7, ఏప్రిల్ 2011, గురువారం

పెళ్ళెందుకు ??? ... లొల్లెందుకు ??

http://gaavukeka.blogspot.com/2010/03/blog-post.html ఈయన బ్లాగ్లో అన్నీ పోస్ట్లు చాలా బాగుంటాయ్ ..ఇది కూడా :)





పెళ్ళెందుకు ??? ... లొల్లెందుకు ???
నా మునపటి టపాలో ఒక బ్రహ్మచారిగా నేను పడ్డ పాట్ల గురించి చర్చించాను , ఇక్కడ ... ఇప్పుడు పెళ్ళి చేసుకునే క్రమంలో నేను పడ్డ పురిటి నొప్పులపై పిచ్చాపాటి ...

ఎలాగైనా పెళ్ళి చేసుకోని , పెళ్ళి కాలేదనే నెపంతో నన్ను అవహేళన చేస్తున్న సోకాల్డ్ సభ్యసమాజపు అసభ్య జనాలకి గుణపాఠం నేర్పి , ఒక బ్రహ్మచారిగా నేనెదుర్కొంటున్న సామాజిక వివక్షని కూకటి వ్రేళ్ళతో పీకేద్దామని నిర్ణయించుకున్నాను ...

ఎప్పటిలాగే , ఆవేశంలో నిర్ణయమైతే తీసుకున్నాను గాని , తరువాత ఏమి చెయ్యాలో పాలు పోలేదు ..

ఇలాంటి క్లిష్టమైన నిర్ణయం తీసుకునేముందు , అసలు " పెళ్ళెందుకు ? " అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనుకున్నాను.. అనుకుందే తడవు " What Do you say Dude ? " అని అడిగాను నా ఆత్మారామున్ని ..

" నాకేం తెలుసు బే ? ముందటి బెంచీ వాడికే గతి లేక క్వశ్చన్ పేపర్‍ని తిరగ రాస్తుంటే , వెనక బెంచీ వాడు ఆన్సర్ చూపించమని అడిగినట్టుంది .. అవతలికి పో " అని మర్యాదగా మందలించాడు ఆత్మరాముడు ...

ఎమీ తోచక తల పట్టుకు కూర్చున్న నన్ను , మా కొలీగ్ హేమలత పరామర్శించింది ... విషయమంతా పూసగుచ్చకుండానే చెప్పాను ...

విషయమంతా విని , " ఇంకెన్ని రోజులు చేతులు తడుపుకుంటావు విజయ్ ??? నా మాట విని ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకొని సెటిలైపో ?? " అంది నిట్టూరుస్తూ ..

" చేతులు తడుపుకోవడమేంటి ??? కాల్చుకోవడం కదా అనాల్సింది " అన్నాను మొహం చిట్లిస్తూ ..

ఇంతలో , " ఏంటబ్బా ? ఎంటీ సంగతులు ? " అంటూ సీన్‍లోకి ఎంట్రీ ఇచ్చాడు మా టీమ్‍మేట్ సుబ్బారెడ్డి ...

" ఆ .. రా ..రా .. సుబ్బారెడ్డి ... మంచి టైముకొచ్చావ్ " అంటూ ఆహ్వానించిన హేమలత వాయిస్ , మద్యాహ్నం ఆకాశవాణి రేడియోలో ప్రసారమయ్య్యే " పాడిపంట " ధారావాహికలో "రంగమ్మ" క్యారక్టర్‍ని తలిపించింది ..

" సుబ్బు , పెళ్ళయిన నువ్వైతే సరిగ్గా చెప్పగల్గుతావు ..కాస్త మన విజయ్‍కి పెళ్ళెందుకు చేసుకోవాలో అర్థమయ్యేట్టు చెప్పు" అంది హేమలత ముసిముసిగా నవ్వుతూ ..

" పెళ్ళికి ముందు హోటల్ తిండికి బాగా గ్యాస్ ప్రాబ్లమ్ ఉండెదబ్బా నాకు .. పెళ్ళి తరువాత మా ఆవిడ వంటకి దెబ్బకి తగ్గిపోయింది .." అన్నాడు సుబ్బారెడ్డి , త్రేన్చుతూ ..

" వాట్ డు యూ మీన్ ??? నా జీవితానికి సంబంధించిన " పెళ్ళి చేసుకోవాలి " అనే అత్యంత కీలక నిర్ణయాన్ని , నాకున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ ,నోటిపూత, సెగ్గడ్డలు వంటి మున్నగు ఆరోగ్య సమస్యలని ప్రాతిపదికగా చేసుకోని తీసుకోమంటావా యేంటి ? నెవర్ ... " అని వాళ్ళ మాటలని , నాకొచ్చిన ఇంపార్టంట్ అఫీషియల్ మెయిల్‍ని పట్టించుకోకుండా గూగుల్ టాక్‍లో చాట్ చేయడములో నిమగ్నమయ్యాను ..

ఇలా ఐతే విషయం తెగదని , పుస్తకాలు మంచి స్నేహితులనే విషయం గుర్తొచ్చి , సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‍ఫారం మీద కొన్న " ౩౦ రోజుల్లో పెళ్ళి చేసుకోవడం ఎలా ?" బుక్ చదవడం మొదలెట్టాను ...

ఆలుమగల మధ్యన అనుబంధం " పైజామాలో నాడాలా , విస్తరాకులో చీపురు పుల్లలా పెనవేసుకొని ఉండాలి " లాంటి నగ్నసత్యాలతో పాటు ,పెళ్ళి చేసుకోబోయే బ్రహ్మచారులకి చక్కటి చిట్కాలు ఇచ్చారు పుస్తకంలో రచయిత కటుకోజు బ్రహ్మచారి గారు ...

ఆ చిట్కాల పరంపరలో , " ఎవరైనా సరే, పెళ్ళి చేసుకోవడానికి ఒక బలమైన కారణముండాలి .. ఎవరికివారు దాన్ని వెతుక్కోవాలి అని రాసుంది " ... ఆ కారణమే తెలిస్తే ఈ దిక్కుమాలిన పుస్తకం చదవాల్సిన అవసరమేందిరా నాకు ? అనవసరంగా 5౦ రూపాయల బొక్కెందుకురా బ్రహ్మచారిగా ?? అని తిట్టుకుంటూనే మిగతా చిట్కాల జాబితాని చదవడం కొనసాగించాను ..

ఇండియాలో , వివాహితులైన ప్రజల మీద తాజాగా జరిపిన సర్వేల ప్రకారం , ప్రజలు తాము పెళ్ళి చేసుకొవడానికి చెప్పిన కారణాలను విశ్లేశిస్తే , అతి ముఖ్యమైనవి నాలుగు రకాలని తేలాయి ... అవి ..

1. శృంగారం (80%) 2. సంతానం(పిల్లలు)( 10%) ౩. డబ్బు ( కట్నం)( 8% ) 4.సాంగత్యం( తోడు - నీడ ) ( 2% )

అన్ని ఆప్షన్స్ బాగానే తోచాయి నాకు ... ఏది ఎన్నుకోవాలో అర్థం కాక , పై నాలుగు ఆప్షన్స్ తో నాలుగు చీటీలు రాసి , కలబెట్టి వేసి , అందులో నుండి ఒక చీటిని కళ్ళు మూసుకొని తీశాను .. తెరిచి చూస్తే , అధిక శాతం జనాదరణ వున్న ఆప్షన్ గల చీటీ వచ్చింది .... " గుంపులో గోవిందులా ఉండలేని నా మనస్తత్వం " నన్ను తీవ్రంగా మందలించింది ...

ఏం చేయాలో తోచలేదు కాసేపు ... తళుక్కున ఒక ఆలోచన మెరిసింది .. వెంటనే చీటిలను చించి అవతల పారేసి , పంటలేసాను , నేనున్న గది మారుమ్రోగేలా ..."థూ , యెదవ .. నాలుగు ఆప్షన్లున్న ప్రశ్నకి పంటలేసి జవాబెతుక్కునే యెబ్రాసి మొహమూ నువ్వునూ " అన్న నా ఆత్మారాముడి తిట్టు మారుమ్రోగింది ఈ సారి గదిలో ....

సైలెంటయిపోయాను కాసేపు ... చేసేదేమి లేక , ఎప్పటిలాగే జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలని కుటుంబ సభ్యులకే వదిలేసినట్టు , నా ఈ పెళ్ళి సంగతిని కూడా పెద్దల నిర్ణయానికే వదిలేశాను ..

నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ఉక్కిరిబిక్కిరికి గురయ్యి , ఆనందం పట్టలేక , మిట్టమద్యాహ్నమనే విషయం మరచిపోయి రెండు చిచ్చు బుడ్లు . నాలుగు కాకరొత్తులు కాల్చారు మా ఇంట్లో వాళ్ళు ...

