వాల చీరొదినా. పాతికవేలు పెట్టా. ఎలా ఉంది?

ఏదిటు చూడనీ, నేను నల్లిలో కొన్న గద్వాల చీరల్లే ఉందే. ఇదిగో చూడు. నేను ఇరవై వేలకే కొన్నా.

కాదులే వదినా, నా చీరకి పమిటంచులో ఈ చంద్రుడి బొమ్మ ఎంబ్రాయిడరీ ఉంది చూసావా, అందుకే ఆ రేటు.

ఆ బడాయి, కాదులేవమ్మా. నీదసలు డామేజీ చీర. అంచులో చిరుగు కనపడనీకుండా అలా ఆ చిల్లుని చంద్రుడిలా ఎంబ్రాయిడరీ చేయించి నిన్ను మోసం చేసాడు ఆ పిల్లి వెధవ.

ఛీ..చుప్పనాతి మొహమా, మెచ్చుకోవటం రాకపోగా కుళ్ళుపుట్టి నా చీరని తిడతావా, నీతో మాట్లాట్టం వేస్ట్. పోవే.

నోర్ముయ్యవే ఆల్చిప్ప మొహమా, నువ్వే పెద్ద చుప్పనాతివి, శూర్పణఖవి..పోవే...

నువ్వే పోవే, అయినా వారానికో కొత్తచీర కొనే నాకూ, రెండువారాలకొకటి కొనే నీకూ పోలికేంటే?

నా సంగతి నీకేం తెల్సే. నెలకింద కొన్న డజను చీరలు ఆ గిన్నెల వాడికేసి, ఈ బుజ్జి నెయ్యి గిన్నె తీసునున్నదాన్నే నేను.

నీ మొహం మండ, వారం కింద కొన్న చీరలు రంగు నచ్చక, అదే గిన్నెల సత్తిగాడి కేసి ఇదుగోనే ఈ చిట్టి ఉగ్గిన్నె తీసుకున్న వంశమే నాది. నీ జిమ్మడ.

ఏంటే వంశం వంశం అని ఏడుస్తున్నావ్, నువ్వు, నీ బోడి వంశం, నేనేసిన చీరలతో అదే సత్తిగాడు చీరల షాపు పెట్టుకున్నాడన్న సంగతి తెలుసుటే నీకు వాగుతున్నావ్?

అదా నీ పొగరు, కానీ వారానికోసారి నేనేసే చీరలకి గిన్నెలివ్వటానికి ఆ సత్తిగాడేకంగా స్టీలు సామాను షాపే తెరిచాడన్న సంగతి తెలిస్తే సిగ్గుతో చస్తావే?

నీ కెంత పొగరే, కొత్తచీరలు కొనటం కోసం వారం కిందకొన్నవి ఇస్త్రీ పెట్టెతో కాల్చి మొగుడితో కొత్తవి కొనిపించిన వంశమే నాది.

అవునా, అసలు తొడగని చీరలు నీ బీరువాలో ఏమైనా ఉన్నాయిటే. నాకు మూడు బీరువాల నిండా కొని నచ్చక తొడగని చీరలున్నాయే.

ఓసి ఆ మాత్రానికే అంత కులుకటే నీకు, నీకింకా కొన్నాక నచ్చలా, కానీ నేనసలు షాపుకెళ్ళానుకదాని, నచ్చకపోయినా కొన్న చీరలు నాలుగు బీరువాల్లో ఉన్నాయే.

కంచి పట్టుచీర కొని కత్తిరించి కూతురికి పంజాబీ డ్రస్సుగా కుట్టించిన వంశమే నాది.

బెనారస్ పట్టుచీర కొని కత్తిరించి మొగుడికి చొక్కాగా కుట్టించిన వంశమే నాది.

ఇద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు నోటికొచ్చినంత మనస్ఫూర్తిగా మెచ్చుకుని కాసేపటికెళ్ళిపోయారు, మళ్ళీ సోమవారం కలుసుకోటానికి.

అంతలోకి పెళ్ళి అయిపోయి, వ్రతం కూడా మొదలయింది. ఆడాళ్ళ దెబ్బకి కిరణ్, నేను బుర్రవాచి పెళ్ళిపందిరి దగ్గరికెళ్ళాం. పంతులు గారు వ్రతం కధ చదువుతున్నాడు.

మొదటి అధ్యాయము:

పూర్వం తుంగధ్వజుడనే రాజు, భార్యతో కలిసి నగర పర్యటన చేయుచూ దారిలో ఓ బట్టల దుకాణం మీదుగా పోవుచూ హడావిడిగా అందులో భార్యకు చీరలు కొనకుండా అట్లే ముందుకు పోయెను. అటు పిమ్మట, తన భవనానికి తిరిగి వెళ్ళిన తుంగధ్వజునికి ఆస్థులు, భవనములు అన్నీ నేలకూలిన దృశ్యము చూసి గుండె ద్రవించి, దీనికి కారణం ఏమియో అని ఆలోచింపగా, ఆకాశంలో ఓ మెరుపు మెరిసి, చీరలమ్మ ప్రత్యక్షమై, ఓ రాజా, నీవు బట్టల దుకాణం ముందు నుంచి వెళ్ళి కూడా భార్యకు చీరలు కొనకపోతివి. అందుకే నీకీ శిక్ష నాయనా. వెంటనే వెళ్ళి నీ భార్యకు ఓ డజను చీరలు కొని ఇచ్చి, అటుపై సర్వసౌఖ్యములు అనుభవించుమని చెప్పి అదృశ్యమాయెను. ఆ మాటవిని రాజు పరమానందభరితుడై, భార్యకు ఒకటికి పది డజన్ల చీరలు కొని సుఖపడెను. ఒకటో అధ్యాయము సమాప్తం.

రెండవ అధ్యాయము:

పూర్వము పీతాంబరం అను ఓ యువకుడు ఉండెడివాడు. వాడు పేరుకు తగ్గట్లు చక్కని రంగురంగుల బట్టలు ధరించుచూ, పూలరంగడివలె ఉండెడివాడు. ఓ రోజు వాడు ఓ సినిమా చూచుటకు వెళ్ళి అందులో శవాలమీద పేలాలు ఏరుకునే విధంగా ఓ దుర్మార్గుడు వ్రాసిన "దోమ కుడితే చికెన్ గునియా, ప్రేమ కుడితే సుఖం గునియా.." అనే ఓ పాట విని, సుఖం గునియా పుట్టి కనకాంబరం అను యువతిని ప్రేమించి ఆపై పెళ్ళి చేసుకొనెను. కనకాంబరమునకు చీరలు కొనిపెట్టే విషయమున వాడు కొంత పిసినారిగా వ్యవహరించసాగెను. కాలక్రమములో చీరలమ్మ కోపాగ్ని వలన వాని ఆస్థులు అన్నీ కరిగిపోయి, పీతాంబరుడు మెల్లగా శ్వేతాంబరుడిగా మారి అటుపై భార్య విడిచిపెట్టగా ఏకాంబరంగా మారి రోడ్లుపట్టి తిరగసాగెను. అంతట ఓ దినము రోడ్డుపై దిగంబరునిగా తిరుగుచున్న పీతాంబరుని పరిస్థితిని చూసి జాలిపడిన చీరలమ్మ ఆ విషయం ఆతని భార్య కనకాంబరమునకు కలలో కనపడి తెలిపెను. అంతట కనకాంబరం అతనిని ఇంటికి తీసుకువచ్చి చీరలమ్మ వ్రతం చేయించి, ఓ డజను చీరలను అతనిచే అప్పుచేయించి మరీ కొనిపించుకొనగా అంతట వారు సర్వ సౌఖ్యములు పొంది సుఖపడిరి.

ఈ వ్రత కధ విని, ప్రసాదం తీసుకోకుండా, కనీసం ఒక చీర కొని నచ్చిన వారికివ్వని మగవారు చీరలమ్మ ఆగ్రహానికి గురయి కష్టాలు అనుభవించెదరు అని ముగించాడు.


ఆ వ్రతకధ విన్న నాకు పూర్తిగా బుర్ర తిరిగి, పంతులు గారూ, ఇదేం వ్రతం ఎప్పుడూ విన్లేదు అన్నా.

ఇది చీరలమ్మ వ్రతం నాయనా, నీక్కూడా చేయించాలా బాబూ అన్నాడు.

వద్దులే స్వామీ నాకింకా పెళ్ళి కాలేదు. అనిచెప్పి వెనక్కి తిరక్కుండా ఇంటికొచ్చి పడుకున్నా.

ఎందుకొచ్చిన ఖర్మ అనుకొని, మా బాబు ఇచ్చిన వెయ్యితో ఓ చీర కొని అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చా. అమ్మ సంతోషం పట్టలేక, తట్టుకోలేక ఇంకో జంపకానా కొనిస్తానని మాటిచ్చింది. ఓ పక్క ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. వెంటనే నా పెళ్ళిసంబంధం కోసం వాళ్ళు ఇచ్చిన ప్రకటనని ఇలా మార్చేసా...

"అందమైన, బుద్ధిమంతుడైన, బ్లాగులు రాసుకునే పదహారణాల ఇరవై రెండేళ్ళ తెలుగు యువకుడు, అందమైన, బుద్ధిమంతురాలైన బ్లాగుల జోలికెళ్ళని, చీరల పిచ్చిలేని ఇరవై సంవత్సరాల తెలుగు యువతి కొరకు తీవ్రంగా వెతుకుచున్నాడు. చీరల పిచ్చి ఉండీ మోసగించినట్లయినచో హిందూ చీరల చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడును. వివరాలకు సంప్రదించండి. ఫోన్: 1122334455"

8, మార్చి 2010, సోమవారం

నా ఏడవ తరగతి ప్రేమ కధ.

http://aswinbudaraju.blogspot.com/2008/12/blog-post_08.html(ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . . aswin)





అవి నేను ఏడవ తరగతి కి ఎలా ఎసరుపెడతానా అని మానాన్న గారు భయపడూతున్న రోజులు. ప్రపంచంలో ఆలోచించటానికి ఎన్నో సమస్యలున్నా అందరూ నా ఏడవ తరగతి గురించే అప్పుడు ఎందుకు ఆలోచించారో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నా 22 రీళ్ళ స్టోరీ వినాల్సిందే.

అప్పట్లో బొంబాయిలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిసి మా బామ్మ విజయవాడలో మా పక్క వీదిలో ఉన్న మా బడికి పంపలేదు. ఎవరెన్ని చెప్పినా వినేది కాదు. "పైగా ఈ ఏడు నుండే శని గాడు నీ సైడ్ పాకెట్ లోకి ఎంటర్ అవుతున్నాడని శాస్త్రం తెలిసిన శస్త్రిగారొకరు చెప్పార్రా, నా మాటిను ఒక్క పది రోజులాగెళ్ళు బడికి, అయినా ఇంకా ఏడవ తరగతి మొదలే కదా" అని నాకు సర్ది చెప్పింది. నేనూ సరేనన్నా.

నా ఆరవ తరగతి దాక బయట ప్రపంచం తెలియని మహేష్ బాబుని. నాకు మా బడి, మా పేట, శ్రీకాంత్ గాడు, ఆదివారం పూట వచ్చే ఆ మోగ్లీ కార్టూన్ అవే నా ప్రపంచం. మా నాన్న సెకండ్ హాండ్ సైకిల్ కొనివ్వటం, మా స్కూల్ను పక్కసందులో మార్చటం, మొదటి సారి షార్ట్ నోట్స్ నుండి లాంగ్ నోట్స్ కు రావటం అంతా ఒకసారి జరిగింది నా ఏడవ తరగతి లోనే. నేను పది రోజులు లేటుగా ఏడవ తరగతి మొదలపెట్టటం నాకు కొంచం భయంగానే ఉంది. నెమ్మిదిగా తరగతి గదిలో అడుగుపెట్టా.

"ఏంటే నిన్న మహేష్ బాబునిమ్మంటే పవన్ కళ్యాణిచ్చావ్? నీ వళ్ళ నేను హోమ్ వర్కు చెయ్యలేదు తెలుసా" అని సీత గీతతో అంటుంటే
"నా తబుని ఏమైందని నిన్న మాట్యూషన్ మాష్టారడిగార్రా గిరిగా , ఈ రోజన్నా నా తబుని నాకిచ్చెయ్ " అని సీను గిరితో అంటున్నాడు.
" నా సిమ్రాన్ కనపడటం లేదు ఎవరన్నా చూశారా ? " అంటూ అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని అడుగుతున్నాడు శ్రీకాంత్ గాడు,
"రేయ్ కాంతుగా ఏంటీగోల మహేష్ బాబేమిటి? పవన్ కళ్యాణ్ ఏంటి ? నీ సిమ్రాన్ కనపడకపోవటం ఏంట్రా ఇదంతా ? "
"రేయ్ అదా, నువ్వు రాలేదుగా ఇప్పటిదాకా మన బడెదుకుండా ఉన్న అంకుల్ కొట్టులో లాంగ్ నోట్స్ మీద హీరో హీరోయిన్ బొమ్మలున్న పుస్తకాలు తెచ్చార్రా, అదీ ఈ గొడవంతా.మహేష్ బాబంటే మాధ్స్ నోట్స్, పవన్ కల్యాణ్ అంటే పిజిక్స్ నోట్స్ , తబు అంటే తెలుగు నోట్స్ రా, నా సిమ్రాన్ అంటే నా సైన్స్ నోట్స్ రా ... "అని చెప్పి మళ్ళీ వెతుక్కోవటం మొదల పెట్టాడు.

