20, ఫిబ్రవరి 2010, శనివారం

అపార్ధం చేసుకోరుగా .......!

http://naaspandhana.blogspot.com/2008/12/blog-post_10.html (నా స్పందన లలిత గారు )

పొయిన శుక్రవారం కాకినాడలో మరీ అంత ముఖ్యంకాదు, అలాగని ఎగ్గొట్టడానికీ వీల్లేని పెళ్ళొకటి వుంటేను హాజరు వేయించుకు వచ్చేద్దామని వెళ్ళాను . ఎప్పుడో రాత్రి పెళ్ళి . అందాకా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఆ వూర్లోనే కొత్తకాపురం పెట్టిన మా రవిగాడు గుర్తొచ్చాడు . ఇందాకా వచ్చాకా చూడకుండా వెళితే ఏం బావుంటుంది అని వాడికో ఫోను కొట్టా . నేను ఫలానా చోతున్నాను . నన్ను చూడాలనిపించినా మీ ఇంటికి తీసుకెళ్ళి ఆతిద్యం ఇవ్వాలాని వున్నా రావచ్చు అని . మరీ అలా ముందరికాళ్ళకి బంధం తగిలించి లాగితే రాక చస్తాడా . ఓ పావుగంట్లో వాడు నాముందున్నాడు . మరో పావుగంటలో మేం వాడింటిముదున్నాం . ఏంతైనా కొత్తపెళ్ళికూతురు కదా అందుకే పాపం అత్తింటి చుట్టానైనా ఆదరంగానే లోపలికి ఆహ్వానించింది వాళ్ళవిడ . ఇల్లంతా పరికించి చూసి "బావుందర్రా .............బానే సర్దుకున్నరు " అని ఓ కంప్లిమెంటు ఇచ్చి కూర్చునేసరికి టీపాయ్ మీద టిఫ్ఫిన్ ప్లేట్ రెడీ . కాకినాడ స్పెషల్ కొటయ్య కాజా అందుకోబోతున్న నా చూపుని అక్కడే వున్న " జరీచీర" తన వైపుకి తిప్పేసుకుంది . దాన్ని చూసి ఒక గుటక మింగి కొత్తదిలావుందే అనిపైకే అనేసి ఆత్రంగా చేతుల్లోకి తీసుకొని ఆసగా చూస్తుంటే నా వీక్నెస్స్ తెల్సిన మా రవిగాడు " కావలంటే తీసుకెళ్ళు" అన్నాడు . లోపల్లోపల ఆనందంపడినా పైకి మొఖమాటం నటిస్తూ " అబ్బే వద్దులే బయటెక్కడైనా దొరుకుందేమో చూస్తాను "అన్నాను . " అయ్యో మళ్ళీ ఇంకోటి తీసుకోటమెందుకు నీకు కావల్సినన్ని రోజులు వుంచుకో , అసలు నువ్వు తిరిగి ఇవ్వకపోఇనా పర్లేదు " అంటున్న వాడు నాకు ఆ క్షణంలో బలిచక్రవర్తిలా కనిపించాడు

ఎందుకంటే అప్పటికే నా దృష్టి ఎదురుగా వున్న అద్దాల బీరువా మీద పడింది . బీరువా తెరిచి అందులో వరుసగా పొందికగా సర్దిన వాటిలోంచి ఓ నాలుగు చేతుల్లోకి తీసుకొన్నాను . అప్పాటికే నా అంతరార్ధం కనిపెట్టిన మావాడు వామనుడి నోట మూడోవరం విన్న బలిచక్రవర్తిలా చూస్తూ " కావాలంటే తీసుకెళ్ళు " అనక తప్పలేదు . ఈవిడకి తొందరగా కాఫీ ఇచ్చేస్తే నయమను కుందేమో వాళ్ళవిడ కంగారుగా వంటింట్లోకి పరిగెత్తింది .

వచ్చినందుకు బానే గిట్టుబాటయ్యిందని సంబరపడుతూ "శీఘ్రమేవ శుపుత్రప్రాప్తి రస్తు "అని ఒక భారీ దీవెన కొత్త జంటకి నా బహుమతిగా ఇచ్చి బయలుదేరా

నేను అంతలా ముచ్చటపడీ మా వాడిని మొహమాటంలో పడేసి తెచ్చుకున్న "జరీచీర"

శ్రీపాద సుభ్రహ్మణ్య శాస్రి కధల సంపుటి : పుల్లంపేట జరీచీర

అద్దాలబీరువాలోంచి ఎత్తుకొచ్చినవి

శ్రీ రమణ : గుత్తొంకాయ్ కూర _ మానవసంబంధాలు

ఆరుద్ర ; రాముడికి సీత ఏమౌతుంది

వంశీ ; వెన్నెల బొమ్మ , రవ్వలకొండ నవలలు


"ఆశగా ఎత్తుకొచ్చావ్ గాని మళ్ళీ నా వంక చూసావా " అన్నట్టు నిష్టూరంగా "పుల్లంపేట జరీచీర" , అవును......మరే.......మరే అని వంతపాడుతుతూ మిగతా పుస్తకాలు నా వైపు కోపంగా చూస్తున్నయ్

వాటినోసారి పలకరించి వస్తా ..................... అవునూ ముందు దేనితో మొదలుపెట్టాలీ?


పుస్తక పఠనం అంటే ఆసక్తి వున్నవారికీ ఎవరింటికైనా వెళ్ళినపుడు అక్కడ మంచి పుస్తకాలు కనిపిస్తే నోరూరకుండా వుంటుందా ,మనసు జారకుండా వుంటుందా చెప్పండి . నేను అంతే" మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే .....................అంతే " మరి అపార్ధం చేసుకోరుగా .........!

2 కామెంట్‌లు:

నేస్తం చెప్పారు...

ఈ పోస్ట్ చదివేసరికి నాకు లలిత గారెవరో తెలియదు.కధను బట్టి ఆమెకో యాబై ఉహించేసాను ..(హి.. హి.. లలిత గారు తిట్టుకోకండి )ఎవరబ్బా ఈవిడ మరి ఇంత మొహమాటం లేకుండా ఎవరింటికి పడితే వాళ్ళింటికి వెళ్ళిపోయి ఇలా చీరలు,నగలు అడిగేస్తుంది ..బాబోయ్ ఇలాంటి ఆడపడుచు ఉంటె కష్టమే ..మళ్ళా భయం లేకుండా ఆ విషయం పోస్ట్ లో మరీ రాసింది.. వీళ్ళకు ఇది తప్పేమో అన్న ఫీలింగ్ రాదేమో ..ఛి.. చీ అని అనుకుంటూ చదివాను ..కాని ఆమె శైలి ఎంత నచ్చిందంటే ఇష్టం లేకపోయినా చివరివరకు చదవాల్సి వచ్చింది.. చివ్వర్లో ట్విస్ట్ కు మహేష్ బాబు కొట్టినట్లు దిమ్మదిరిగిపోయి ..అయ్యా బాబోయ్ ఈవిడ సామాన్యురాలు కాదు అనిపించింది.. అలా లలిత గారి ఫేన్ అయిపోయాను :)

Rakesh చెప్పారు...

nizhamga baundi :)