పొద్దున్నే వచ్చే పాలవాడి దగ్గ్గరి నుండి , రాత్రికి గస్తీ తిరిగే నేపాలి గూర్ఖ వరకు కనబడిన ప్రతీ ఒక్కడిని " మా అబ్బాయికి పెళ్ళి చేయాలనుకుంటున్నాము , మీకు తెలిసిన పిల్ల ఉంటే చెప్పండి " అంటూ అర్జీ పెట్టుకోవడం మొదలెట్టారు మా ఇంట్లోవాళ్ళు ...

పెళ్ళి బ్రోకర్లకు , అమ్మాయి తరఫునోళ్ళకు ఇవ్వాలనిచెప్పి , నన్ను దగ్గర్లో వున్న ఫోటొ స్టూడియోకెళ్ళి , పూలకుండీ పక్కన నిలబడి ౩ రకాల ఫోజులతో ( క్లోజప్ , మీడియం , లాంగ్‍షాట్ ) ఫోటోలు తీయించుకు పంపమని అడిగారు మా ఇంట్లోవాళ్ళు... అందుకు నిరాకరించిన నన్ను , క్రింది ఫోటోలో ఫోన్ పట్టుకు కూర్చుంది నేనే అని చెప్పి , ఫోటోలు పంచిపెడతామని బ్లాక్‍మెయిల్ చేశారు ...



ఏరియల్ వ్యూ తో కలిపి మొత్తం నాలుగు రకాల ఫోజులతో కూడిన ఫోటోలు దిగి పంపించాను ...

సరిగ్గా 4 రోజుల తరువాత , వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ఊరిలో మా దూరపు బంధువుల తాలూకు అమ్మాయి ఉంది , చూడటానికి వెళ్ళాలని , వెంటనే ఇంటికి రమ్మని కబురు పంపారు మా ఇంట్లోవాళ్ళు ... పళ్ళెటూరమ్మాయి అయితే మాత్రమేంటి ? రోజా సినిమాలో అరవింద్ స్వామి అంతటోడు పల్లెటూరమ్మాయయిన మధుబాలని చేసుకోలేదా ? ఆమె మాత్రం క్లైమాక్స్ లో మొగుణ్ణి కాపాడుకోలేదా ఎంటీ ? అని నాకు నేను ధైర్యం చెప్పుకొని బయలుదేరా ..

జనాలతో క్రిక్కిరిసిన గదిలో ఇనుప చైరేసి కూర్చోబెట్టారు నన్ను .. సెక్స్ స్కాండల్‍లో పట్టుబడ్డ స్వామీజిని చూడటానికి వచ్చిన భక్తజనంలా తండోపతండాలుగా తరలివచ్చారు జనాలు నన్ను చూడటానికి ... చాలా ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుని చెరగనీయలేదు మొహం మీద ... నా పుట్టుపూర్వోత్తరాలు , పుట్టుమచ్చలతో సహా ప్రతీ విషయం అడిగి తెలుసుకొంటున్నాడు పిల్ల మేనమామ.. ఒక వైపు మా అమ్మమ్మ పిల్ల తండ్రిని తమ వంశవృక్షాన్ని ఒక ఫ్లోచార్ట్ గా గీసి భాగాలు గుర్తించమని వేపుకుతింటోంది ... ఇంతలో అమ్మాయిని తీసుకువచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టారు ... చుట్టుపక్కలున్న అమ్మలక్కలు నన్ను చూసి ముసిముసిగా నవ్వారు , రిథమిక్‍గా ... సిగ్గుతో నా కాలి బ్రొటన వేళితో నేనేసిన ముగ్గుకి , క్రిందున్న కార్పెట్ కొద్దిగా చిరిగింది ... అమ్మాయిని చూద్దామని తలలేపా ... తలదించుకొని కార్పెట్‍కున్న దారపు పోగులని పీకుతుంది అమ్మాయి .. అంతగా తల దించుకునే పనేంచేసిందోనన్న అనుమానం నన్ను క్రుంగదీసింది కాసేపు ...

" తలెత్తి అబ్బాయిని చూడమ్మా .. " అన్న మా అమ్మమ్మ మాటకి ఉలిక్కిపడి , లేచి , నన్ను చూసింది అమ్మాయి ... ఈ సారి తలదించుకోవడం నా వంతయ్యింది , సిగ్గుతో ... కాసేపు చూపులు ఇచ్చిపుచ్చుకోని , కళ్లతో నవ్వుకున్నాం ..

"అమ్మాయిని ఎమన్నా అడగరా ? అలా బెల్లంకొట్టిన రాయిలా కూర్చుంటావేంటి ? " అన్న మా అమ్మమ్మ మాటలకి , ఉలిక్కిపడి లేవడం నావంతయ్యింది ఈ సారి ...

సడన్‍గా ఏమడగాలో తోచక , " టైమెంతయ్యింది .. " అనడిగా తత్తరపాటులో .. అమ్మలక్కలతో సహా అమ్మాయి కూడా పగలబడి నవ్వింది నా ప్రశ్నకి ... సిగ్గుతో కూడిన అవమానంతో ఇంకాస్త చించా కార్పెట్‍ని కాలి వేలితో ..

కాస్త ధైర్యం తెచ్చుకోని " మీరు సినిమాలు చూస్తారా ? " అనడిగి , మా అమ్మమ్మకేసి చూశా .. " నీకున్న సినిమాపిచ్చి అందరికీ తెలవాలట్రా కటౌట్ యెధవ " అన్నట్టూ చిరాగ్గా ఒక చూపు చూసింది నన్ను ..

" చాల తక్కువండీ ... భక్తి రస సినిమాలైతే బాగా ఇష్టంగా చూస్తాను ... " అంది మొహం మీద పడుతున్న ముంగిరిలు సవరించుకుంటూ ...

" అవునా ... మీరు రీసెంట్‍గా చూసిన భక్తి సినిమా ఎంటండీ " అనడిగాను రెట్టించిన ఉత్సాహంతో ..

" పాండురంగడు " అంది తలదించుకొని ...

" పాండురంగడా ????????? నేనడిగింది భక్తి సినిమా గురించండీ , బూతు సినిమా గురించి కాదండీ .." అనన్నాను కాస్త చిరాగ్గా ..

" నేను చెప్పింది అదేనండీ ... బాలక్రిష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమానండి , మొత్తం మా ఫ్యామిలీ కలిసి చూశాము " అంది గోముగా ..

అప్పటివరకు కోలాహలంగా వున్న గది నిశ్శబ్ధంగా మారింది ... మా ఇంట్లోవాళ్ళు ఒక్కరొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు .. మారుమాట్లాడకుండా నేను మా వాళ్ళని ఫాలో అయ్యాను ...

ఒక నెల గడిచింది ... పాండురంగడు ఎపిసోడ్ తరువాత మల్లి పెళ్ళి మాట తియ్యడానికే భయపడ్డారు మా ఇంట్లోవాళ్ళు ... ఈ సారి కాస్త చదువుకోని , ఉద్యోగం చేసే సిటీ అమ్మాయిని చూడమని చెప్పాను మా వాళ్ళకి ..ఉద్యోగ రీత్యా నేను పూణెలో ఉంటాను ... పూణెలోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఉందని , వివరాలన్ని నాకు మెయిల్ చేశాడు నా మేనమామ ... అమ్మాయి మొబైల్ నంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడి , వీకెండ్ కలుద్దామనుకొన్నాము ... అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా చేరుకున్నాను , మేమనుకున్న స్ఫాట్‍కి ... షాపింగ్‍మాల్ రద్దీగా ఉంది , వీకెండ్ కనుక .. అమ్మయికి కాల్ చేశాను .. ఐసిఐసిఐ ఎటిఎమ్ ముందర నిల్చోనున్నాను అంది .వెతుక్కుంటూ వెళ్ళాను ,ఏటిఎమ్ దగ్గరికి ...

అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు .. అందులో ఒకమ్మాయి సన్నగా , నాజుగ్గా , జుట్టు విరబోసుకొని , కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోని అప్సరసలా ఉంది ... మరొక అమ్మాయి , జీన్స్ మీద సల్వార్ కమీజ్ టాప్ వేసుకొని , కాళ్ళకు పట్టీలు పెట్టుకొని , జడ వేసుకోని నుదిటిన కాస్త విభూది మార్క్ కి తోడు , బిందీ కూడా పెట్టుకుంది ... ఇంతటి ఎక్స్ పెరిమెంటల్ వేషధారణ భూప్రపంచంలో చేయగల్గే గట్స్ కేవలం మన తెలుగుమ్మాయిలకే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ తో వెళ్ళి " హాయ్ సుజాత " అని పలకరించాను ...