ఏడవ తరగతి కామన్ పరిక్షలు పెట్టుకోని ఏ వినాకుడి నోట్స్ నో, షిర్డి సాయిబాబానో కావలనుకోకుండా ఈ హీరోయిన్ పిచ్చేంటో అనుకుని, నేను అంకుల్ కొట్టుకు వెళ్ళి "అంకుల్ సౌందర్య ఉందా ?", అనడిగా. ఓ 50 పుస్తకాలు నాకిచ్చి ఇంద్రజ మాత్రం ఈశ్వర్ తీసుకున్నాడు, మిగతావానిలో ఉందెమో చూసుకో అన్నాడు. ఒక్కోపుస్తకం తిప్పుతున్నా, అసలు అంతమంది హీరోయిన్స్ ని ఒకే చోట చూడటం అదే మొదటి సారి, ఈ విషయం మన ప్రొడ్యూసర్లుకు తెలిస్తే బొంబాయి బదులు ఇక్కడికే వచ్చి హీరోయిన్స్ ని చూసుకునే వాళ్ళు. కరక్టుగా పద్నాల్గవ పుస్తకం దగ్గర నేను, నా మనసు, ఒక్కసారిగా ఆగిపోయాయ్. మనసును చక్కిలిగింతలు పెట్టేటట్టుందామ్మాయి. ఆ అమ్మాయి రూపు రేఖలు చూస్తే ఇక్కడమ్మాయిలా లేదు, తను ఖచ్చితంగా అమెరికమ్మాయే. ఆ క్షణాన, నీకు తగిన జోడు ఆమె, జన్మ జన్మల మీ ప్రేమానుభూతే ఇది అని ఆకాశవాణి చెప్పింది. తనెలా ఉందో మీకు చెప్పలేదు కదా, తన జుట్టు నలుపు ముందు కాకి తెలుపు, తన తెలుపు చాయ ముందు పాలు నలుపు. గులాబీలు సైతం ఈర్ష పడేట్టంత యెర్రటి పెదాలు. మిలమిల మెరిసే డైమండ్ కళ్ళు. సొట్ట బుగ్గలు. అబ్బోహ్ కత్తి.

ఇంక ఆ రోజు బడికెళ్ళకుండా ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయా. వారానికి మూడురోజులు బడిడుమ్మా కొట్టి ఆ అమ్మాయి ఫొటోనే చూస్తూ ఉండేవాడిని, ఒక వేళ బడికెళ్ళినా ఏ పుస్తకాం మధ్యలొనో పెట్టుకుని ఆ ఫొటోనే చూస్తూ ఉండేవాడిని.

ఒక రోజు ఈ విషయం మా శ్రీకాంత్ కు తెలిసిపోయింది. వాడు "అస్సిగా అమ్మాయి చూస్తే అమెరికా అమ్మాయిలా ఉంది. వయసూ నీకన్నా కచ్చితంగా ఓ పదేళ్ళ పైనే ఉంది. ఫొటో కూడా పాస్ పోర్ట్ ఫొటోనే పేజీ అంతా ఉంది. నామాట విను నువ్వు ఆ అమ్మాయిని వెతకలేవు. మీ ఇంట్లోకనుక చెప్పినట్టైతే కచ్చితంగా ఆ అమ్మాయిని కలిసి నీకు కనీసం మన తొమ్మిదోతరగతి కల్లా పెళ్ళి చేస్తారు " అని ఓ సలహా ఇచ్చాడు.

నేను పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళా
"బామ్మా అమెక్కడుంది."
"లోపల గారెలేస్తుంది చూడు."
వంటింట్లోకి అడుగు పెట్టా. స్టవ్ మీద నూనె నా కాగుంది. అప్పుడే అమ్మ బాండీలో గారొదిలింది.
"అమ్మా నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను,అమ్మాయిది అమెరికా, నాకన్నా సుమారు ఓ పదేళ్ళు పెద్దది. కానీ నేను ప్రేమించాను. జన్మ జన్మల నుండి తనే నా భార్యట. దయచేసి మా ఇద్దరినీ విడదీయకుండా వాళ్ళింటికేళ్ళి తనను వొప్పిస్తావా ? " అనడిగా

ఏవండోయ్ వీడుచూడండి అంటూ మా అమ్మ బయటకు పరుగెత్తింది. కెమెరా బాండీలో ఉన్న గారే మీదకు మళ్ళింది.

<< 15 నిమిషాల తర్వాత >>

గారె రంగు మారింది (మాడిపోయింది). బాగ్రండ్ లో నా ఏడుపు " వద్దునాన్న, వద్దునాన్న", అని. కెమెరా మళ్ళీ నెమ్మిదిగా వంటింట్లో ఫోకస్ అయ్యింది. మా నాన్న లుంగీ పైకు కడుతూ "వెధవకు ఏడవ తరగి చదివి పాస్ అవ్వటం చాతకాదుకానీ పెళ్ళికావొల్సొచ్చిందంట, పెళ్ళి" అని నన్ను తిడుతూ వంటింట్లో నుండి బయటకు వెళ్ళారు. మా బామ్మ పరుగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మీద ఎప్పుడూ చెయ్యనివాడు అలాంటిది ఈ రోజు ఇంతకు తెగిస్తాడా, ముందే చెప్పాన్రా నాయినా ఇదంతా ఆ శని గాడి పనని జాగ్రత్తగా ఉండద్దూ అని నన్ను దగ్గరకు తీసుకుంది.


******

ఈ విషయంతో నా ప్రేమ మరీ బలపడింది. మా నాన్నగారితో మాట్లాడటం మానేశా. బడిలో, మాపేటలో కూడా అందరికీ తెలిసిపోయిందీ విషయం.అలా నా హాఫ్యియర్లీ పరిక్షలు దగ్గర పడుతున్న సమయం. మా ఇంటి ఎదురుకుండా లావణ్య వాళ్ళిళ్ళు. మేమిద్దరం ఒకటే తరగతి. మా ఇద్దరిమధ్య విపరీతమైన పోటీ. పోటీ అంటే అట్టంటిట్టాంటి పోటీకాదు రక్తసిక్తమైన పోటి. మా మధ్యనే కాదు మా అమ్మగారు వాళ్ళమ్మగారు మధ్యనకూడా. నిజం చెప్పాలంటే మా అమ్మ, వాళ్ళమ్మా ఆడే ఆటలో మేము కేవలం పావులమే. నా అదృష్టం ఏటంటే లావణ్య కూడా నాలానే అంతంతమాత్రమే నేను రెండు రెళ్ళు ఆరంటే తను కాదు ఐదనేది.

ఓ ఆదివారం సాయత్రం ఎప్పటిలాగానే మా అమ్మగారు E TV లోని ఘుమఘుమలు ప్రోగ్రామ్ చూస్తూ స్టవ్ వెలిగించారు. ఈ సారన్నా అమ్మ ఏమన్న చేస్తే బావుండు అని నేను నా ఫొటో రాణితో పక్కనే నిలబడ్డా. ఇంతలో లావణ్యా వాళ్ళమ్మగారు కళ్యాణి,కళ్యాణి అంటూ లోపలకొచ్చారు.

"ఏంటి కళ్యాణి ఈ మధ్య మీ అబ్బాయి ఎదో ఫొటో పట్టుకుని ప్రేమా ప్రేమా అని తిరుగుతున్నాడట. ఎవ్వరి మాటా వినట్లేదట. ఏమోనమ్మ మొన్న లావణ్య కోసం స్కూలుకెళితే వాళ్ళ టీచర్ చెప్పారు. ఏమాటకామాటే మా లావణ్య మాత్రం అలా కాదు. రెండు మార్కులు తక్కువొస్తాయన్న మాటేగానీ నా మాటకెన్నడూ ఎదురుచెప్పదు. ఏవోనమ్మా ఆ టీచర్ గారన్న మాటలే చెపుతున్నా. అయ్యో నా మతిమరపు మండా స్టౌ మీదాపాలు పెట్టా మల్లొస్తా" అని వెళ్ళిపోయింది. నాకీరోజు మూడిందని నేను నిశ్చయించుకున్నా. అమ్మ నెమ్మిదింగా లోపలకొచ్చి మొదట స్టవ్ ఆప్ చేసింది. తరవాత టివి ఆఫ్ చేసింది. ఈ సారి కెమేరా మా సందు చివరున్న చెరుకురసం వాడిదగ్గరకు మళ్ళింది. వాడు పెద్ద పెద్ద ఐస్ ముక్కలను ఓ రబ్బరు సంచి లో మడిచి ఆ కొనను ఎడం చెత్తో పట్టుకుని కుడి చేత్తో రోకలి బండతో ఆ ఐస్ ముక్కలను వీర బాదుడు బాదుడు.

<15నిమిషాల తర్వాత >

నా పాటికి నేను ఆ ఫొటో పట్టూకుని ఏడుస్తుంటే, మా బామ్మ పరుగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మీద ఎప్పుడూ చెయ్యయ్యనిది అలాంటిది ఈ రోజు ఇంత పని చేస్తుందా ?,నేను ముందే చెప్పాన్రా నాయినా ఇదంతా ఆ శని గాడి పనని జాగ్రత్తగా ఉండద్దూ.ఎందుకు నాయినా అందరి చేత ఇలా దెబ్బలు తింటావ్? ఆ అమ్మాయి ఎక్కడున్నా నేను తెచ్చి నీతో పెళ్ళిచేస్తాలే. అంతవరకూ ఇలా అభాశుపాలుకాకురా అని నన్ను దగ్గరకు తీసుకునేది.నాకు ఆక్షణాన మా బామ్మ కే.ఆర్.విజయలా(దేవతలా) కనిపించింది.

**********

యన్యువల్లీ పరిక్షలు దగ్గరపడ్డాయ్, వీటి తరువాత ఇక కామన్ పరిక్షలే. ఒక్క ముక్క చదవలేదు. అందరూ నా ఏడవ తరగతి పోతుందని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఎవరెంత చెప్పినా వినేవాడిని కాను. మా బామ్మ బతిమిలాడితే మాత్రం ఓ అరగంట అలా పుస్తకం పట్టుకున్నట్టు నటించేవాడిని. మా బామ్మ కూడా అప్పుడప్పుడు ఆ ఫొటో చూసి నా మనమరాలు బావుందిరా అని నన్ను ఇంకా ప్రోత్సహించేది. ఎప్పట్లానే నేను కూడా ఆ ఫొటో తోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేసేవాడిని.

ఓ రోజు శ్రీకాంత్ గాడు పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చి "రేయ్ మా మామయ్య అమెరికా నుండి మా ఇంటికి వచ్చార్రా. ఆ ఫొటో చూపిద్దాం, మా మామయ్య ఇప్పుడే అమెరికా నుండి నీకేం కావాలంటే చెప్పు నేను తీసుకొస్తానని అన్నారు. ఈ అమ్మాయిని చూపించి తీసుకుని రమ్మంటా అన్నాడు. ఫొటో తీసుకుని రోడెక్కాం. పనిలో ఉన్న పిల్లులన్నీ పని కట్టుకుని మరీ ఎదురొచ్చాయ్. ఎన్నాళ్ళనుండో నన్ను హింసిస్తున్న అనేక ప్రశ్నలు ఈ రోజు తీరబోతున్నాయి. అసలా అమ్మాయి ఎవరు ? తన పేరేంటి ? తనదేవూరు ? నన్ను తన భర్తగా ఒప్పుకుంటుందా ? మాది జన్మజన్మల ప్రేమ ని తనకు గుర్తుంటుందా ? ... ఇలాంటి నిరంతర ప్రశ్నలతో నేను శ్రీకాంత్ వాళ్ళు ఇంట్లోకడుగుపెట్టాం. కుశలప్రశ్నల తరవాత శ్రీకాంత్ గాడు

"మామయ్యా నేను చెప్పాకదా ఆ ఫొటో ఇదే" అని నా చేతిలోనుండి ఫొటో తీసుకుని వాళ్ళ మామయ్య చేతికిచ్చాడు.
ఫొటోతీసుకున్న వాళ్ళ మామయ్య రేయ్ "ఇది మైకెల్ జాక్సన్ రా ", అన్నాడు.
"చెప్పనారా మా మామయ్య ఆమెను కనిపెట్టేస్తాడని." అన్నాడు శ్రీకాంత్
" నీ బొంద ఆమెకాదు వాడు. మైకెల్ జాక్సన్ అన్నవాడు మగవాడు".