" హే విజయ్ ... హౌ ఆర్ యూ ... ఐయామ్ ఫైన్ .. థ్యాంక్స్ " అని విష్ చేసింది .. కుశలప్రశ్నల తరువాత పక్కనున్న రెస్టారెంట్‍కి వెళ్ళి కూర్చున్నాము ... రెండు ఫ్రూట్ జ్యూస్‍లు ఆర్డర్ చేశాను .. రెండు తనే తాగేసింది..తన బాల్యం,కౌమార, యవ్వన దశల్లో జరిగిన వివిధ సంఘటనల సమాహారముతో నాన్‍స్టాప్ గా మాట్లాడుకుంటూ పోయింది ... నిప్పుల మీద కూర్చున్నట్లనిపించింది నాకు ... ఒక స్ట్ర్రాంగ్ టీ ఆర్డర్ చేశాను తలనొప్పి భరించలేక ... " ఒకటే చెప్పావే , నీకొద్దా " అంది .. దీనవదనంతో , రెండు తీసుకురమ్మన్నట్టూ బేరర్‍కి సైగ చేసాను ...

" హేయ్ విజయ్ సలీం సినిమా చూశావా ? సూపర్ సినిమా కదు " అంది ..
మూగకేక పెట్టాడు ఆత్మారాముడు ... కంటతడి పెట్టకుండా ఏడ్చాను...

ఇక ఇలా ఐతే లాభం లేదనుకోని , ఆ నిరంతర వాగుడు స్రవంతికి అడ్డుకట్ట వేయాలని డిసైడయ్యి , " వీకెండ్స్ లో ఎం చేస్తుంటావ్ ? " అనడిగాను ..

" బట్టలుతుక్కోని , నిద్రపోతానంది " ...

అరనిమిషం సైలెంటయిపోయాను ..తేరుకోని " ఆ తరువాత ఎమి చేస్తావ్ అనడిగాను " కూరుకుపోయిన గొంతుతో ..

" ఏముంది , ఆరిన బట్టలని ఇస్త్రీ చేసుకోని , మళ్ళి పడుకుంటాను .... " అంది గిగిల్ చేస్తూ ..,

" నిన్ను చేసుకుంటే , టైమ్‍పాస్ కాట్లేదని చెప్పి కాలనీ వాళ్ళ బట్టలుతికే రకమే నువ్వు దిక్కుమాలిందానా " అని కసిగా తిట్టుకున్నా లోలోన . బయటికి నవ్వుతూ నటిస్తూ ...

" అలా కాదు సుజతా , నీకంటూ కొన్ని హాబీస్ ఉంటాయి కదా , వాటి గురించి అడిగాను .. " అనన్నాను అసహనంగా ..

" హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఎమీ లేవు కాని ... న్యూస్‍పేపర్లు , వీక్లీస్‍లో వచ్చే సినిమా పోస్టర్స్ లో ఉన్న హీరోయిన్లకి , మీసం లేని హీరోలకి మీసాలు, గడ్డాలు గీయడం అంటే చాలా ఇష్టం .. " అంది ముసిముసిగా నవ్వుతూ ...

నాకు బాధతో కూడిన కోపం నషాళానికి ఎక్కింది ...

" మరి నీ హాబీస్ ఎంటి విజయ్ ???? అనడగింది ఆ వాగ్దేవి ( వాగుడు + దేవి ) ...

" చాలానే ఉన్నాయి .. బాత్రుంలో ఎవరన్నా దూరితే బయటీ నుండి గడి పెట్టేయ్యడం , దుమ్ము పట్టిన కారు అద్దాల మీద పేర్లు రాయడం , ముక్కులో చీపురు పుల్లలు పెట్టుకోని తుమ్మడం , దక్షిణమధ్య రైల్వేస్ టాయిలెట్లలో బూతుబొమ్మలు గీయడం , నీలాంటి అమ్మాయితో హోటల్‍కి వచ్చినప్పుడు బిల్ల్ కట్టకుండా పారిపోవడం etc. " అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాను..

ఇంటికెళ్ళాక మా అమ్మమ్మకి ఫోన్ చేసి " ఇంకా సంబధాలు చూడకండి .. నేను సన్యాసం తీసుకోబొతున్నాను " అని చెప్పి , ఆరంజ్ కలర్ జీన్స్ , టీ షర్ట్ కొనుక్కోవడానికి బట్టల కొట్టుకి బయలుదేరాను ...
Posted by వీజె at 12:31 AM

28, మార్చి 2011, సోమవారం

ధైర్యే సాహసే ఎంకట లక్ష్మి

కావ్య రాసిన పోస్ట్లు చాలా చాలా నచ్చ్సుతాయినాకు http://outofmyscope.blogspot.com/2011/03/blog-post_10.html
(
అది ఇంజనీరింగ్ చేరిన కొత్తలు .. C అంటే ఏమిటి .. DATASTRUCTURE అంటే ఏమిటి అని రోజుకి వంద సార్లు చెప్పినా కూడా .. ఈసీ గా ఉంది అని అన్ని ప్రోగ్రామ్స్ లోను అల్గారిథంస్ రాస్తూ ఉండే పసి తనం. (అంటే పైంట్ లో రాసే వాళ్ళం లెండి ) కంప్యూటర్స్ ఏ భయంకరంగా ఉన్నాయి రా అంటే .. మా ప్రాణానికి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు కూడా ఏడిశాయి .. ఎవరి పేరు చెప్తే మేము క్లాస్సులకి రాడానికి భయపడి కాంటీన్ కి పరిగేడతామో ... ఎవరి పేరు చెప్తే .. చెత్త సినిమా అయిన కూడా ప్రాణాలకి తెగించి వీర్ కమల్ థియేటర్ కి పారిపోతామో .. ఎవరి పేరు చెప్తే .. యతి కి బేకర్స్ ఇన్ కి లగెత్తి పేస్ట్రీలు .. బర్గర్లు .. పీజా లు తింటామో .. అదే అండి మా ఇంజినీరింగ్ నెట్వర్క్స్ .. అతి వీర ఘోర దారుణ భయంకరమైన సబ్జెక్టు "ఇంజినీరింగ్ నెట్వర్క్స్" దానికి మాకు ఒక మేడం వచ్చేది రాధా కుమారి అని .. పాపం ఆవిడ కూడా మా టైపు ఏ .. పెద్దగ సబ్జెక్ట్ రాదు .. ఏదో క్లాస్ లో బోర్డు మీద బొమ్మలేసి చెప్తే .. పోన్లే పాపం అని వదిలేసాను .. కాని ప్రాక్టికల్సు .. హ్మ్ .. మన వల్ల అవుతుందా .. సరే ఏదో ఒకటి అని గట్టిగ ఉపిరి పీల్చుకుని .. కుడి కన్ను అదురుతూ ఉండగా .. ఒక దుర్ముహుర్తాన మా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వెళ్లి లేబ్ లో ..మొదటి రోజు ఎడమకాలు పెట్టి ఎంట్రీ ఇచ్చాను .. వెంటనే ఆ లేబ్ అటెండర్ వచ్చి దిష్టి తీసి వీర తిలకం అవి దుద్ది .. మా అందర్నీ ఒక మూలకి నున్చోపెట్టాడు .. మాకు లేబ్ ఇంచార్జ్ .. అలాంటిలాంటి వ్యక్తా .. అయన గురించి చెప్పాలంటే ఒక చిన్న ఫ్లాష్ బాక్ .. ట్రి ట్రి ట్రి వెళ్ళిపోయార .. అది 1965 మా నాన్న సెం అదే కాలేజ్ లో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు ... అప్పుట్లో అయన బెస్ట్ ఫ్రెండ్ రాయుడు ... సర్వ రాయుడు .. అన్నమాట .. ఫ్లాష్ బెక్ ఫినిష్ .. సో మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ .. నా ఇంజినీరింగ్ నెట్వర్క్స్ ప్రావిణ్యం ఇప్పుడు ఈయనకి చూపిస్తే ఇంట్లో నా పరువు పోతుంది అని చెప్పి .. అందరికంటే వెనకాల దాక్కున్న .. కాని నా ఖర్మ .. మా అందర్నీ గ్రూప్స్ కింద విభజిస్తారు కదా .. అప్పుడు దొరికిపోయ .. అంతే అయన క్షేమ సమాచారాలు మొదలేట్టెసాడు .. అంతా అయ్యాక చుస్తే .. నా బేచ్ అంతా అబ్బాయిలే .. నేనే లీడర్ ని .. అసలే కొత్త దానికి తోడూ అబ్బాయిలు పరువు పోతుంది .. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు .. మన రాయుడు గారేమో రెచ్చింగ్స్ .. ఏంటో ఇప్పుడు ఆ పదాలు గురుతు కూడా రావడం లేదు కాని .. రెండు వైరులు కలుపు అన్నాడు .. రానప్పుడు మాటాడకుండా ఉండొచ్చు కదా .. మిగత వాళ్ళు చేస్తారు .. ఉహు .. ఏదో కంటికి ఇంపుగా కనిపించిన రెండు కలర్స్ వైర్లు కలిపా .. వెంటనే పాతాళ భైరవి టైపు లో .. ఒక చిన్న మంట వచ్చి వెలుగు వచ్చింది .. ఫాలోడ్ బై పొగ అండ్ రాయుడు గారి అరుపులు .. నేను కెవ్వ్ అని అరిచా అనుకున్న .. నోరుకుడా తెరిచా .. కాని భయం తో నోట మాట రాలేదు .. ఈ లోగ మహేష్ బాబు లాగ వీరోచితంగా ఒక అబ్బాయి టు డ్రాప్స్ వాటర్ దాని మీద పోసాడు .. వెంటనే నేను వావ్ అన్న .. వాడు పెద్ద ఫైర్ రేస్క్యు చేసిన రేంజ్ లో బిల్డ్ అప్ ఇచ్చాడు.. కాని అది ఎంతో సేపు నిలవలేదు .. సర్క్యూట్ కాల్చినందుకు నన్ను .. దాని మీద నీళ్ళు పోసినందుకు వాడిని ఇద్దరినీ గెట్ అవుట్ అని రెండు లేబ్స్ బహిష్కరించాడు .. మా నాన్న కి ఫోన్ చేసి నీ కూతురు పెద్ద శుంట టైపు లో రెండు నీతి వాక్యాలు అవి చెప్పాడు .. ఇంకా తర్వాత సీను మీకు చెప్పక్కర్లేదు కదా .. మా నాన్న ... నువ్వు నాకు నచ్చావు లో చంద్రమోహన్ లాగ .. నాకు ఫుల్ క్లాస్ పీకేసారు .. నువ్వు అక్కడకి వెళ్లి ఏమి చేయకపోయినా పర్లేదు .. కాని మా ఫ్రెంషిప్ మాత్రం చెడగొట్టకు .. (ఇక్కడ ఇంత భారి డవిలాగ్ అవసరమా తొక్కలో సర్క్యూట్ కే ఫ్రెంషిప్ పాడైపోతుందా .. దానికి మళ్ళి నేను కారణం .. హ్మ్ ఎంటో.) మా అమ్మ దగ్గరకెళ్ళి చెప్తే .. ఇలా దా నీకు జడేస్తా అని ఫుల్ గా నూనె రాసి జడేసేసింది(మా అమ్మ అంతే ఏమి చెప్పాలో తెలియనప్పుడు ఇలా నూనె రాసి జడేస్తూ ఉంటుంది .. ఎందుకు అని అడగకండి ..నాకు తెలీదు మా అమ్మకి అస్సలు తెలీదు ) సరే మొత్తానికి మా లేబ్ అస్సిస్తేంట్ ని మంచి చేసుకుని మా సర్క్యుట్స్ అన్ని వాడితోనే చేయిన్చేసే వాళ్ళం .. అలా ఉన్న రోజుల్లో .. ఫస్ట్ ఇయర్ ఎక్సామ్స్ వచ్చాయి .. ఏమొచ్చు రాయడానికి ఒక్క ముక్క కూడా రాదు .. ఎంటో ఖర్మ .. అని అనుకుంటూ ఉన్నా .. నాకు ప్రతి ఎక్సాం రాయడానికి వెళ్ళేప్పుడు .. నా హాల్ టికెట్ ప్రతి దేముడు ఫోటో కి పెట్టడం అలవాటు .. నెట్వర్క్స్ ఎక్సాం కి ఎంతలాగా మతి పోయింది అంటే .. అన్ని ఫొటోలకి పెట్టి చివరకి నా ఫోటో దగ్గర కూడా పెట్టి దణ్ణం పెట్టా.. అది మా నాన్న కంట పడింది .... వెంటనే ఒక అరగంట క్లాసు .. సరే ఏదైతే అది అయింది అని ధైర్యే సాహసే ఎంకట లక్ష్మి అని మా ఎంకమ్మ మంత్రం జపించి ఎక్సాం హాల్ దాక వచ్చేసా బయట మా తొట్టి గాంగ్ అంతా చేరి సీరియస్ గా డిస్కషన్స్ .. నేనెళ్ళి .. "ఏంటే పేపర్ కాని తెలిసిపోయిందా .. అయితే కమాన్ .. చెప్పండి" అన్నాను దానికి నా ఫ్రెండ్ " ఎహే అది కాదే .. ఏమయినా చదివావ ." నేను : " ఉహ్హహ్హ . చదవడం అది కూడా నెట్వర్క్స్ .. నన్ను ఏమైనా తిట్టావా" ఇంకో ఫ్రెండ్ : " దీనికి ఎప్పుడు జోకులు వెయ్యాలో తెలియదు కాని .. మనమందరం డ్రాప్ పెడదామే" నేను : "డ్రాప్ ఆ అనగానేమి ?" అందరు ఒక వింత లుక్ ఇచ్చి .. హితబోధ చేసారు .. మనకి ఎక్సాం లో ఏమి రాయాలో తెలీనప్పుడు .. డ్రాప్ పెడతారు .. ఈ లోగ గణ గణ గంటకోడితే .. దాని కధ కమామిషు చెప్పకుండా మొత్తం లోపలకి చేక్కేసారు .. సరే నేను నా కొద్దిపాటి బుర్ర ఉపయోగించి .. డ్రాప్ అనే దాన్ని నాకున్న దర్శకత్వ ప్రతిభతో .. ఒకలాగా డైరక్ట్ చేశా .. అది ఎలా ఉంటుంది అంటే .. ఒక అల్గారిథం .. అది ఎలా ఉంటుందో అని మీ కుతూహలం నాకు తెలుసు మీకోసం ఇదిగో ఇక్కడ ఉంది చూస్కోండి :) అలా అనుకున్నానా .. పేపర్ తీసుకుని కూర్చున్నా .. దేముడా దేముడా అని క్షణ క్షణం లో శ్రీదేవిలాగా కళ్ళు మూసుకుని పేపర్ రెండు చేతులతో గట్టిగ పట్టుకుని ఒక కన్ను చిన్నగా తెరిచి చూసానా .. అంతే డాం ఏమి రాదు .. వెనక ధబ్బ్ అని సౌండు ఏంటా అని చుస్తే మా వరం ఆల్రేడి పడిపోయింది .. కొంచెం మా ఎక్సాం హాల్ కంపించింది .. సరేలే ఏదో ఒకటి అని ఇంకా కోషన్ పేపర్ చదువుతున్ననా .. ఈ లోగా హస్కి గా ఒక వాయిస్ " సార్ ఎడిషన్" అప్పుడు నాకు పోలిస్ స్టోరి లో సాయి కుమార్ గా కోపం పొంగుకొచ్చింది .. ఇక్కడ పేపర్ మీద పెన్ను కూడా పెట్టలేక ఏడుస్తుంటే ఎవడో సేం అండర్సన్ పాట కి స్టెప్పులు వేసాడుట.. అలా ఉంది .. సరే ఈ శాల్తిని ఎక్సాం అయిపోయాక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాకి తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయ్యా .. వెనక్కి తిరిగి చూస్తే .. మధు .. ఒక తిక్క మొహం వేసుకుని చూస్తోంది .. చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మి లాగ ఏమైనా వచ్చా టైపు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది .. థు నా బతుకు దీనికి ఏమి రాదు .. నాకు ఏమి రాదు .. ఈ బూడిద ఏంట్రా బాబు అనుకుంటూ .. సరే మన డ్రాపు మంత్రం జపిద్దాము.. కాని ఎవరైనా పెడతారు కదా అని వెయిటింగ్ .. నాకు వచ్చిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్స్ అన్ని రాసి . తెచ్చుకున్న క్రేయాన్స్ తో రంగు రంగుల కరంటు వైర్లు అవి ఉన్న బొమ్మలు వేస్తూ కూర్చున్నా .. గంట అయింది ఎవరు డ్రాపు పెట్టలేదు .. రెండు గంటలు .. ప్చ్ నో .. ఇంకా చిరాకొచ్చి కొంచెం కునుకు తీసా .. గణ గణ గంట మోగింది .. సార్ వచ్చి పేపర్ లాగేస్కున్నాడు .. అయ్యో డ్రాపు పెట్టలేదు అని చాల బాధ పడ్డా .. బయటకి వచ్చాక .. మా ఫ్రెండ్స్ అందరు ఏమో డ్రాపు పెట్టాం అన్నారు అదేంటి అది ఎలా కుదురుతుంది .. మీరు అల్గారిథం ఫాలో అవలేదా అంటే .. అది విని అందరు నవ్వారు .. నీ మొహం డ్రాప్ అంటే .. ఆన్సర్ పేపర్ మీద ఇంటు కొట్టేసి పైన డ్రాప్ అని రాయడం అని .. అంతే మన తెలివి దశ దిశలా వ్యాపించి పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నన్ను చూడడానికి వచ్చేవారు .. ఈ పాపులారిటీ అంతా నాకు ఎప్పుడు ఉండేదే కాని .. అమ్మో నా నెట్వర్క్స్ ఎక్సాం ఫెయిల్ అయిపోతానేమో అని తెగ బెంగ పెట్టేసుకున్న .. ఒకానొక దుర్ముహుర్తాన మా రిజల్ట్స్ వచ్చాయి .. నేను అన్ని సబ్జెక్టులు పాసు .. జంతర్ మంతర్ ఝూ మంతర్ ఏంటంటే .. నెట్వర్క్స్ లో నేనే క్లాస్స్ ఫస్ట్ .. కెవ్వ్ .. అపుడు నన్ను ఏనుగు మీద ఊరేగించి .. సన్మానం అది చేసి .. "నెట్వర్క్స్ నాంచారి" అనే బిరుదు కూడా ప్రధానం చేసారు .. ఆ రకంగా నేను బాగా పాపులర్ అయ్యాను :) మా ఎంకమ్మ మంత్రం బాగా పని చేసింది :) సో మీరు కూడా కష్ట కాలాల్లో ఆ మంత్రాన్ని జపించి గెలుపు పొందండి మరి ... ఆల్ ది బెస్ట్