1. మగవాడు ( కుడి వైపు )

2. మగవడు (ఎడం వైపు )

3. మగవాడు (పైన )
ఆ మాటాలు నాకు మూడుసార్లు నల్దిక్కులా వినిపించాయి. నా ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది.ఇన్నాళ్ళు నా ఏడవ తరగతి పుస్తకాలపై కట్టిన మేడ ఆ క్షణాన కూలిపోయాయి. బాధ తట్టుకోలేక స్లో యాక్షన్ లో ఇంటికెళ్ళి జరిగినదంతా మా బామ్మకు చెప్పి బాధపడ్డా. మా బామ్మ నన్ను పరామర్శించకపోగా కాలికా అవతారమెత్తింది. " వెధవన్నార వెధవా పోయిపోయి ఓ మగవాడిని ప్రేమిస్తావా ? మన ఇంటా వంటా ఉందా ? మీ తాతాగారు ఆరోజుల్లోనే పెళ్ళైనా కూడా ఏడవ ఫారమ్ పాసయ్యారు తెలుసా, అయినా ఆ వెధవెవడో అచ్చం ఆడ ముండ లానే ఉన్నాడు అని దగ్గరలో ఉన్న చీపురుకట్ట తిరగేసింది. అంతే నేను ముందు మా బామ్మ వెనుకా మా పెటంతా రెండు రెండ్లు వేశాం. నాకైతే ఆయాసం వచ్చింది కానీ మా బామ్మ మాత్రం ఆగితే ఒట్టు.
" బామ్మా ఇదాంతా నా తప్పుకాదే నువ్వే చెప్పావ్ గా శని గాడు నా సైడ్ పాకెట్ లోకి ఎంటరయ్యాడని. " అన్నా

"శనిగాడు లేదు నీ పిండాకూడు లేదు", అని వీర ఉతుకుడొతికింది. చివరకు మా అమ్మ, నాన్న వళ్ళ కూడా కాలేదు మా బామ్మనాపటం.

ఆ రోజు నుండి మా బామ్మ చీపురుకట్ట పట్టుకుని నా ఏడవ తరగతి దాకా నా చూట్టూ తిరుగుతునే ఉంది. చివరి నెలలో పొద్దున తొమ్మిదింటి నుండి చెవులో చేతులు పెట్టుకుని ముందుకూ వెనక్కూ ఊగుతూ అంతా బట్టీ వేసేవాడిని. ఏ క్షణాన ఆగినా వెంటనే మా బామ్మ చీపుకట్ట పట్టుకుని వచ్చేది. చివరకు పరిక్షహాలుకు కూడా చీపురుకట్టపట్టుకునే వచ్చింది.

ఆ రోజు అందరి నోములు ఫలించిన రోజు మొత్తానికి 600 లకు 444 మార్కులతో ఏడవ తరగతి గట్టెక్కా. మా బామ్మ శాంతించింది.

***********

నా కిప్పటికీ చికాకే ఆటోగ్రాఫ్ పుస్తకాలలో first crush అని చూస్తే. మొన్నో రోజు నా పాతపుస్తకాలు సర్దుతుంటే ఈ పదాలు కనపడ్డాయి.

తన జుట్టు నలుపు ముందు కాకి తెలుపు, తన తెలుపు చాయ ముందు పాలు నలుపు. గులాబీలు సైతం ఈర్ష పడేట్టంత యెర్రటి పెదాలు. మిలమిల మెరిసే డైమండ్ కళ్ళు. సొట్ట బుగ్గలు. అబ్బోహ్ కత్తి.

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఉప్మా పురాణం

http://kranthigayam.blogspot.com/2008/07/blog-post.html(అప్పుడు ఏమి జరిగిందంటే.. క్రాంతి )



తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏదయినా ఉంది అంటే అది "ఉప్మా".ఉప్మా నిజంగా తెలుగు పదమేనా,కాదా అంటే నాకు తెలియదు.ఉప్మా పుట్టుపూర్వోత్తారాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడ లేవు నాకు.ఉప్మా అంటే ఎందుకు నాకు అంత చిరాకంటే రెండు,మూడు,నాలుగు కారణాలున్నాయి.మొదటిది నాకు జ్వరమొచ్చినప్పుడల్లా అమ్మ ఉప్మానే చేస్తుంది.ఎందుకంటే అంటే తొందరగా జీర్ణం అవుతుందని చెప్పేది.ఇప్పుడంత తొందరగా జీర్ణం అవ్వకపోతే ఏమి కొంపలు మునిగిపోతాయో నాకు అర్ధం కాదు.రెండవది,నేను రకరకాల హాస్టల్స్ లో రకరకాల ఉప్మాలు తిన్నాను(ఏమని చెప్పను నా ఉప్మా కష్టాలు!).మూడవది,పై రెండు కారణాల్లో ఏదో ఒకటి.నాలుగవది,పై మూడు కారణాలు.

చిన్నప్పట్నుంచి కూడ మా ఇంట్లో ఉప్మా టిఫిన్ అయినరోజు నేను ప్రళయం సృష్టించేదాన్ని.భాదాకరమయిన విషయమేంటంటే మానాన్న కూడ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు."బాగానే ఉంది కదరా,తినొచ్చు కదా!" అని చెప్పేవాళ్ళు.మీకు తెలియదు నాన్న ఉప్మా తినడం ఎంత నరకమో అని అనుకునేదాన్ని నేను.అయినా ఉప్మా తినడమే ఎక్కువంటే అందులో మా అమ్మ వేసే చెత్త చెదారం అంతా ఇంతా కాదు.కరివేపాకు(ఉప్మా తరవాత నాకు అత్యంత చిరాకు తెప్పించే పదార్ధం ఇది),కొత్తిమీర,అల్లం ముక్కలు,బీన్స్,క్యారెట్,నా మొహం..etc అన్నమాట.మా అమ్మకంతా నా పోలికే,నాకన్నా పంతం కాస్త ఎక్కువే.ఉప్మా చేసిన రోజు కావాలని నన్ను మానాన్న ముందు కూర్చోబెట్టి తినిపించేది.కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కాని కనికరించేది కాదు మా కనకదుర్గ! నాకు ఉప్మా తినిపించాక అమ్మ మొహంలో విజయ గర్వం కనిపించేది.ఉప్మారవ్వతో చేసే ఉప్మా కాకుండ మాఅమ్మ ఇంక రకరకాల ఉప్మా ప్రయోగాలు చేసేది.ఇడ్లీ ఉప్మా,బ్రెడ్ ఉప్మా,సేమ్యా ఉప్మా..ఇంకా రకరకాలవి.నేనొకసారి అమ్మకి చెప్పాను,"అమ్మా! నువ్వు ఎన్ని రకాలుగా చేసినాకాని,ఉప్మాపట్ల నా మనసు మార్చుకోను.ఉప్మా,నేను బద్దశత్రువులం.మా ఇద్దరి మధ్య ఎప్పటికి ప్రేమ పుట్టదు..పుట్టదు".మాఅమ్మ కోపం నటిస్తూ "ఈ తెలివితేటలకేం తక్కువలేదు" అంటూ నవ్వేసింది.అయినా నాకు అర్ధంకాక అడుగుతాను ఇడ్లీని ఇడ్లీగా,బ్రెడ్ ని బ్రెడ్ లా తినొచ్చుకదా,మళ్ళీ అన్ని efforts పెట్టి ఉప్మాలా మార్చడం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించండి.ఇంకా విచిత్రం ఏంటంటే పెసరట్టు-ఉప్మా!నేను పెసరట్టు తిని ఉప్మా మాఅక్కతో తినిపించేదాన్ని.

ఉప్మా నాకు శత్రువులని కూడ తెచ్చిపెట్టిందంటే మీరు నమ్ముతారా! కాని ఇది నిజం.చిన్నప్పుడు నేను Rose buds convent school లో LKG చదివేదాన్ని.మానాన్న నన్ను బళ్ళో చేర్చేటప్పుడు టీచర్ కి "మాఅమ్మాయికి చదువు రాకపోయినా పర్వాలేదు కాని కొట్టొద్దు" అని చెప్పారు.కాబట్టి టీచర్ నన్నేమి అనేది కాదు.రోజు మాటీచర్ నాకు అటుకులు,పంచదార కలిపిస్తే తినేసి అరుగు మీద పడుకునేదాన్ని.స్కూల్ అయిపోయే టైమ్ కి కృష్ణ నన్ను నిద్ర లేపేవాడు.వాడితో కలసి ఇంటికొచ్చేదాన్ని.కృష్ణ మా పక్కింట్లో ఉండేవాడు.వాడు కూడ నాక్లాసే! ఒకరోజు కృష్ణ నన్ను ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు స్కూల్ కి.నేను ఆ పేస్ కి మ్యాచ్ అవ్వలేకపోయా.అంత ఫాస్ట్ గా నడవలేక నేను నీతో రాను అని ఒక చెట్టుకింద కూర్చున్నాను.కృష్ణకి చాలా కోపమొచ్చింది."తొందరగా నడుస్తావా,లేదా?ఉప్మా మొహమా!" అని అన్నాడు.నన్ను ఉప్మా మొహం అంటావా అని పక్కనే ఉన్న రాయితో వాడి తలమీద ఒక్కటిచ్చా! అంతే క్షణాల్లో వాడి మొహమంతా రక్తం.తెల్లటి వాడి షర్ట్ కూడ ఎర్రగా అయిపోయింది.మా ఇద్దరికి రక్తం చూసేసరికి కంగారు పుట్టింది.ఇద్దరం రోడ్డుమీదే నిల్చోని ఏడుస్తుంటే ఎవరో ఒకాయన మమ్మల్ని సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చాడు.హాస్పిటల్ కి తీసుకెళ్ళాక వాడి గుండుకి కుట్లు పడ్డాయి.నేను కొట్టిన ఉప్మా దెబ్బతో వాడి డిప్ప షేపు మారిపోయింది.ఆ తరవాత కృష్ణ మళ్ళీ ఎప్పుడు నన్ను స్కూల్ కి తీసుకెళ్ళలేదు.ఆడుకోవడానికి కూడ మా ఇంటికి వచ్చేవాడు కాదు.అసలు నన్ను చూస్తేనే చాలు భయపడేవాడు.వాడు మాట్లాడకపోతే వాడి ఉప్మా ఖర్మ అనుకొని నేను కూడ వదిలేసాను.అయినా ఫ్రెండ్షిప్ లో ఆ మాత్రం చిన్న చిన్న గొడవలు రావా ఏంటి? ఆమాత్రానికే మాట్లాడటం మానేస్తే ఎలా?

ఇంక పెళ్ళిళ్ళప్పుడు,వ్రతాలప్పుడు చూడాలి,సామిరంగా! ఒక్కొక్కడు మానెడు ఉప్మాలో సోలెడు చట్నీ పోసుకొని లాగిస్తుంటాడు.మళ్ళీ గడికొకసారి ఎవరోఒకరు వచ్చి "పలహారాలు తిన్నారా?" అని అడుగుతారు.ఆ పెద్ద పెట్టావులేవోయ్ గొప్ప పలహారం అని అనుకుంటాను నేను.ఇంతకీ ఉప్మా పురాణంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే,ఉప్మాది మైనపు నమూనా చేసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలి.అంతటి ఐటమ్ ఛీజ్ ఉప్మా.

ఓం రుబ్బుడాయ నమహా --- ఓం బాదుడాయ నమహా....

http://srividyab4u.blogspot.com/2008/09/blog-post.html(బ్లాగువనం -శ్రీవిద్య)

అది నేను "జూ"నియర్ ఇంటర్ కాలేజీలో చేరబోతున్న రోజు.అంటార్టికా ఖండం నుంచి తీతువు పిట్ట నీకు మూడిందే అన్నట్టు భయంకరంగా సింగుతోంది. ఆటోవాడ్ని కాలేజీ ముందు ఆపమనగానే, వాడు సడెన్ బ్రేక్ సడెన్ గా వేసి, కాలేజి వంక అసహ్యంగా, నా వంక అత్యంత జాలిగా చూసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు.