మొహమాటం లో పీక్

కావ్య రాసే పోస్ట్లు నాకు చాలా చాలా ఇష్టం (http://blogavadgeetha.blogspot.com/2011_03_11_archive.html)

మొహమాటం లో పీక్ ..
నేను ఒకళ్ళకి సారి చెప్పాలి
హ్మ్ ఏంటి అస్సలు ఎప్పుడు తప్పులే చెయ్యని కావ్య ..
దేవత లాంటి కావ్య ..
అందరితోను పూజించబడే కావ్య ..
చూడగానే చేతులు ఎత్తి దణ్ణం పెట్టాలి అనిపించే కావ్య ..
ఇంకా ఇంకా చాలా వున్నాయి .. అలాంటి కావ్య .. ఒకళ్ళకి సారి చెప్పడమా .. నెవర్ అనుకుంటున్నారా
అవాక్కయ్యారా .. నిజం అండి ..
ఏమి చేద్దాం .. విధి ఆడిన వింత నాటకం లో .. నేను అలా చెయ్యక తప్పలేదు మరి ..

అమ్మో అమ్మో మీరు ఏమేమో ఊహించేసుకోకండి .. ఇది ఒక చిన్న ఫన్ని .. తప్పు .. కాని అంతకు మించి నాకేమి మార్గం కనిపించలేదు ..
బేసిక్ గా నేను అబద్దాలు ఆడను కాని ఆరోజు ఆ నిమిషం .. ఆ మొమెంట్ .. ఆ క్షణం లో అలా ఆడాల్సి వచ్చింది ..
అమ్మ తల్లి సోది గోల ఆపి మేటర్ చెప్పవే బాబు అని అంటున్నారా .. ఏమి చెయ్యను ..
పశ్చాత్తాపానికి మించి .. ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా .. ఆ టైపు లో నేను పశ్చాత్తాప పడుతున్న .. మీరే సాచ్చం (అమ్మయ్య వీళ్ళందరికీ కూడా కొంచెం పాపం అంటిన్చేసాను)
సరే అసలు విషయం లో కి వద్దాం ..
ఒక రోజు ఆఫీసు లో పని చేసుకుంటున్నానా .. అమ్మ ఫోన్ చేసింది ..
అమ్మ : పండు ఏమి చేస్తున్నావు ..
నేను : ఆఫీసు .. పని .. బిజి .. గోల .. గందరగోళం
అమ్మ(నవ్వుతు) : నా దగ్గర నీ దొంగబద్దాలు .. ఏమి ఆడుకుంటున్నావో .. నిజం చెప్పు
నేను ( నాలిక కరుచుకుని ) : అవును నువ్వే కదమ్మా .. ఏమి లేదు .. అలవాటులో పొరపాటు .. నేను ఫేస్ బుక్ లో ఫార్మ్ విల్లి లో నా మొక్కలకి నీళ్ళు పోస్తున్న ..
అమ్మ : ఇంట్లో గులాబీ చెట్టుకి ఒక్కసారి పోసావే నువ్వు నీళ్ళు
నేను : నో కామెంట్స్
అమ్మ : ఏడిసావులే .. ఎప్పుడు వస్తున్నావ్ ఇంటికి .. ఇవాళ రాకూడదు ..
నేను : అమ్మ నువ్వు అలా అడిగితె నేను రానా .. సరే ఇవాళ ట్రైన్ కి బయలుదేరుతా ..

కట్ చేస్తే IRCTC లో టికెట్ బుక్ చేసుకుంటున్న నేను ..
ఎప్పుడు వెళ్ళే ట్రైన్ కి టికెట్స్ అయిపోయాయి .. చూస్తే .. భువనేశ్వర్ మీదుగా కలకత్తా వెళ్ళే ట్రైన్ కి టికెట్స్ కొన్నాను .. ( అదే ఫస్ట్ టైం నేను అటు వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కడం)
రూం కి వెళ్లి బేగ్ తీసుకుని .. స్టేషన్ వెళ్లి ట్రైన్ కోసం వెయిటింగ్ ..
వచ్చింది మొత్తానికి ముక్కుకుంటూ మూలుగుకుంటూ .. ట్రైన్ .. సరే బ్రతుకు జీవుడా టైపు లో నేను ట్రైన్ ఎక్కానా ..
ఖర్మ నాది సీట్ నంబర్ 8 అంటే సైడ్ లోయర్ .. లాస్ట్ అన్నమాట .. నాకు అక్కడ కూర్చోవడం అంటే మా చెడ్డ చిరాకు .. కాని ఏమి చేస్తాం .. ట్రైన్ మొత్తం ఫుల్ .. సరేలే అని కూర్చున్నా ..
నా కంపార్ట్మెంట్ లో ఒక్క ఆడ లేడీస్ కూడా లేరు .. పోనీ వెళ్లి వాళ్ళ పక్కన కుర్చున్దామంటే .. సరే బిక్కు బిక్కు మని అక్కడే కూర్చున్న
నా ఎదురుకుండా ఒక గేంగ్ .. ఆరుగురు కూర్చునే చోట పన్నెండు మంది కూర్చున్నారు .. అంతా అబ్బాయిలే .. నాకేమో టెన్షన్ కాని ఏమి చేస్తాం ..