ఫార్మాలిటీస్ అయ్యాక, మా ప్రిన్సిపాల్ నా చేతిలో ఒక పేపర్ పెట్టాడు. హాలిడేస్ లిస్టేమో అని ఆత్రంగా తెరిచిచూసాను. అది.. అది.. టైం టేబుల్. దాని సారాంశం నా భాషలో క్లుప్తంగా చెప్తా."పొద్దున్నే నాలుగింటికి లేచి ఓం రుబ్బుడాయ నమహా అనుకుంటూ రోలు చుట్టూ వందసార్లు తిరిగి, పుస్తకాలు ముందేసుకుని రుబ్బాలి. తర్వాత ఓం బాదుడాయ నమహా అనుకుంటూ రోకలి ముందు వెయ్యిసార్లు పొర్లాక క్లాసుకెళ్ళాలి. అక్కడ సారు సాంబారు, నల్లతారు కలిపితే సెలయేరు అవుతుందని బోధించినా నోర్మూసుకుని బాదించుకోవాలి. సాయత్రం మళ్ళీ ఓం రుబ్బుడాయ నమహా అని లక్షసార్లు అనుకుని సారు చెప్పినవి, చెప్పనవి, చెప్పబోయేవి, చెప్పలేనివి అన్నీ కలిపి అర్ధరాత్రి వరకు రుబ్బేయాలి.సరిగ్గా రుబ్బని మొండిపిల్లలకి క్రిమీభోజనం, కుంభీపాకం లాంటి లైటువెయిట్ శిక్షలు విధించబడతాయి".అది చూసి కళ్ళు తిరిగిపడిపోయాను.

కొన్ని యుగాల తర్వాత కళ్ళు తెరిచి "నేనెక్కడ వున్నాను. నాకేమయ్యింది" అన్నాను తెలుగు సినిమా హీరోయిన్లా.. "క్లాసురూములో వున్నావు. నువ్వు పడిపోయినా, ఈ సబ్ కాన్షస్ మైండ్ పాఠాలు వింటుందని ఇక్కడకి తీసుకొచ్చారు" అంది పక్కనమ్మాయి మెరుస్తున్న కళ్ళతో. ఇంతలో ఎవరివో ఆర్తనాదాలు వినిపించాయి. ఆ కేకలు..ఆ కేకలు ఇంతవరకు పాఠాలు విన్న నా సబ్ కాన్షస్ మైండ్వి. ..అలా మొదలయ్యాయి నా రుబ్బుడు కష్టాలు.

ఆ కష్టాలు భరించలేక క్లాసులొ నాకు తలనొప్పి వచ్చేసేది. స్టడీ అవర్స్లో చెవి నొప్పి, స్లిప్ టెస్టులొ నాకేమి రాకపోతే పంటి నొప్పి. అప్పుడప్పుడు వెరైటీ కోసం కాలినొప్పి, వేలినొప్పి, గోరునొప్పి, జడనొప్పి వగైరా వగైరా.... ఇలా నేను నొప్పులు, వాటి గొప్పలు, తప్పుగా వాడితే నెత్తికి కట్టే బొప్పులు అనే విషయం Ph.D చేసి ఝండు బాం, అమృతాంజనం వారు సంయుక్తంగా అందించే డాక్టరేట్ అందుకోబోయే సమయంలో నా కర్మకాలి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మా ప్రిన్సిపాల్ సారు పిలిచారు. లొపలకెళ్ళగానే "ఏంటి తల్లీ.. ఇలా చేసావు. లెక్కల్లో 150 కి 160 (???) వస్తాయి అనుకుంటే 140 మాత్రమే తెచ్చుకున్నావు. ప్రాక్టీసు సరిగ్గా చెయ్యలేదా..? చెప్పు" అని కిచ్ కిచ్ వేసుకోని గరగరమనే గొంతుతో గద్దించాడు.

ఊరికే సర్దాకి చదవాలినిపించక చదవలేదని చెప్తే చీరేస్తాడని నా ఆత్మసీత హెచ్చరించింది. అందుకని ఎందుకొచ్చిన గొడవలే అని మౌనంగా వుంటే నా మౌనాన్ని అపార్ధం చేసుకుని "సర్లే తల్లీ. బాధపడకు. బెటర్మెంట్ కట్టేసేయ్. ఈ సారి మంచి మార్కులు తెచ్చుకో" అనగానే సముద్రాలు పొంగుతున్న ఫీలింగ్, భూకంపం వచ్చినంత షేకింగ్, హెడ్ బ్రేకింగ్. నేను పరీక్షలకి కష్టపడి చదివేదే ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలని. పాసయిపోయాక కూడా మళ్ళీ పరీక్ష ఎందుకు రాయాలి..? ఆ క్షణంలో నాకు అర్జెంటుగా ఆడ సన్యాసుల్లో కల్సిపోవాలి అన్నంత విరక్తి వచ్చింది.

రూముకెళ్ళి ఏం చెయ్యాలో తోచక దీనంగా కూర్చున్నా. శ్రావ్య వచ్చి " ఏంటి విద్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు" అని అడిగింది."ఏముంది శ్రావ్యా.. బెటెర్మెంట్ ఎలా ఎగ్గోట్టాలా అని" అన్నా మరింత దీనంగా మొహం పెట్టి."ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది. ఎప్పట్లానే మళ్ళీ మోకాలి నొప్పి అని చెప్పు" అంది నవ్వుతూ.ఆక్షణంలో దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తొందర్లోనే నేను సన్యాసుల్లో చేరబోతున్న విషయం గుర్తు వచ్చి శాంతం శాంతం అనుకుంటూ ఎలానో నిగ్రహించుకున్నా. "మళ్ళీ నొప్పంటే చెప్పు తీసి కొడతారే. మీరేదైనా మంచి కత్తిలాంటి జబ్బు పేరు పుణ్యం కట్టుకోండే" అని బతిమాలుకున్నా."ట్యూమరో, కాన్సరో అని చెప్పు. భయపడిపోయి ఇంటికి పంపేస్తారు" అంది నాకుమల్లే GKలో జీరో లెవెల్ కి కింద , CK(సినిమా నాలెడ్జ్)లో ఇనిఫినిటీ కి పైన వుండే రేణు."చీ నోర్ముయ్.. ట్యూమర్, కాన్సర్ అని మనం చెప్పకూడదు. డాక్టర్ చెప్పాలి.." అంది ఇంకో అమ్మాయి..ఆ లోపు Bi.P.C పిల్ల నిషా అవిడియా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది."అప్పుడెప్పుడో ఊపిరి ఆడట్లేదని మాధురి అంటే దానికి పదిరోజులు సెలెవిచ్చారు. నువ్వు ఊపిరి ఆడట్లేదని నటించు." అంది విజయగర్వంతో...

నిజం చెప్పొద్దూ.. నాకూ ఆ అవిడియా పిచ్చపిచ్చ్గగా నచ్చేసింది. నొప్పి నొప్పి అని చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. అసలే ఆలస్యం చిరంజీవి బాలకృష్ణ అని సెట్టింగ్స్, కాస్ట్యూంస్ అన్నీ చకా చకా సిధ్ధం చేసి రిహార్సల్స్ కూడా చేసేసాం. నటించడం కూడా సుళువు. గాలి కొంచెం గాట్టిగా.... గబా గబా.... పీల్చాలి అంతే. కానీ.. కానీ... ఊపిరి ఊరికే ఊసుపోక ఆందకుండా పోదని,దానికీ కొన్ని బలమైన కారణాలు వుంటాయన్న విషయం ఆ ఊపులో మ ఎవ్వరి ఊహకి అందలేదు. మనమొకటి తలిస్తే మాస్టార్లొకటి తలుస్తారని మా ఫిజిక్స్ సారు మా డ్రామా లొకేషన్ హాస్పిటల్ కి మార్చేసారు. లొకేషన్ ఏదైనా డెడికేషన్ తో చెయ్యగల సత్తా నాకున్నా బలంగా ఎత్తుగా ఎస్వీ రంగారెడ్డిలా వున్న డాక్టరుని చూస్తే కొంచెం దడ పుట్టింది.

ఆయన విషయం కనుక్కుని స్టెతస్కోపుతో నా గుండె ఇంకా కొట్టుకుంటుందని నిర్ధారించేసుకుని "పరీక్షలు ఏమైనా వున్నాయా" అని అడగ్గానే.. మేటర్ తెల్సిపోయిందేమొనని టెన్షన్ వచ్చేసి గబుక్కున స్టూల్ మీంచి జారిపడబోయాను. ఈలోగా మా ప్రిన్సిపాల్ చేతిలో ఏదో ఇంజెక్షన్ పట్టుకుని దిగాడు. "డాక్టరు గారు మా పిల్లకి ఊపిరాడటం లేదని డెరిబిలీన్ ఇంజెక్షన్ తెచ్చా. చేసేయండి." అంటుంటే ఆయన్ని ఎత్తి గిర గిరా తిప్పి అవతల పడేయాలన్నంత కోపం వచ్చింది. దిక్కుమాలిన కంగారు . అవతల డాక్టరు చూసున్నాడుగా. "ఏమీ అవసరం లేదు. పరీక్షల టెన్షన్ అంతే" అంటున్నా సరే ఆగకుండా "పర్లేదు చేసెయ్యండి. పడి వుంటుంది.అసలే వారంలో పరీక్షలు" ఆయన అంటుంటే నిషా వంక దీనంగా చూసా..అదేమో అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్టు ఇంకా దీనంగా చూసింది.

ఈలోపు నర్స్ లైటేసింది. అవసరమైనపుడు అసలు పని చెయ్యని నా బుర్ర ఆ క్షణం అడక్కుండానే పని చేసి ఒక తొక్కలో థియరీని కనిపెట్టి చచ్చింది.. "ఆరివున్న బల్బ్ స్విచ్ నొక్కితే వెలిగింది. అదే వెలుగుతున్న బల్బ్ స్విచ్ నొక్కితే ...... ఆరిపోతుంది. అలానే ఊపిరి లక్షణంగా ఆడుతున్న నాకు ఆ ఇంజెక్షన్ ఇస్తే నా ఊపిరి... ఆగిపోతుందా" అంత వెధవ లాజిక్ వర్క్అవుట్ చేసిన నా బుర్ర మీద నాకే వెర్రి కోపమొచ్చింది. పోనీలే నా బుర్రని డైవర్ట్ చేద్దామని గోడల వంక, వాటి సున్నాల వంక చూడ్డం మొదలెట్టా. మరేమో గోడ మీద దండేసి వున్నడాక్టర్ గారి నాన్నారి ఫొటో ప్లేసులో నా మొకం కనిపించింది. నాకంత ఊహాశక్తి ఇచ్చిన దేవుడి మీద ఇంకా కోపం వచ్చింది.

ఈలోపు "మేస్టారు. మీరు కంగారుపడకండి. మై హూ నా" అని డాక్టరంకుల్ అంటుంటే ఆయన కృతజ్ఞత వరద నీరులా పొంగి పొర్లింది. "చూడమ్మా పరీక్షలు రిక్షాల్లాంటివి. మనం రిక్షాలాగేటోళ్ళమన్న మాట. అసలు రిక్షావోళ్ళు మన రిక్షా బక్కోడు ఎక్కుతాడా,బండోడు ఎక్కుతాడా, మనం తొక్కగలామా లేదా ఇలాంటి బెంగలు అసలు పెట్టుకోరు. అలాగే మనం కూడా మనం చదివెలగబెట్టిన ఒకే ఒక చాప్టర్లో నుంచి ప్రశ్నలు వస్తాయా, రావా మనం పాసవుతామా లేదాలాంటి వెర్రి సందేహాలు పెట్టుకోకూడదు. అర్ధమయ్యిందా... కాసేపు బయటికెళ్ళికూర్చో " అన్నారాయన. నాకు చిరాకేసింది. పాసయిపోయిన పరీక్ష గురించి నేనెందుకు బెంగ పెట్టుకుంటాను. కాసేపటికి మా ప్రిన్సిపాల్ బయటకి వచ్చాడు.డాక్టరంకుల్ ఏం చెప్పాడో కానీ "సర్లే తల్లీ.. ఈ పరీక్షలు గురించి పూర్తిగా మర్చిపో.. టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు" అంటుంటే నాకు డెబ్యూట్ సినిమాకే "నటీముత్యం" బిరుదు ఇచ్చినంత సంబరం వేసింది.

మొత్తానికి అలా పరీక్షల లంపటం అంత కష్టపడి వదిలించుకుని ఆటోలొ కూలబడి ఓ రెండుగంటల హైడ్రామా తర్వతా ప్రశాంతంగా, స్వేచ్చగా గాలి పీల్చుకున్నాను. అదొట్టి అనుమానపు గాలేమో, వెంటనే నాకో పిచ్చి డౌట్ వచ్చింది. "నిషా.. నాది ఏక్షన్ అని సారుకి అనుమానం వచ్చిందంటావా.." అని అడిగాను కుతూహలంగ...."నీ మొహం. ..నువ్వలా జీవించేస్తూ అరకొరగా ఊపిరి పీల్చడం వల్ల నిజంగా ఊపిరాడటంలేదేమో అని.. నాకేభయం వేసింది" అంది కోపంగా.

సరిగ్గా అప్పుడే ఆటో ఆగింది. ఆటోవాడు వెనక్కి తిరిగాడు. వాడు.. వాడు మొదటి రోజు కాలేజీలో డ్రాప్ చేసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయినోడు. "చెల్లెమ్మా. ఈ డొక్కు కాలేజీలో చదివి ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటున్నాను. నిన్ను చూస్తే గర్వంగా వుందమ్మా. ఆ ఆ రుబ్బుడు భూతం ప్రిన్సిపాల్ .......ని నమ్మించగలిగావంటే నీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నీ రాక సీరియళ్ళకి స్వర్ణ యుగం, సువర్ణ యోగం తెస్తాయమ్మా..." అంటూ ఆటొ అన్నయ్య ఊగిపోతుంటే ఆ షాకుకి నాకు నిజంగానే ఊపిరాడటం మానేసింది.

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)

http://meenakshir.blogspot.com/2008/07/blog-post.html(మీనాక్షి గారు - మీనాక్షి బ్లాగ్ )



మూగవోయిన నా గళమ్మునను కూడా నిదురవోయిన సెలయేటి రొదలు కలవు....
అన్న" కృష్ణశాస్త్రిలా",నేను నోర్మూసుకుని ఉందామనుకున్నా....కాని..బాధలు ఎవరికైనా చెప్పుకుంటే
మనసు తేలిక పడుతుంది అంటారు కదా...అందుకే నా బాధను మీతో పంచుకుంటున్నా.....
**************************************************
3 నెల్లు అయింది....వరంగల్ కి వెళ్ళక......కాని , మొన్నతప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది....ఎందుకంటే
మా బబ్బీగాడు కాల్ చేసి మీనక్క.. బుచ్చిబావ కి accident అయింది నువ్వు వచ్చేయ్..
అన్నీ విషయాలు నీకు ఇక్కడికి వచ్చాక చెప్తాను...అని చెప్పి కాల్ కట్ చేసాడు..
వరంగల్ కి వెళ్ళేసరికి చాలా పొద్దు పోయింది....అన్నం తినేసి పడుకున్నా......!!!
"చిరంజీవి" వస్తే అభిమానులు పిలవకుండా ఎలా వస్తారో...
"నేను" వచ్చానని తెలుసుకొని మా వరంగల్ దోమలు,ఈగలు..బస్సులు,లారీలు,ఆటోల మీద....వచ్చాయి...
అవి తెల్లవార్లూ నాకు ఒకటే, "ముద్దులు"...వద్దన్నా వినకుండా....దుప్పటి లాగి మరీ పెట్టాయి........
*********************************************
తెల్లవారింది...నేను,బబ్బీ త్వరగా Hospital కి వెళ్ళాలని ready అయిపోయాము....
ఇంతకి ఎవరిని చూడ్డానికి వెల్తున్నామో.....అనుకుంటున్నారా..?
నాకు తెలుసు మీకు తెలుసుకోవాలని ఉందని......మా "బుచ్చిబావ" ని చూడ్డానికి వెల్తున్నాం...
"ఈ బుచ్చిబావ" ఎవరబ్బా.?..మీను మాకు ఎప్పుడు చెప్పనేలేదు..
అనుకుంటున్నారా..ఐతే ఇప్పుడు చెప్తాను మీకందరికి .....మీరంతా ఏం చేస్తారంటే,
ఒక బకెట్లో..వాటర్..తెచ్చుకోండి..(అయ్యో బట్టలుతకడానికి కాదండోయ్ Flashback లోకి వెళ్ళడానికి..)
తరవాత అందులో..ఒక రాయి వేయండి.....వేసేసారా....ఇప్పుడు అందులో తరంగాలు మొదలవుతాయి.....
ఒక తరంగం,రెండు తరంగాలు,మూడు తరంగాలు,నాలుగు తరంగాలు.....
అలా ఆ తరంగాలను చూస్తూ చూస్తూ ....నా flashback లోకి దూకేయండి........
*************************************************************
ఆ రోజు ఏం జరిగిందంటే......???
నాన్న గారు అప్పుడే వచ్చారు...నేను,బబ్బీ ఏదో మాట్లాడుకుంటున్నాము....
నాన్న గారు నన్ను,బబ్బీ ని పిలిచి రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు..అని చెప్పారు....
మీరిద్దరు.." కోతిచేష్టలు" చేయకుండా..బుద్ధిగా ఉండాలి అన్నారు......
సరే అని ఇద్దరం తలలూపాం..........
లోపలికి వెళ్ళాకా మా బబ్బీగాడు చెప్పాడు....మీనక్క...నీకు తెలుసా..
వాళ్ళను రమ్మనడం వెనక ఒక పెద్ద కారణం ఉంది.....
వాళ్ళకు ఒక్కగానొక్క "పుతేర". (సుపుత్రుడు) ఉన్నాడు.....అతని నామధేయం "బంక వెంకట రమణా రెడ్డి"..
అలియాస్ "బుచ్చిబాబు"..(MBBS).
"ఇతనికి కుడిపక్క అమ్మా,ఎడమ పక్క నాన్న తప్పా వెనకా,ముందు ,పెద్దగా ఆస్తి పాస్తులేమి లేవు"..
కాని అబ్బాయి "చుక్కల్లో చంద్రుడు..,మంచివాడు,బుద్ధిమంతుడు"...
వాళ్ళు మనకి దూరపు బంధువులు..వరసకి అత్తయ్య,మావయ్య అవుతారు..
ఇక పోతే ఆ బుచ్చిబాబు గారు మనకి "బావ" అవుతాడే మీనక్క....
ఒక వేళ.. ఆ బుచ్చిబాబుకి నువ్వు,నీకు బుచ్చిబాబు నచ్చితే తరవాత
పిపిపి.....డుం..డుం..డుం..అన్నమాట..అని అసలు సంగతి చెప్పాడు...
**********************************************
మా నాన్న గారు నా పెళ్ళికి ఇంత తొందర పడుతున్నారేంటబ్బా అనుకుంటున్నారా...?
అయ్యో..రామా..!మళ్ళీ అదో పెద్ద..Flashback...
ఈనాటికి..సరిగ్గా 22 సంవత్స్రరాల క్రితం...ఈ భూమిపై ఒక "అద్భుతం" జరిగింది...
ఆ రోజు..Feb 14th..రాత్రి ..సమయం..సరిగ్గా 10.32 min.,,అవుతుంది.
అప్పటివరకు ఆకాశంలో ఏ మూలో నక్కి ఉన్న కారుమబ్బులు
వేగంగా కమ్ముకోసాగాయి...ఒకటే ఉరుములు,మెరుపులు,వర్షం...తుఫాను..అప్పుడే..నేను పుట్టాను..
నేను చిన్నగా ఉన్నప్పుడే "హిమాలయాల" నుండి ఒక "బాబా" వచ్చారంట...
నన్ను చూసి....ఈ అమ్మాయి "మామూలు అమ్మాయి" కాదు...
"బ్రహ్మకి ఇష్టపుత్రిక"...."కారణజన్మురాలు"....ఈ పాప ఏ పని చేసినా అందులో ఒక "ప్రత్యేకత" ఉంటుంది.
ఈ సొట్టబుగ్గల.. అమ్మాయిని చేసుకోబోయే వాడు....చాలా "పూజలు చేసిన వాడై" ఉంటాడు.
పూర్వ జన్మలో ఎన్నో "నోములు నోచిన వాడై" ఉంటాడు.....ఈ అమ్మాయి...
ఎక్కడ అడుగు పెడితే అక్కడ "లంకెబిందలే"....దొరుకుతాయి....ఎడారిలో అడుగు పెడితే
అక్కడ కూడా "వరదలొస్తాయి"...అని చెప్పారంట...మరేమనుకున్నారు.."మీనాక్షా..మజాకా"..!
అందుకే కాబోలు...మా నాన్న గారికి...ఒకసారి...పెరట్లో తవ్వుతుంటే..."బంగారం" దొరికింది....
అన్నట్టు ఈ మాట మీరు మళ్ళీ ఎవరితో అనకండి......మీతోనే అంటున్నా...!
ఇది మీకు ,నాకు మద్య్హలో ఉండాలి సుమండీ....అసలు నేనేమి అనలేదు,మీరేమి వినలేదు సరేనా..
***************************************************
నా కోసం పూజలు చేసేవాడు ఆ బుచ్చిబావే అయ్యింటాడేమోనని మా నాన్న గారి..అనుమానం..
అన్నట్టు మా బబ్బీ గాడి గురించి మీకు చెప్పలేదు కదూ...వాడు మా పిన్ని కొడుకు.
ముద్దుగా,బొద్దుగా ఉంటాడు.
చుట్టాలు వస్తున్నారు అని నాన్న గారు చెప్పగానే,మా బబ్బీ గాడికి ఒకటే సంతోషం .
పెద్దనాన్న,మనం షాప్ కి వెళ్ళి స్వీట్స్ తీసుకొద్దామా...అని అనేసాడు....
వాడికి నచ్చినవన్నీ కొనిపించుకున్నాడు...ఇంటికివచ్చాక మళ్ళీ వాడి ప్రసంగం మొదలైంది.
మీనక్క.. ఆ బుచ్చిబావ చాలా మంచివాడటే..
అల్లం బెల్లం అంటూ ఏదేదో చెప్పాడు....అన్నీ తెలిసిన ఆరిందలా...
**********************************************
చక్కగా నా మానాన నేను... "రామా రామా రామా నీలీ మేఘశ్యామ ..
రామా రఘుకుల సోమా భద్రాచల శ్రీరామా"....అని ఊరికే అలా పాడుతుంటే బబ్బీగాడొచ్చి....
మీనక్క....వాళ్ళని impress చేయడానికా..ఈపాట...ఏడ్చినట్టుంది.
ఇలాంటి పాటలు సినిమాల్లోనే బాగుంటాయి....ఎందుకంటే హీరోయిన్
పాట పాడుతుంటే వెనకాల నుండి Background music..వస్తుంది....
మరి మనం పాడితే ఏమి రాదాయే..!.....అందుకే నువ్వు ఆ పాట పాడకు అన్నాడు....
మనం ఏం చేసినా sensational గా ఉండాలి....ఒక "ప్రత్యేకత" ఉండాలి....
మరి ఏం పాడనురా బబ్బీ అని అడిగా....
"వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా....పాలలోని తెలుపు నిర్మాతో వస్తుంది...
రంగూల బట్టలే తల తల గా మెరిసేను...అందరూ మెచ్చిన నిర్మా...
వాషింగ్ పౌడర్ నిర్మా..శంకర్ దయాల్ షర్మా"......
నువ్వు ఈ పాట పాడుతుండు.....నేను వెనకాల నుండి నిర్మా..నిర్మా...అంటు
కోరస్ ఇస్తాను....అర్దమైందా....అన్నాడు ...వెధవా..!!!
***********************************************
తెల్లవారి పదింటికల్లా..రమణ గారి అమ్మా,నాన్న వాళ్ళు వచ్చేసారు...
కానీ...ఈ "నవాబ్ ఆఫ్ పటౌడి" గారు మాత్రం రాలేదు.....అంతలో బబ్బీగాడు అన్నాడు..
మీనక్క ఎవరో "పూలరంగడు" వస్తున్నాడే...అని..తను గేట్ తీసి అడుగు పెట్టారో లేదో....
"పిట్టలన్నీ ఆయనకి...రెట్టలతో స్వాగతం పలికాయి"...పాపం సిగ్గుపడుతూ ఇంట్లో అడుగుపెట్టారు....
అసలు సిగ్గుపడడం అబ్బాయిల లక్షణమని నాకు 5th class లోనే తెలిసింది..
ఆ వివరాలన్ని తరవాత చెబుతాను.......మీకందరికి..(ఎందుకంటే మళ్ళీ అదో పెద్ద flashback.)
నాన్న గారు...నన్ను,బబ్బీని బుచ్చిబాబు గారికి పరిచయం చేసారు.....
అలా..అలా...ఆ రోజు ముగిసింది.....
*********************************************
బుచ్చిబావ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు.....
ఒక రోజు బబ్బీ ,నేను సినిమాకి వెల్తుంటే బుచ్చిబావ వచ్చాడు...
ఎక్కడికి వెల్తున్నారు..అని అడిగితే సినిమాకి అని చెప్పాం....
ఐతే నేను మీతో వస్తా...అన్నాడు.....సరే అని ముగ్గురం బయలుదేరాం...
సినిమా స్టాట్ అయింది....అందరం చూస్తున్నాం....ఆ సినిమా చాలా ట్ర్రాజెడి....
మా బుచ్చిబావ ఆ సినిమాలో లీనమై తన "భావోద్వేగాలను నియంత్రించుకోలేక".....
"భయంకరంగ ఏడవడం" మొదలెట్టాడు..ఆయన ఏడుపుకి జడుసుకుని చాలా మంది