వల్లేమో మధ్య మధ్యలో వచ్చి నా పక్క సీట్ లో కుర్చుని .. కొంచెం అల్లరి చేస్తున్నారు .. నేను ఏమి చెయ్యలేక అలా కిటికీ లోంచి బయటకి చూస్తూ .. నాకు రాని సీరియస్ నెస్ అంతా తెచ్చేసుకుని .. TC కోసం వెయిటింగ్ ..
మనోళ్ళు పేకాట మొదలెట్టారు .. అదేదో బాషలో ఏవో జోక్స్ వేసుకుంటూ .. మధ్య మధ్యలో నా కేసి చూసి నవ్వుతున్నారు ..
అసలే భయంతో అనుమానం తో ఉన్నానేమో .. వాళ్ళెం మాటాడిన .. నా గురించే ఏమో అని డౌట్ .. ఒక పక్క టెన్షన్ వెరసి .. నిద్ర కూడా రాడం లేదు .. ఈ TC మహానుభావుడు .. రాదే ఎంతకి అని కిటికీ లోంచి చూస్తే ..
తళ తళ లాడే తెలుగు ట్రిపుల్ ఎక్స్ సోప్ కి యాడ్ లాగ .. ప్లాట్ ఫార్మ్ మీద వైట్ అండ్ వైట్ లో ఒక అబ్బాయి వచ్చాడు .. చేతిలో సూట్ కేస్ .. నల్ల కోట్ .. వచ్చి నా పక్క సీట్ లో కూర్చున్నాడు ..
నన్ను చూసి ఒక స్మైల్ కూడా ఇచ్చాడు ..
సరే పలకరింపుగా నేను ఒక రిటర్న్ స్మైల్ ఇచ్చాను ..
అతను : హలో
నేను : హాయ్
అతను : whats your name
నేను : ప్రియ ( అబద్దం మరి తెలియని వాళ్ళకి పేరులు అవి చెప్పకూడదు .. వాళ్ళెం పెట్టిన తినకూడదు అని మా అమ్మమ్మ చెప్పింది )
అతను : i am vivek .. what are you doing
నేను : Btech ఫస్ట్ ఇయర్ ( మల్లి అబద్దం .. నన్ను చూసి అతనికి .. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆ .. అని అనుమానం వచ్చినా నాకు అనవసరం .. తెలియని వాళ్ళకి డిటైల్స్ నేను ఇవ్వను కాక ఇవ్వను )
ఇప్పుడు నేను : are you lawyer
అతను ( మనసులో అనుకుంట ) :!@#$%%$$%^$^$(పైకి అయితే సౌండ్ ఏమి రాలేదు కాని ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ నాకు కనిపించింది .. అదే చంద్ర ముఖి లో రజని కాంత్ కి జ్యోతిక కళ్ళల్లో కనిపిస్తుంది ఆ టైపు లో )
అతనే మళ్ళి : i m ticket collector ...
నేను నా మనసులో : థు .. నల్ల కోటు వేసుకునే ప్రతి వాడు లాయర్ ఏనా .. వెధవ కుతూహలం ఎక్కువా .. కాసేపు కాం గా ఉంటె అతనే చెప్పేవాడు కదా ..
ఇంకాసేపు అక్కడే ఉంటె నేను ఏమి వింత వృత్తులు అంట కడతానో అని భయం వేసినట్టు ఉంది .. చెకింగ్ కి వెళ్ళాడు ..
ఎదురుకుండా బేచ్ వైపు ఓ లుక్ వేసా .. వాళ్ళు కొంచెం నార్మల్ లో కి వచ్చారు .. నేను TC ఫ్రెండ్ అనుకున్నారేమో .. ఇంకా అప్పుడు నించి పెద్దగ వెకిలి వేషాలు వెయ్యలేదు ..
అప్పుడు నాలోని ధైర్య లక్ష్మి లేచింది .. ఓహో .. ఇదన్నమాట విషయం అని .. అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గి మాములుగా ఉన్నాను ..
ఇప్పుడు మన కధానాయకుడు .. రౌండ్స్ పూర్తీ చేసుకుని వచ్చాడు .. అప్పుడు మొదలెట్టాడు పుట్టు పూర్వోత్తరాలు ..
వాళ్ళది అహ్మదాబాదు ..
గత రెండు ఏళ్ళుగా ఆంధ్ర లో ఉన్నాడు అట
చెన్నై టు విజయవాడ డ్యూటీ ఎక్కువ పడుతుంది అట ..
నా రెస్పాన్స్ - ఓహో అలాగా ..
అతనికి ఇద్దరు అక్కలు .. పెళ్ళయిపోయింది ..
నా రెస్పాన్స్ - అయితే నేనేమి చెయ్యాలో
వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిపోయారు
నా రెస్పాన్స్ - అయ్యో పాపం
అతనికి సంబంధాలు చూస్తున్నారు
నా రెస్పాన్స్ - మా చుట్టాల్లో నార్త్ ఇండియన్స్ ఎవరు లేరు .. ఒకవేళ మా అన్నలు ఏమైనా సంబంధాలు అది కలుపుకుంటే నీకు చెప్తా నాయనా ..
నా పరిస్తితి ఎలా ఉంది అంటే
శత్రువు ఇంటి గోడ మీద గ్రాఫెట్టి వేస్తుంటే .. శత్రువు వెనక నించి వచ్చి నా డ్రెస్ మీద ఇంకు పోసాడుట .. అలా ఉంది
ఎవరి నుంచో తప్పించుకుందామని .. TC తో ఫ్రెండ్షిప్ చేస్తే ..
ఈ TC నించి ఎలా తప్పించుకోవాలి .. వెళ్లి డ్రైవర్ తో ఫ్రెండ్షిప్ చెయ్యలా ... ఖర్మ .. అని రాని ఆవులింతలు అన్ని తెచ్చేసుకుని
im feeling sleepy అని చెప్పేసి .. సుబ్బరంగా .. పై బెర్త్ ఎక్కేసి దుప్పటి కప్పేసుకుని బజ్జున్న ..
ఎంత సేపు అయిందో ఎక్సాక్ట్ గా గుర్తు లేదు కాని .. కొంత సేపు అయ్యాకా .. బెర్త్ మీద ఎవరో టక్ టక్ అని కొడుతున్నట్టు అయ్యి లేచి చూస్తే .. మన లాయర్ అదే అదే TC .. లేచి ఏంటి అని అడిగితె .. కిందకి రా అన్నాడు ..
సరేలే అని మొహమాటం కొద్ది కిందకి దిగానా .. కూర్చోమని .. నాకో కాఫీ కొని ఇచ్చాడు ..
అలా మొహమాటం + కాఫీ = అతని సోది ..
మనం మెలకువలో ఉండగానే సగం అర్ధం కాదు .. నిద్ర మత్తులో ఏదో ఊ కొడుతున్న ..
మొట్ట మొదటిసారి జీవితంలో నా మొహమాటానికి నా మీద నాకే చిరాకొచ్చింది .. కాని ఎం చేస్తాం .. డిఫెక్ట్ ...కూర్చున్నా ..
విజయవాడ వస్తోంది .. నా డ్యూటీ ఇక్కడితో అయిపోతుంది .. నీ ఫోన్ నెంబర్ ఇస్తావా అన్నాడు ..
దేవుడా .. ఇదెక్కడి గోరం నేరం అన్యాయం .. అలా ఎలా ఇస్తారు .. ఇవ్వను కాక అని ఇవ్వను అని చెప్దాం అనుకున్న .. కాని అలా మొహం మీద ఎలా చెప్పేస్తాం .. దానికి తోడూ భయం .. వాడి సూట్ కేస్ లోంచి ఏ యాసిడ్ బోటిల్ లాంటివి ఏమైనా తీస్తాడేమో అని ..
బ్రెయిన్ యూస్ చేసేసి .. తప్పు నంబర్ ఇచ్చేసా ..
వీడు దానికి కాల్ చేస్తున్నాడు .. అంతా దురదృష్టం లో ను అదృష్ట దేవత నా డిప్ప మీద కొట్టింది ... ఏంటంటే నా ఫోన్ సైలెంట్ లో ఉంది .. అండ్ అది అర్ధ రాత్రి కాడం తో ఆ తప్పు నంబర్ ఫోన్ ఓనర్ ఫోన్ ఎత్తడం లేదు .. సూపర్ ..
ఏంటి కాల్ కలవడం లేదు అన్నాడు ..
నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపొయింది .. రేపు కాల్ చెయ్యి అని చెప్పేసా ..
ఈలోగా విజయవాడ వచ్చేసింది .. అతను దిగిపోయాక .. ఒక ప్రతిజ్ఞ చేశా ..
ఎంత కష్టం వచ్చినా ఇంకెప్పుడు ఒక అబ్బాయి హెల్ప్ అస్సలు తీసుకోకూడదు అని :) (ఇదిగో అబ్బాయిలు మీరు సీరియస్ గా తీసుకోకండి ఏదో కోపం లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ లో అలా అంతే . )
అతను మంచోడే అయి ఉండొచ్చు .. అయిన కూడా .. నేను ఆపద్దర్మం కోసం కొన్ని అబద్దాలు ఆడడం మాత్రం కరక్ట్ ఏ అని ఇప్పటికి అనుకుంటా ..
సో ఒకవేళ తప్పు చేసి అతన్ని హార్ట్ చేసి ఉంటె సారి చెప్పాలి .. కాదు అనుకుంటే అస్సలు అక్కర్లేదు :)
అదన్నమాట .. నా మొహమాటం నా కొంప ముంచింది .. ఆ టైపు లో...
కాని చూసారా నా తెలివి తేటలు నన్ను గట్టేక్కిన్చేసాయి .. :)
అందుకే దేముడు అందరికి అన్ని సమపాళ్ళలో పెడతాడు అని చెప్తారు .. :)
సో మొహమాట పడి ఇలాంటి పిచ్చి మంగలాలు అన్ని నెత్తి మీదకి తెచ్చుకోకండి సరేనా