ప్రేక్షకులు సినిమా చూడ్డం మానేసి ఈయన్ని వింతగా చూడ్డం మొదలెట్టారు....
ఇంతటితో కథ ముగిసిందా అంటే అదీ లేదు....ఆ సినిమాలో ఎక్కడైనా jokes వస్తే పెద్దగా నవ్వుతూ..
మా బబ్బీగాడి వీపు మీద చరవడం......పాపం ఆ రోజు బబ్బీ గాడు అయిపోయాడు...
***********************************************
తిరిగి ఇంటికి వస్తుండగా....బబ్బీగాడు.. మీనక్క..పుచ్చకాయ కొందామా...అన్నాడు...
అప్పుడు మొదలెట్టాడు బుచ్చిబావ "పుచ్చకాయ పచాపచా"....
"మనం ఎలాంటి కాయ కొనాలంటే.....మందపాటి తొక్కలతో..బరువుగా ఉండే కాయల్ని ఎంపిక
చేసుకోవాలి...చూపుడు వేలు లేదా..మధ్యవేలితో కాయ మీద గట్టిగా్ కొట్టి చూస్తే -
"ఎక్కడో-నూతిలో నుంచి వచ్చినట్లుగా శబ్దం వినిపిస్తే" అది తియ్యని గుజ్జున్న తాజా కాయేనని గుర్తించాలి.
నేల మీద ఆనుకునే కాయ భాగం తెల్లగానూ ఆకుపచ్చ రంగులోను కాకుండ కాస్త పసుపురంగులోకి మారి
ఉంటే అది బాగా పండినకాయే....అని గుర్తించాలి.(పైపెచ్చు మా బుచ్చిబావ ఊతపదం)
పైపెచ్చు పుచ్చకాయరసంలో తేనె కలుపుకుని తింటే గుండెజబ్బులు నయమవుతాయి..
పైపెచ్చు తాపం తగ్గాలన్న,,చెమట ద్వారా పోయే ఖనిజలవణాల లోపం తగ్గాలన్న పుచ్చకాయ తిని తీరాల్సిందే..
పైపెచ్చు ఈ పుచ్చకాయ పైతోలుకు ఎర్రని గుజ్జుకు మధ్య తెల్లని భాగాన్ని "కూర" చేసుకుని తినచ్చు.
పైపెచ్చు లోపలి గింజలను తీసి వేయించి వాటిపై "పొట్టుతీసి" తినచ్చు....
ఇలా పుచ్చకాయ గురించి చెప్పుకుంటు..పోతూనే ఉన్నాడు...
మీనక్క పుచ్చకాయ వద్దు గిచ్చకాయ వద్దు.....త్వరగా ఇంటికి వెల్దామే.. అన్నాడు...బబ్బీగాడు..
ఇంటికి వెళ్ళాక అమ్మ ...సినిమా ఎలా ఉందిరా బబ్బీ....
అని అడిగితే "పుచ్చకాయ" లా ఉంది అని చెప్పాడు బబ్బీగాడు...ఆ రోజు ఏలాగోలా ముగిసింది..
*****************************************
అలా అలా రోజులు గడిచిపోతున్నాయి....అంతలో నా results వచ్చాయి...
నా Results రోజు అందరు "ఉత్కంఠంగా" ఎదురు చూస్తున్నారు....ఫలితాలు ఎలా ఉంటాయో అని...
నేను మా college first వచ్చాను...(ఇది నిజమేనండోయ్)
దేవతలార ఈ సారి పాస్ చేయండి చాలు..మీ చుట్టు..
108.. చుట్లు తిరుగుతాను అని ఎన్నో మొక్కులు మొక్కాను....
కాని ఏకంగా college first తెప్పించేసారు...ఇక మొక్కులు తీర్చాలి కదా..అనుకుని..
తెల్లవారగానే "భద్రకాళిగుడి" కి బయలుదేరాం...నేను,బబ్బీ....
అంతలో మా బుచ్చిబావ వచ్చాడు...వామ్మో ..బుచ్చిబావ వచ్చాడే మీనక్క...అన్నాడు బబ్బీ..
ఇప్పుడెలాగే...అన్నాడు...అయ్యో గుడికి వెళ్తున్నాము అని చెబుదాము లేరా..!అన్నాను...
బావ రాగానే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు...
ఉన్న కథా కమామిషు అంతా చెప్పాం ...(రాడేమో అనుకుని...)
నేను వస్తాను మీతో అన్నాడు...ఇంకేం చేస్తాం సరే అని వెళ్ళాం....
నేను చుట్లు తిరగడం స్టాట్ చేసాను....మా బబ్బీ గాడు కూడా నాతో పాటు తిరగడం మొదలెట్టాడు..
ఒరేయ్ నిన్ను చుట్లు లెక్కపెట్టమని చెప్పాను కదరా..వెధవ..నువ్వు ఎందుకు తిరుగుతున్నావ్ అంటే...
మీనక్క..బుచ్చిబావ..."పుచ్చకాయ పచాపచా"..మళ్ళీ ఎక్కడ మొదలెడతాడో..అని భయంగా ఉందే...
అందుకే ఇలా నీతో చుట్లు తిరుగుతానే..కనీసం పణ్యమైనా వస్తుంది కదే...!
ఇప్పుడా "పుచ్చకాయసుత్తి" నేను భరించలేనే..మీనక్కా..అన్నాడు..
మరి బుచ్చిబావ...ఎలా రా..?అంటే...మనం చుట్లు తిరిగుతుంటే లెక్కపెట్టమని చెప్పానక్క..అన్నాడు..
********************************************************
మొక్కు తీరింది...ఇక ఇంటికి బయలుదేరాం.....
నేను,బబ్బీ చాలా అలసిపోయాం.....అంతలో అమ్మ ఇక భోజనాలకి లెగండి..అని కేక...
అన్నం తిని కూర్చున్నాము...అంతలో బుచ్చిబావ "పొడుపుకథలు పొడుద్దామా" అన్నాడు..
సరే అన్నాం.....ఇద్దరం బుద్ధిలేకుండా..!!..బుచ్చిబావ పొడిచాడు ఒక పొడుపు...
దానికి మేమిద్దరం ఢమాల్....."లక్కబుడ్డి నిండా లక్షవరహాలు"..చెప్పుకోండి చూద్దాం....
అన్నాడు...మాకు తెలీదు బావ అన్నాం ఇద్దరం.....ఓస్ ఆ మాత్రం తెలీదా.."పుచ్చకాయ"...అన్నాడు..
మళ్ళీ మొదలైంది "పుచ్చకాయ పచాపచా"..!!!
నీకు తెలుసా మీను పుచ్చకాయతో "పచ్చడి" కూడా చేయోచ్చు...
ఓరి దేవుడా..!..ఈ సారి పుచ్చకాయ పచ్చడా.....?
****************************************************
మీను అసలు పుచ్చకాయ పచ్చడి ఎలా చేస్తారంటే....పుచ్చకాయ లోపలి ఎర్రని పదార్థం తినేయగా
మిగిలిన చెక్కు, పావుకిలో,నువ్వులు,ధనియాలు,జీలకర్ర,మెంతులు.వెల్లుల్లి,అల్లం,చింతపండు....
మొదలైనవి సిద్ధం చేసుకోవాలి...అన్నీ కలిపి మిక్సీలో వెయ్యాలి...
తరవాత అని....అంటుండగానే....బబ్బీగాడు..మీనక్క నాకు పొట్టలో నొప్పిగా ఉంది అంటు వెళ్ళిపోయాడు...
తరవాత బుచ్చిబావ పుచ్చకాయ పచ్చడి,పుచ్చకాయ తొక్కల ఫ్రై,పుచ్చకాయ చట్ని.పుచ్చకాయ హల్వా,
ఇలా రకరకాల వంటలు...ఇంకా పుచ్చకాయ పుట్టుపుర్వోత్తరాలు..అన్ని చెప్పాడు..
ఇదంతా, విన్న నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు...బావ తలనొప్పిగా ఉంది నేను పడుకుంటా అన్నాను..
***************************************************
బబ్బీగాడు రాత్రి పడుకునేముందు నా దగ్గరికి వచ్చి మీనక్క....ఈ బుచ్చిబావతో నువ్వు వేగలేవే అన్నాడు..
ఒక వే్ళ నీ పెళ్ళి బావతో గనక ఐతే..నేను మాత్రం మీ ఇంటికి రానే...అన్నాడు..
ఎందుకురా..అంటే వామ్మో....బుచ్చిబావ చెప్పే" పుచ్చకాయ పచాపచా"..వినాలి...
ఇంకా ఆ దిక్కుమాలిన..."పుచ్చకాయ కూర","పుచ్చకాయ పచ్చడి","పుచ్చకాయ చట్ని,
"పుచ్చకాయ హల్వా","పుచ్చకాయ బిర్యాని" తినలేక చావాలి.....తలుచుకుంటేనే భయంగా ఉందే..
నేను రానే మీ ఇంటికి అన్నాడు...ఓరేయ్ బబ్బీ .,,బుచ్చిబావతో నా పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది అని అమ్మ
నాన్న అనుకున్నారు అంతే...గాని.. బుచ్చిబావకి నా పై అలాంటి అభిప్రాయం లేదురా
సో నో ప్రాబ్స్.....అన్నాను....ధీమాగా..
*********************************************************
తరవాత ఒక రోజు బుచ్చిబావ వచ్చి మీను..నేను..US వెల్తున్నాను...అని చెప్పాడు..(MS చేయడానికి)
మీను నేను ఇంకో..10 days తరవాత వెళ్ళిపోతా అన్నాడు...బుచ్చిబావ దిగాలుగా.
10 days తరవాత వచ్చి,బబ్బీ,మీను నే వెల్తున్నాను...
అప్పుడప్పుడు కాల్ చేస్తాను...సరేనా..అని చెప్పి వెళ్ళిపోయాడు...
*************************************************************
మళ్ళీ మొన్నే వచ్చాడు సరిగ్గా సంవత్సరం తరవాత.....US నుండి.......వాళ్ళ చెల్లి పెళ్ళికని...
వస్తుంటే..చిన్నaccident అయింది...
కొంచెం నడుము విరిగింది..అంతే..!..మిగతా అంతా ఓకె..నేను,బబ్బీ చూసి రావడానికి వెళ్ళాం...
వెళ్ళేప్పుడు పుచ్చకాయ తీసుకెడదామా..మీనక్క..అన్నాడు బబ్బీ వెధవ...
నువ్వు ముందు నోర్మూసుకుని పద అన్నాను...
******************************************
బుచ్చిబావ ఎలా ఉన్నావ్ అన్నాను...ఆ ఇప్పుడు పర్లేదు అన్నాడు....
అయ్యో పెళ్ళికి అని వస్తే ఇలా జరిగిందేంటి బావ ..అన్నాను...మేము బాగానే వస్తున్నాం మీను ..
వాడే గుద్దేసాడు......వెధవ..అన్నాడు....పోనీలే... మీను నువ్వు,బబ్బీ ఎలా ఉన్నారు..?
"నేను మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను తెలుసా"...అన్నాడు....
"మేము కూడా నిన్ను చాలా మిస్ అయ్యాం బుచ్చిబావ అన్నాడు బబ్బీగాడు"....
అంతలో బుచ్చిబావ అన్నాడు..మీను..నేను...ఈసారి అమ్మ,నాన్నతో మన పెళ్ళి
గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను......అని.
ఈ వార్త విని...నాకు,బబ్బీకి నెత్తిపైన "పుచ్చకాయ" పడ్డట్టైంది....
అంతలో నేనే అన్నాను.. జోకులు వేయకు బావ..అని..జోకులు కాదు మీను..ఇది నిజం ...
ఓరుగల్లుకే.. పిల్లా పిల్లా..ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే..
ఓరచూపులే రువ్వే పిల్లా..ఏకవీర నువ్విలా ఉన్నావే..అంటూ ..పాటలు పాడ్డం మొదలెట్టాడు..
బుచ్చిబావ పాట బాగానే ఉంది కానీ... నేనెందుకు బావ నీకు...
నా కన్నా మంచి పిల్ల దొరుకుతుంది నీకు అన్నాను నవ్వుతూ..(ఏడవలేక)
నేను జోకులు వేయడం లేదు మీను..ఇది నిజం....కట్టుకుంటె నిన్ను తప్పా..
కట్టుకోనే కట్టుకోను...ఒట్టు పెట్టుకుంటినమ్మో బెట్టు చేయకే....అన్నాడు..బుచ్చిబావ...!!!
***********************************************
తరవాత అసలు ఏం జరుగుతుంది...ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది..
ఇంతకీ బుచ్చిబావకి,మీనుకి...సయోధ్య కుదిరిందా....?
సయోధ్య కుదరక..అయోధ్యలో అగ్నిగుండం బద్ధలైందా..? అసలేం జరిగింది...
తెలుసుకోవాలని మీకందరికి ఆత్రుతగా ఉంది కదూ....
తరవాతి కథ మీరు తెలుసుకోవాలంటే నేను త్వరలో .....తీయబోతున్న సినిమా చూడాల్సిందే....
బడ్జెట్ ఎంతో తెలియదు కాని సినిమా పేరు మాత్రం "పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా"..!!!

20, ఫిబ్రవరి 2010, శనివారం

అమెరికాలో..'కడుపు మంట '

http://chegodeelu.blogspot.com/2008/09/blog-post_23.html(రిషి గారు- చేగోడీలు.కాం )



"హేయ్ రిషీ...ఈరోజు రాత్రి నువ్వూ రమేష్ మా ఇంటికి రావాలి..సరదాగా అందరం కల్సి డిన్నర్ చేద్దాం...
మా వైఫ్ కి అల్ల్రెడీ చెప్పేసా..సొ బి రెడీ బై సిక్స్, ఐ విల్ కం న్ పిక్ యు గైస్ "

సముద్రంలో అలలు వువ్వెత్తున ఎగసి పడ్డాయ్..అగ్నిపర్వతాలు బద్దలయ్యాయ్...చరిత్రలో ఒక మహాఘట్టం ఆవిష్కరించబడింది..

మా బాసు.. నన్నూ మా తింగరోడిని ఇంటికి బోజనానికి పిల్చాడు...అహ నా పెళ్ళంట సినిమాలో కోటా కి ప్రతిరూపం లాంటి మా బాసు ...మా ఇద్దర్నీ ఇంటికి బొజనానికి పిలవటమే కాకుండా..వచ్చి పికప్ చేసుకుంటానన్నాడు..కలా నిజమా.!!!

డిన్నర్ పార్టీ కి కారణం తెలీదు ...తెలుసుకోవాలని కూడా అనిపించలేదు..రోజూ కిచెన్లో నేను చేసే ప్రయోగం మా రమేష్గాడి మీదా...ఆ తింగరోడు చేసే ప్రయోగం నా మీదా పరీక్షించుకుని చివరగా బ్రెడ్డో బన్నో తినడం అలవాటైపోయింది.

మా బాస్ నొట్లోంచి వచ్చిన ఆ అమృతం లాంటి మాట విన్నప్పటినుంచి...కిచెన్ లో కుళ్ళాయి లీక్ అయినట్టు..ఆనందంతో పది నిమిషాలకొకసారి నా కళ్ళల్లో నీళ్ళు కారుతూనే ఉన్నాయి.

అమెరికా వచ్చి నాలుగు నెలలయ్యింది... ఒక్కసారైనా ఇంటికి పిలిచి కనీసం ఓ అరకప్పు టీ కూడా ఇవ్వలేదు వెదవ అని నిద్రలో కూడా తిట్టుకునేది..ఇలాంటి మంచి మనిషినా ? నా మీద నాకే చాలా కోపం వచ్చింది.
అవున్లే ఇంటికిపిలిచి టీ కాఫీలు ఇవ్వటానికి మనం ఏమైనా..మేనేజర్లా ? ఆఫ్టరాల్ తొక్కలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లం...నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.

ఏ పనీ చెయ్యబుద్దికావడం లేదు....కీ బోర్డూ మవుసూ వంక చూస్తే... చికెనూ మటనూ..రొయ్యలూ చేపలూ అందంగా పింగాణీ ప్లేటుల్లో సర్దిపెట్టినట్టుగా కనిపిస్తున్నాయ్...

కొద్దిగా తేరుకుని ...రమేష్ గాడి క్యూబికల్ కి వెళ్ళి చూసా..సీట్లో లేడు...డౌటొచ్చి బెంచీ కింద చూసా..కింద కూర్చొని పిచ్చి పిచ్చి గా వాడిలో వాడే నవ్వుకుంటున్నాడు...మనిషి కొద్దిగా సున్నితం ఇలాంటి షాకులు తట్టుకోలేడు.

మొహం మీద నీళ్ళు చల్లి ....లేపి కూర్చీలో కూర్చోబెట్టాను...

'ఓరెయ్ రిషిగా..బాసూ..భొజనం..అంటూ ఏడుస్తూ కౌగిలించుకున్నాడు...'

............................

లంచ్ చేస్తున్నప్పుడూ అదే ద్యాస ...లంచ్ బాక్సులో ఉన్న రెండు బ్రెడ్డు ముక్కల్ని కసితీరా కొరికి..ఈ రోజు రాత్రికి నిన్ను ముట్టుకోను..బతికిపోయావ్ పో..అనుకున్నా.
'ఓరెయ్ రిషిగా..రోజూ ఈ కోడిగుడ్లు తినీ తినీ ..ఏదో ఓ రోజు నువ్వూ నేనూ తలా ఓ గుడ్డూ పెట్టేలా ఉన్నాం రా...రాక రాక చాన్సొచ్చింది.. ఈరోజు బాసుగాడింట్లో మన బాటింగ్ అదిరిపోవాలి...నేను మాత్రం మొత్తం ఓవర్లు ఆడితే గానీ బాటింగ్ ఆపను.. ' అన్నాడు బాయిల్డ్ గుడ్డొకటి బుగ్గనేసుకుని మా రమేష్ గాడు.

ఈరోజు ఫ్రైడే అన్న ఆనందం ఒక వైపు ...రాత్రి బాసు ఇంట్లో జరగబోయె డిన్నర్ ద్రుశ్యాలు మరో వైపు మనసుని కితకితలు పెడుతుంటే....సాయంత్రం 4 కల్లా ఆఫీస్లోంచి చెక్కేసి...రూం లో

'గాల్లో తేలినట్టుందే....
గుండె జారినట్టుందె...
ఫుల్లూ బాటిలెత్తి...దించకుండా తాగినట్టుందె '

అని ఓ పావుగంట..నేను రమెష్ గాడూ స్టెప్పులేసుకున్నాం.

గంటలో రెడీ అయిపోయి...పాడ్లు కట్టుకుని ఫీల్డులోకి ఎంటర్ అవడానికి సిద్దంగా ఉన్న గౌతం గంభీరూ సెహ్వాగ్ జంటలా..నేనూ రమెష్ గాడూ బాల్కనీ లో కూర్చుని..వచ్చీ పోయె కారుల్లో మా బాసు గాడి కారు ఉందేమో అని చూస్తూ ఉన్నాం.

వచ్చేసాడు..మా బాసు. కంగారులో బాల్కనీ లోంచి దూకడానికి రెడీ గా ఉన్న రమేష్ గాడిని వారించి కిందకి నడిచి వెళ్ళి కార్లో ఫ్రంట్ సీట్లోకి మా తింగరోడిని తోసి నేను బ్యాక్ సీట్లో కూర్చున్నా..

'రై ..రై...' అరిచాడు మా రమేష్ గాడు.

కారు బాగానే నడుపుతున్నాడు మా గురువు...

'వాట్స్ అప్ గైస్ ...అవునూ మీరు రూం లో వంట చేస్కుంటారా ?' అడిగాడు మా బాస్.
'కటింగ్ సెక్షన్ నాది...' గొప్పగా చెప్పాడు మా తింగరోడు.
'ఓహ్..గుడ్...సొ వుల్లిపాయలు నువ్వు కట్ చేస్తే..రిషి వంట చేస్తాడన్నమాట ' అన్నాడు బాసు.
'కరెక్టు గా అన్నీ కట్ చేసి ఇస్తే..వంట చాలా ఈజీ సార్ ...మనం కటింగ్ సెక్షన్ లో కింగు ఏదైనా చిటికెలో తరిగి ఇచ్చెస్తా ' స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్ లా చెప్పాడు మా వోడు.

'ఓహ్..గుడ్ గుడ్...' రమేష్ గాడి వంక చూసి ఓ నవ్వు నవ్వాడు మా బాసు.

అప్రైసల్ లో 5 కి 5 రేటింగ్ వచ్చిన వాడిలా..వెనక్కి తిరిగి చూసావా మన గొప్పతనం అన్నట్టు కళ్ళెగరేసాడు..మా తింగరోడు.


కార్ పార్క్ చేసి...ఇంట్లోకి తీసుకెళ్ళాడు మా బాస్.

'ఉమా ..హీ ఈస్ రిషి న్ హీ ఈస్ రమేష్....' వాళ్ళావిడకి పరిచయం చెసాడు.

'హలో బావున్నారా..ఈయన ఎప్పుడూ మీగురించే చెబుతూ ఉంటారు...అలా సోఫాలో కూర్చోండి..'

' ఏవండీ డిన్నర్ చేసేస్తారా ...ఇంకా వద్దు అంటే ఈలోపులో టీ ఇస్తాను ...రిషీ టీ తాగుతావా...లేక కాఫీనా ?'

రమేష్ గాడు ఇవేవీ పట్టిచ్చుకోకుండా..కిచెన్ వైపు చూస్తూ...కుక్క టైపులో ముక్కుతో వాసన చూస్తూ ఏం కూరలు వండారో అని గెస్ చేస్తున్నాడు '

'ఏనీ తింగ్ వోకే అండీ..' అన్నా...

ఎంత ఆప్యాయత..ఎంతా కలుపుగోలుతనం..నాకు 'సంక్రాంతి ' సినిమా చూస్తునట్టుగా ఉంది...మా బాసూ వాళ్ళావిడా సంక్రాంతి సినిమాలో వెంకటేషూ స్నేహా లాగా కనిపిస్తున్నారు...నా కళ్ళకి.

'ఓరెయ్ రిషీ..నాన్ వెజ్ లేదేమోరా...' స్మెల్ ఏం రావడం లేదు..చెవిలో గొణిగాడు రమేష్ గాడు.

చస్..నోర్మూసుకుని కూర్చో... నా అన్నా వదినలని ఒక్కమాటన్నా నేను ఊరుకోను.

'అన్నా వదినలేంట్రా ' కన్ఫ్యూస్ గా అడిగాడు రమేష్గాడు.

'ఇప్పుడే డిసైడయ్యా...మన బాసూ ఉమా గారూ..ఈరోజు నుంచీ మనకి పెద్దన్నయ్య వదిన టైపు...'

అర్దమయ్యీ అర్దంకానట్టు చూసాడు రమేష్ గాడు.

టీలు తాగి...టీవీలో కార్టూన్ షో చూసాకా...
ఇంక డిన్నర్ స్టార్ట్ చేద్దం అన్నారు మా వదిన. :)

మూతలు పెట్టిన గిన్నెలు టేబుల్ మీద పెడుతుంటే....వాటివంక కళ్ళర్పకుండా చూస్తున్నాడు మా రమేష్ గాడు.

'కమాన్ రమేష్....ఫీల్ ఫ్రీ' అని మా రమేష్ గాడిని ముందుకు తోసాడు మా బాసు.

అంతే వుసేన్ బోల్టు కి తాతలా పరిగెట్టి ప్లేటు తీస్కొని కున్ను మూసి తెరిచేలోపు టేబుల్ ముందున్నాడు రమేష్ గాడు.

"అన్నం, పప్పూ, సాంబారూ, ప్రియా పచ్చాడి... పెరుగూ"

ఫ్యూజు పోయిన బల్బులా ఉంది రమేష్ గాడి మొహం....నాన్వెజ్ లేదు అనే నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాదు...

చికెనూ మటనూ మాట దేవుడెరుగు...కనీసం మన టైపులో ఒక కోడిగుడ్డు కూడా లేదు ...ఇదేం దిక్కుమాలిన డిన్నర్ రా..అన్నట్టు చూసాడు నావైపు .

నాది కూడా ఇంచిమించు వాడి పరిస్తితి లాగానే ఉంది. అయినా ఉమా గారి ఆప్యాయత ముందు చికెనూ మటనూ ఒక లెక్కా అనుకుని...

'అన్నా.. వదినా...' అని రమెష్ గాడి చెవిలో గొణిగా...

'నీ బొంద '..గట్టిగా పైకే అన్నాడు మా తింగరోడు.

'కంద కాదు బాబూ ..ఇది పప్పే ' అంది మా బాసు వాళ్ళావిడ రమేష్ గాడి వంక చూసి.

మారు మాట్లాడకుండా...నా వైపు తిరిగి..ఏ పిచ్ అయితే ఏంటి...వెజ్ అయినా నాన్ వెజ్ అయినా...నా బాటింగ్ స్టైల్ మారదు..అని..బాటింగ్ మొదలెట్టాడు మా రమేష్ గాడు.

'ఈ సండే మా పాప బర్త్ డే ...' అన్నాడు మా బాసు.

'హెయ్ ...గుడ్ సార్...' అరిచాడు మా రమేషుగాడు ..ఎక్కడొ మళ్ళీ నాన్ వెజ్ ఆశ చిగురించింది వాడికి.

'ఏంటో మొన్నటి నుంచీ చూస్తున్నా...ఓ టెన్షన్ పడిపోతున్నారు..రిషీ రమేషూ ఉన్నారు కదా హెల్ప్ చేయటానికి..ఎల్లుండి పార్టీ అయ్యేదాకా ఇక్కడే ఉంటారు..ఏం రమేషూ.. ' అంటూ నా వైపు చూసింది బాసు వాళ్ళావిడ.