వినాయకుడు మూర్చపోయాడు

శంకర్ గారి మరొక అద్భుతమైన రచన ఇది . (http://blogavadgeetha.blogspot.com/2011_03_11_archive.html) ఎక్కడనుంచో అదివో అల్లదివో పాట లీలగా వినబడుతుంటే వినాయకుడికి మెలకువ వచ్చింది. ఎవడబ్బా ఈ దుర్వాసనా భరిత కాసార సాగర మధ్యమున వేంకటేశ్వరుని భజిస్తున్నది అంటూ సగం కరిగి, సగం విరిగిన చేతిని సర్దుకుంటూ మెల్లగా తల తిప్పి చూసాడు. నడుం విరిగినా నారాయణ కీర్తన మానని అన్నమయ్య అంతబాధలోనూ కీర్తన ఆలపిస్తున్నాడని గుర్తించి, అంతలోనే అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? కొంపతీసి వినాయక నిమజ్జనం లానే ఈ హైదరాబాదీలు అన్నమయ్య చవితి చేసి అన్నమయ్య విగ్రహాలని కూడా నిమజ్జనం చేస్తున్నారా అని ఖంగారు పడ్డాడు. కానీ ఒకే విగ్రహం ఉండటం తో కాస్త స్తిమిత పడి "ఏం నాయనా అన్నమయ్యా? ఇలా వచ్చావు?" అని ప్రేమగా అడిగాడు. "రాలేదు స్వామీ తోసేసారు " అన్నాడు అన్నమయ్య ఒక పక్క బాధ భరిస్తూ. "తప్పు నాయన తోసేసారు అనకూడదు, దీనిని నిమజ్జనం అంటారు. నీకు కొత్తేమో కానీ నాకిది మామూలే" అన్నాడు వినాయకుడు. "భక్తితో ముంచితే నిమజ్జనం అంటారు, ద్వేషంతో ముంచితే తోసేసారు అంటారు, అన్నమయ్య వారు వాడిన పదం బాషా పరంగా సరియినదే స్వామీ" అని ఇంకో గొంతు వినగానే వినాయకుడికి చిర్రెత్తుకొచ్చింది. ఎవడ్రా నాకే బాషా సూత్రాలు నేర్పిస్తున్నాడు. అంత గొప్ప పండితుడా? అనుకుంటూ తలతిప్పి చూస్తే విరిగిన ఘంటపు ముక్క వెతుక్కుంటూ ఒళ్ళంతా శిధిలమయిన ఎర్రాప్రగడ కనిపించాడు. వార్నీ నువ్వు కూడానా? "ఏమిది సాహితీ సరస్వతీ మూర్తులన్నీ ఇలా కట్టకట్టుకుని సాగరాన వచ్చి పడ్డాయి? ఇక్కడ చూస్తే నాకే దిక్కు లేదు, పోనీ నేనేమయినా మహారాజునా? చక్రవర్తినా వీళ్ళని పోషించడానికి, మొదటికే మా తండ్రి ఆదిభిక్షువు ఇంకా వీళ్ళకి నేనేం చేయగలను" అని పక్కనున్న ఎలకతో అనగానే అది కిసుక్కున నవ్వి ఆ సంగతి వీళ్ళని తోసిన వాళ్లకి తెలియదా స్వామీ, తెలుగు భాషకి ఇంత ఉన్నతిని కల్పించిన వీరందరినీ దగ్గరుండి చూసుకోడానికి అదిగో ఆంధ్ర భోజుడిని కూడా అమాంతం ఎత్తి ఇక్కడ పడేసారు. అటు చూడండి అని చూపించగానే అక్కడ రెండు కాళ్ళు విరిగి ఒక పక్క కూలబడ్డ కృష్ణ దేవరాయలు మీసం దువ్వుకుంటూ కనిపించాడు. వినాయకుడిని చూసి నీరసంగానే నమస్కరించాడు. భళిరా నరోత్తమా నీవేల ఇటకు వచ్చితివి, ఇదేమీ హంపీ సరోవరం కాదే, ఈ మురుగు నీటిలో జలకాలాడవలేనన్న కోరిక నీకెలా కలిగినదయ్యా?" అన్న వినాయకుడి ప్రశ్నకి రాయలు జవాబిచ్చేనంతలోనే వినాయకుడి ఎలక "ప్రభూ బాగా ఆకలిగా ఉంది కాస్త ఏదైనా తిని మాట్లాడుకుందాం" అనగానే వినాయకుడు "అయితే ఆ పక్కకెళ్ళి తినేసోచ్చేయి. మేము ఈ లోగా ఇక్కడ ఏదో కతికామనిపిస్తాం" అన్నాడు. "వీల్లేదు ఎలకైనా, ఏనుగైనా, ప్రభువైనా, బంటయినా అంతా ఒకే చోట కూర్చుని చాపకూడు తినాలి. ఈ ప్రపంచం లో అంతా సమానమే. ఏం అన్నమయ్య స్వామీ "బ్రహ్మమొక్కడే" అన్న మీరయినా చెప్పరేమి?" అని వినబడగానే విరిగిన తొండం సర్దుకుని వినాయకుడు ఆ మాటలు వచ్చిన వైపు తలతిప్పి చూసాడు" అక్కడ ఆజానుబాహుడిలా నిలబడి శరీరం చిద్రమయినా మీసం మెలేస్తూ కనిపించిన వ్యక్తిని చూసి "ఎవరు నాయనా నీవు? సమానత్వం గురించి అంత ఆవేశ పడుతున్నావు?" అన్న వినాయకుడి ప్రశ్నకి "నన్ను బ్రహ్మనాయుడంటారు, మాది పలనాటి సీమ" అని జవాబిచ్చాడు బ్రహ్మనాయుడు. "నీవేమి ఇటుల వచ్చితివి విహారయాత్రకా?" అన్న వినాయకుడి ప్రశ్నకి అంత సేపూ ఓపిగ్గా వింటున్న ఎలక ఇంక ఆగలేక "స్వామీ మీకు ఈ మురికి మూసీ జల ప్రభావముతో మతి తప్పినట్టు ఉంది, తోసేసారు బాబో అని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ అదే ప్రశ్న. ఒక పక్క ఆకలితో చస్తుంటే" అని విసుక్కుంది. "మూషికా మూర్ఖంగా మాట్లాడకు వీరందరూ మహనీయులే కదా, ఈ తెలుగు జాతికి ప్రాతః స్మరణీయులే కదా మరి ఆ మాత్రపు ఇంగితము, మర్యాద లేకుండా వీరిని ఈ సాగరమున పడేసే దుర్మదాంధులేవరుంటారు? అంతటి ఉన్మత్తులు, ఉన్మాదులు ఈ ప్రాంతమున కలరా? " అనగానే అప్పటిదాకా వీళ్ళ గోలంతా వింటున్న బుద్ధుడు నీళ్ళలోకి తొంగి చూసి "పిచ్చి వినాయకా ఈ ప్రాంతం లో అంతటా ఉన్మత్తులు, ఉన్మాదులే కలరు, లోపలుండి నీకు తెలియట్లేదు కానీ రోజూ నేను చూడలేక చూడలేక చూస్తున్నా ఈ ముదిరిన ప్రాంతీయ వాదాన్ని, ఇప్పుడు వీళ్ళని ఈ మురికి కూపం లో పడేసింది కూడా వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళనే కారణం తోనే. కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళనెందుకు ఇబ్బంది పెడతావు, ఇంకా కాలూ, చెయ్యీ కూడదీసుకోడానికి కొంచం సమయం పడుతుంది. మనకంటే అలవాటు అయిపోయింది కానీ ఈ కంపు వాళ్లకి కొత్త." అన్నాడు. బుద్ధుడి మాటలు అర్ధం కాని శ్రీకృష్ణ దేవరాయలు అయోమయంగా తన పక్కనే ఉన్న ఎలకతో "బుద్ధదేవుడికి కూడా బుద్ధి నశించిందా? వాళ్ళంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సరే, మాది కన్నడ సీమ. విజయనగర సామ్రాజ్య తేజో విరాజులం మమ్మల్ని పట్టుకుని ఆంధ్రుడు అంటాడేమిటి? అయినా నా రాజ్యం లో ఆంధ్ర ప్రాంతం కూడా ఉందనుకో కానీ నన్ను కన్నడ వాడిగానే జనాలు గుర్తిస్తారు. హంపీ కన్నడ దేశం లో ఉందని ఆయనకి తెలియదా? " అనగానే ఎలక్కి చిర్రెతుకోచ్చింది "కాస్త మూసుకుంటారా? అయితే మీకు ఆంధ్ర అను పదము తో సంబంధము లేదంటారు? తమ బిరుదేమి మహాశయా?" అని వ్యంగం గా ప్రశ్నించింది. పాపం ఆ వ్యంగం అర్ధం చేసుకునే స్థితిలో లేని రాయలు మీసం దువ్వుకుంటూ "ఆంధ్ర భోజులంటారు మమ్మల్ని" అన్నాడు. "ఆ ముక్కొక్కటి చాలు వాళ్లకి మిమ్మల్ని మూసీలో ముంచడానికి. తొక్కలో అనుమానాలు మీరూను, "తెలుగు వల్లభుండ" అని మీసాలు మేలేస్కోడం కాదు "తెలంగాణా బాధితుండ" అని ఏడవాలి తమరు" అని కసిరింది. ఇదంతా చూసిన వినాయకుడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. లయకారుడైన తండ్రిని తలచుకున్నాడు. "తండ్రీ లింగాకారుడవే! నీ పేరుతో ఏర్పడిన ఈ త్రిలింగ దేశం లో ఆవేశ కావేశాలను అణచలేవా? " అని ఆవేదనతో ప్రార్ధించాడు. ఇంతలో డుబుంగ్ అని శబ్దం వినిపించింది. అంతా తలతిప్పి సాగర గర్భం లో లింగడు అవతరించాడు అనుకుని అటువైపు చూసారు. కొట్టుకుపోయిన మోకాళ్ళు కూడదీసుకుని పంచె సర్దుకుంటూ ఒకాయన కనిపించాడు. ఆయన వీళ్ళకేసి తిరిగి, అందరినీ గుర్తుపట్టి వినయంగా నమస్కరించాడు. "అయ్యా నన్ను వీరేశ లింగం అంటారు" అన్నాడు. ఆ మాట వినగానే వినాయకుడు మూర్చపోయాడు. (ఇంకా ఉంది) ఆవేశం తో చెప్పినదానికి, కాస్త హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పినదానికీ తేడా ఉంటుంది అనిపించింది. నిన్నటి ఘటనని సమర్ధించే వారు ఎవరు దీనిని చదివి నవ్వుకున్నా ఫరవాలేదు కానీ ఎక్కడో మనసు మూలల్లో ఒక్కసారయినా ఇంతటి మహానీయులనా అవమానించడాన్ని మనం సమర్దిస్తున్నాం అనుకుంటే చాలు అన్న ఉద్దేశ్యం తో రాసినదే తప్ప మరో తలపు లేదు. ఇది ఎవరికయినా బాధ కలిగిస్తే క్షంతవ్యుడను. (అయినా బాధలకి తలచుకుని వగచే కన్నా హాస్యపు తొడుగు వేసేసి మనసు పొరల్లోకి తోసేయడం మంచిదని మా(మన) ముళ్ళపూడి వారు కోతికొమ్మచ్చి సాక్షిగా సెలవిచ్చారుగా.