నాకేమూలో చిన్న అనుమానం మొదలయ్యింది....చూస్తుంటే అంతా ముందే రాసేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నట్టనిపించింది. బాసు వెదవ ఇంత సడన్ గా ఇంటికిపిలిచింది పని చేయించుకోడానికా!!!

'ఆ లేదండీ..రేపు మా కజిన్ వస్తాడు..నైట్ కి ఇంటికెళ్ళిపోవాలి ' అని చెపుదామనుకొనే లోపే...మా తింగరోడు కొంపముంచేసాడు.

'ష్యూర్ ..విత్ ప్లెసర్ ...అయినా మాకు వీకెండ్ లో ఏం పన్లుంటాయండీ..కాలేజ్ డేస్ లో రోజుకో బర్త్ డే పార్టీ చేసే వాళ్ళం..' నాన్ వెజ్ ఆశతో నోటికొచ్చినట్టల్లా వాగేసాడు రమేషు గాడు.

'ఒరేయ్ రమేషూ అదికాదురా...రేపు మా కజిన్ వస్తాడు కదరా' అన్నా...ఈ డైలాగ్ కి రమేష్ గాడు నావైపు తిరిగితే కన్ను కొట్టి విషయం అర్దం చేసుకోరా బాబూ అందామని నా అయిడియా..

'మీ కజినా ...అమెరికాలో ఎవరున్నార్రా ' నా వంక చూడకుండా సాంబార్ కలుపుతూ అన్నాడు రమేష్..

ఓరి తింగరముండాకొడకా...కొంపముంచేవ్ కదరా అనుకుని...ఇంక చేసేదేమీలేక..
'మార్నింగ్ వస్తామండీ ' అన్నా...మా బాసుతో.

'వోకె ..నో ప్రాబ్లం మార్నింగ్ 9 కి నేనొచ్చి పికప్ చేసుకుంటా' తప్పించుకునే చాన్సే లేదన్నట్టు చెప్పాడు మా బాసు.

డిన్నర్ కార్యక్రమం పూర్తయ్యింది....మా తింగర వెదవ నాట్ అవుట్ బాట్స్ మన్ గా చివరగా..వెళ్ళి చెయ్యికడుకున్నాడు.

మా బాసు గాడు మమ్మల్ని మా రూం దగ్గర డ్రాప్ చేసి..'మార్నింగ్ 9...బీ రెడీ' అనేసి..వెళ్ళిపొయాడు.

బాసు గాడు అటు వెళ్ళగానే...రమేష్ గాడిని వంగో బెట్టి నడ్డి మీద మోచేతితో 10 సార్లు గట్టి గా గుద్ది ...మదుబాబు నవల్స్ లో షాడో విలన్ని తన్నినట్టు డొక్కలో తన్నా '

తప్పించుకుని దూరంగా పరిగెట్టి...'ఏవయ్యింది రా ?' అన్నాడు.

'ఓరెయ్ తింగరి వెదవా...భోజనం ఆశ పెట్టి మనతో బర్త్ డె పార్టీ పన్లన్నీ చేయించ్కుందామని బాసుగాడి
ప్లాను రా..నువ్వేమో తిండి చూడగానే చంద్రముఖిలాగా మారిపోయి నావంక కనీసం చూడనయినా చూడకుండా సాంబార్ తాగుతావ్ రా ...?' కోపంగా అరిచా...

'అదేంట్రా...నువ్వే కదా మా పెద్దన్నయ్యా పెద్దొదినా అన్నావ్' అందుకనే నేనూ..నసిగాడు.

'నోర్ముయ్ రా పిడత మొహం వెదవా...బర్త్ డె పార్టీ అనగానే నాన్ వెజ్ ఉంటాది...కుమ్మెద్దాం అని నీ ప్లాను..' కోపంగా అన్నా..

'ఒరేయ్ రిషిగా...ప్రతీదాన్నీ అనుమానించడం కరెక్ట్ కాదురా...బర్త్ డె పార్టీ కి పన్లంటే ...బట్టలుతకడం, గోడలకి సున్నాలు వెయడం..వాళ్ళ పాపకి స్నానం చేయించటం కాదురా...ఎదో కుర్చీలు సర్దడం, షాపింగూ...రూం కి చిన్న డెకరేషనూ అంతే..ప్రపంచంలో ఏ బర్త్ డె పార్టీకీ అంతకుమించి పని ఉండదు...' వీపు రుద్దుకుంటూ అన్నాడు రమేష్ గాడు.

నేనేమీ మాట్లాడలేదు.....

'అయినా జస్ట్ ఈ మాత్రం హెల్ప్ చేయించుకోడానికి మనల్ని ఒక రోజు ముందుగా ఇంటికి భోజనానికి బుద్దున్న ఏ వెదవా పిలవడు రా...కళ్ళుమూసుకుని రేపు బాసు గాడికి ఆ చిన్న చిన్న పనులు చేసి పెడితే ఇంచక్కా పార్టీలో చికెనూ మటనూ కుమ్మేయచ్చు ' మళ్ళీ వాడే అన్నాడు.

ఈసారి నాకూ ఎందుకో మా తింగరోడు చెప్పింది నిజమనిపించింది.

'మ్మ్మ్హ్....మే బీ యు ఆర్ రైట్ ' అన్నా...వెంటనే మా రమేష్ గాడు నన్ను వంగోబెట్టి నడ్డి మీద 15 సార్లు గుద్ది రూంలోకి పరిగెట్టాడు.

రూం లో రాత్రి జల్సా పాటలు పెట్టుకుని...రమేష్ గాడు ఒక్కడే ఓ నాలుగు స్టెప్పులేసుకుని పడుకున్నాడు...

........................................

9 కల్లా మా బాసు రావడం ...వాళ్ళ ఇంటికెళ్ళి 10 కల్లా టిఫెనూ టీ పూర్తి చేయడం జరిగిపోయాయ్...
'చూసావా..నామాట విన్నందుకు పొద్దున్నే టిఫెనూ టీ ఫ్రీ గా కొట్టేసాం' అన్నట్టు చూసాడు రమేష్ గాడు నా వంక.

'ఏవండీ కొద్దిగా వుల్లిపాయలు కోసి పెట్టరూ ...' అడిగింది మా బాసుని వాళ్ళవిడ.

'నేను ఇంకా షాపింగ్ కి వెళ్ళి అవీ ఇవీ కొనాలి...మన రమేష్ కటింగ్లో కింగు..రమేషూ కొద్దిగా హెల్ప్ చెయ్యవా' మొహమాటం లేకుండా అడిగాడు మా బాసు.

నాకు ఎగిరి గంతెయ్యాలనిపించింది....తింగరి వెదవా..నేను చెబితే విన్నావా అని మనసులో అనుకుంటూ జాలిగా చూసా మా రమేష్ గాడి వైపు.

అప్పటికే కింద నాలుగు న్యూస్ పేపర్లు పరిచి ..2 కిలోల వుల్లిపాయలు 1/2 కేజీ పచ్చిమిర్చీ ...పెద్ద అల్లం ముక్కా పడేసింది మా బాసిణి ( బాసు పెళ్ళాం)

రమేష్ గాడి మొహం లో నెత్తురు చుక్క లేదు...పిచ్చిగా గాల్లోకి చూస్తున్నాడు.

ఎందుకైనా మంచిదని...నేనూ మీతో షాపింగ్ కి వస్తా అని మా బాస్ తో అన్నా...

వోకే ...నేనూ రిషీ వన్ హవర్లో వస్తాం.....ఈలోపు ఏమైనా హెల్ప్ కావాలంటే రమేష్ ని అడుగు అని రమేష్గాడికి వినపడేలా వాళ్ళావిడతో చెప్పి కారు తీసాడు బాసు.

.............................

అర డజను షాపులు తిరిగి...అడ్డమయినవీ కొని ఇంటికి చేరేసరికి మద్యాహ్నం రెండు అయ్యింది. గుమ్మంలో అడుగుపెట్టగానే...పరిగెట్టుకొచ్చింది మా బాసు వాళ్ళావిడ.

'ఏవండీ రమేషు కళ్ళు తిరిగి పడిపోయాడు ' కంగారుగా చెప్పింది.

'ఏం ఏమయ్యింది....' అంతే కంగారుగా అడిగాం నేనూ మా బాసూ..

'ఇప్పటి దాకా బాగానే ఉన్నాడండీ ....ఇందాక మన పాపని ఎత్తుకుని తిప్పాడు కూడా...నేను సోఫా కవర్లు మార్చాలి కొద్దిగా హెల్ప్ చేయవా రమేషూ అని అడిగా ఇంతలోనే....' జరిగిన విషయం ఇదీ అన్నట్టు చెప్పింది.

సోఫాలో కళ్ళు మూసుకుని పడుకున్న రమేష్ గాడిని చూసి జాలేసింది నాకు.

'ఏరా ఎలా వుంది ఇప్పుడు ?' అడిగాను..

సమాదానం గా .....మూడోకంటికి తెలీకుండా ఒక కాగితం నా చేతిలో పెట్టాడు రమేష్ గాడు.

విప్పి చూసాను...'నన్ను ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోరా' అని ఉంది :)

మా తింగరోడి ప్లాన్ అర్దమయ్యింది...వెంటనే మా బాసు తో రమేష్ కి 'లో బీపీ' ఉంది అని చెప్పి...అర్జెంటుగా రూం కి వెళ్ళి మందులేసుకుని రెస్టు తీసుకుంటేగానీ మనిషి బతకడు అన్న టైపులో హడావిడి చేసేసరికి...మమ్మల్నిద్దరినీ మా రూం కి తీసుకెళ్ళి పడేసాడు మా బాసు.

.....................................

'ఇంక చాలు లెగరా......' అనేసరికి 'ఒరేయ్ రిషీ నీ రుణం జన్మ జన్మలకీ తీర్చుకోలేనురా.......' అని బావురుమన్నాడు రమెష్ గాడు.

వెక్కి వెక్కి ఏడుస్తూ...ఒరేయ్ నువ్వు నిన్న చెప్పిన మాట నిజమేరా...బాసు గాడి కూతురు బర్త్ డె పార్టీకి మనల్ని బాగా వాడుకున్నాడ్రా... అన్నాడు.

'ఏవయ్యిందిరా...జస్ట్ వుల్లిపాయలే కదా కోయమన్నారు....'

'దాని శార్దం దాని బొంద..బాసు గాడి పెళ్ళం కన్నా ..మన బాసు గాడే బెటర్ రా.....
నా జీవితం లో రోజుకి రెండు కన్నా ఎక్కువ వుల్లిపాయలు ఎప్పుడూ కొయ్యలేదురా..అలాంటిది..నాతో ఎన్ని కిలోల వుల్లిపాయలు కోయించింది రా...మీరు వెళ్ళిన తర్వాత ఇంకో కేజీ వంకాయలు కేజీ బంగాళదుంపలూ కోసిపెట్టాను.. ఒక పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి నాకు రాదని చెప్పినా వినకుండా నాతో గ్రైండర్లో ఇడ్లీ పిండి రుబ్బించింది రా...తర్వాత నువ్వు అచ్చు మా తమ్ముడిలా ఉంటావ్ అని ...ఇల్లంతా వాక్యూం క్లీనర్తో ...........' వెక్కి వెక్కి మాటలు రావడం కష్టం గా ఉంది...రమేష్ గాడికి

'ఇన్ని పన్లూ చేసి...ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందామంటే...కొద్దిగా పాపని చూస్కోవా..అని పిల్ల ముండని నాకు బవలంతం గా అంటగట్టి వెళ్ళిపోయిందిరా....అది పాప కాదురా పీపా ...ఎత్తుకునితిప్పితే గానీ అది ఏడుపాపదని అర్దమయ్యి అరంగంట ఎత్తుకుతిప్పారా...ఇంక నా వల్ల కాక కింద కూర్చోబెడితే కండ వూడిపోయేలా జబ్బ పట్టుకుని కొరికేసిందిరా........మీరొచ్చేసరికి ప్రాణాల్తో ఉంటానో ఉండనో అని ఈ డ్రామా అంతా ...' ఏడుస్తూ చెప్పాడు ...

మా తింగరోడి కష్టాలకి ....మా బాసు దంపతుల పార్టీ మేనేజ్మెంట్ అండ్ రిసోర్సు యుటిలైజేషను తెలివికి నవ్వుకుంటూ ...వాడిని వూరుకోబెట్టి...పడుకోమని చెప్పి ...నేనుకూడా మంచం మీద వాలిపోయా..

............................

ఎవరివో మాటలు గట్టిగా వినపడేసరికి....మాంచి నిద్రలో ఉన్న నేను వులిక్కిపడి లేచాను. పక్క రూంలో రమేష్ గాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు....

'ఏంటీ పార్టీ నా ?'
'వెజ్జా నాన్ వెజ్జా '...........