కాకినాడ కబుర్లు - పార్ట్ 2 - "సినిమా హాల్ స్ట్రీట్"

శంకర్ గారు raasina ఈ post naaku చాలా ఇష్టం. (http://blogavadgeetha.blogspot.com/2011/03/2.html)
కాకినాడ కబుర్లు - పార్ట్ 2 - "సినిమా హాల్ స్ట్రీట్"




కాకినాడ కబుర్లు మొదటి పార్ట్ లో కాకినాడ కాజా రుచి చూసారుగా. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న ఇంకో స్పెషల్ గురించి చెప్తాను. రెడీయా? స్పెషలంటే అలాంటి ఇలాంటి స్పెషల్ కాదు మరి. సినిమా స్పెషల్. తెలుగోడికి, సినిమాలకి ఉన్న సంబంధం మీకు తెలిసిందే కదా, మా ఊళ్ళో ఇంకో అడుగు ముందుకేసి ఒక వీధి మొత్తం వరుసగా సినిమా హాళ్ళు ఉంటాయన్నమాట. దాని సినిమా హాల్ స్ట్రీట్ అంటారు. అలా అని కేవలం ఆ వీధి లోనే సినిమా హాల్స్ ఉంటాయనుకున్నారు, మెయిన్ రోడ్ మీదా, మిగిలిన ఏరియాలలో కూడా కొన్ని సినిమా హాల్స్ ఉన్నాయి లెండి. వాటి గురించీ ఇప్పుడే చెప్పెసుకుందాం. ఇంక సినిమా హాల్ స్ట్రీట్ విషయానికొస్తే పండగ రోజుల్లో, శలవుల్లో ఇంటికి ఎవరైనా వస్తే జగన్నాధ పురం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఉన్న సినిమా హాల్స్ లో ఏదో ఒక దాంట్లో టికెట్ దొరక్కపోదు. అదన్నమాట సంగతి. ఇప్పుడు మిమ్మల్ని మా ఊరికి మాత్రమే ప్రత్యేకమయిన సినిమా హాల్ స్ట్రీట్ టూర్ చేయించనున్నానన్నమాట. రెడీయా?


ముందు జగన్నాధపురం వంతెన దగ్గర నుంచి బయల్దేరదాం. వంతెన దాటేసారుగా ఆ ఇప్పుడు కుడి చేతి వైపు తిరగండి. పదండి ఆ రోడ్లోకి. పోలీస్ స్టేషన్, bsnl ఆఫీసు దాటేసి ఎడం చేతి వైపు కనిపించే రోడ్డు మొదట్లో ఆగండి. రోడ్డు కనిపించిందా? అద్గదీ అదే మా ఊరి సినిమా హాల్ స్ట్రీట్ అన్నమాట. ఇంకేంటి చూస్తున్నారు పదండి.

Add caption


అదిగో మొట్టమొదటిగా కుడిచేతి వైపు కనిపిస్తోందే, అదే స్వప్న థియేటర్. పెద్ద గేటు దాటుకు ముందుకి వెళ్తే లోపల గుబురుగా ఉన్న వెదురు పొద దాని చుట్టూ సిమెంట్ బెంచీలు, అక్కడ కూర్చుని బుకింగ్ కౌంటర్ ఎప్పుడు తెరుస్తారా అని చూసే జనాలు కనిపించారా? ఆల్రైట్..కుసింత ముందుకెళ్ళి ఎడం చేతి వైపు చూడండి అక్కడో థియేటర్ ఉంది. ఎక్కడుందీ అని వెతుకుతున్నారా? లోపలెక్కడో ఉంటుంది. బయట నుంచి కనబడే థియేటర్ టైపు కాదిది. బయట అందరికీ సినిమా కెల్తున్నామోచ్ అని చాటుకుని వెళ్ళే థియేటర్ కూడా కాదులెండి. ఆ థియేటర్ పేరు ప్యాలెస్. కేవలం పెద్దలకు మాత్రమే థియేటర్ అది.


చాల్చాలు. పదండి. అదిగో ఆ కుడిపక్క ఇంకో థియేటర్ ఉంది కదా అదే లక్ష్మి థియేటర్. చూసారా. పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఆగండి ఆ కుడిచేతి వైపు పొడుగాటి వీధిలా ఉన్న థియేటర్ కనబడిందా? అది మా కాకినాడ వాళ్ళు గర్వం గా చెప్పుకునే థియేటర్లలో ఒకటైన సత్యగౌరి. మొదట్లో మా చిన్నప్పుడు ఇక్కడ కేవలం ఇంగ్లిష్ సినిమాలే ఆడేవి. రాంబో, ఆర్మార్ ఆఫ్ ది గాడ్ లాంటి సినిమాలు ఇక్కడే చూసాం. తరవాత తెలుగు సినిమాలు కూడా మొదలెట్టాడు. అప్పుడు ఖుషీ, మాస్టర్ లాంటివి చూసామన్నమాట. అన్నట్టు ఇక్కడ బ్లాక్ టికెట్ల గొడవుండదు. ఇంక సౌండ్ సిస్టం అంటారా? కేకో కేక. మా ఊరోళ్ళుఅందరూ ముక్త కంఠం తో చెప్పే మాట "సత్య గౌరీ" వాడు మెయిన్టైన్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు అని. అంత బావుంటుంది ఈ థియేటర్. వీడి దగ్గర క్యాంటీన్ లో సేమ్య ఉప్మా, పూరి భలే ఉంటాయిలెండి. ఇంకా చాలా ఉన్నాయి పదండి పదండి.


ఆ సంత చెరువు దగ్గరకి వచ్చేసాం. ఆ నెక్స్ట్ కుడి చేతి వైపు ఒక థియేటర్ కనిపిస్తోంది కదా. ఆ థియేటర్ గురించి మీకు కుసింత చెప్పాల్లెండి. దాని పేరు మెజిస్టిక్ థియేటర్. ఇక్కడ ఒక నాటక సమాజం కూడా ఉండేది.యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని. ఆ నాటక సమాజం నుంచే సినీ పరిశ్రమకు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పరిచయం అయ్యారు. అబ్బే పెద్ద పేరున్న వాళ్ళు కాదు లెండి. ఏదో ఎస్వీ రంగారావు, అంజలీదేవి లాంటి వాళ్ళన్నమాట. పదండి ఆ పక్కనే ఇంకో థియేటర్ కనిపిస్తోంది కదా అది కాస్త కొత్త థియేటర్. "మయూరి" అని. ఇంకాస్త ముందుకేల్తే "పద్మనాభ థియేటర్". రండి ఇంకాస్త ముందుకి వెళ్దాం.


ఆ ఎడం చేతి వైపు ఒక పెద్ద పెట్రోల్ బంక్ కనిపిస్తోందా? దాని ప్లేస్ లో మా చిన్నప్పుడు రెండు థియేటర్ లు ఉండేవి. క్రౌన్, విజయ్ అని. అవి మొదటి తరం థియేటర్ల కోటాలోకి వస్తాయి. అన్నట్టు ఇందాకా చూసిన మెజిస్టిక్ కూడా ఆ బాపతే. ఇంకాస్త ముందుకి వెళ్తే కుడి చేతి వైపు ఒక పెద్ద రోడ్ కనిపిస్తోందా? అది దేవి, శ్రీదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్ అన్నమాట. మొదట్లో ఈ కాంప్లెక్స్ లో దేవి, శ్రీదేవి మాత్రమే ఉండేవి, ఆ తర్వాత రుక్మిణి, పద్మ అని ఇంకో రెండు థియేటర్లు కట్టారు. మొత్తం నాలుగు థియేటర్లు ఓకే కాంప్లెక్స్ లో అన్నమాట. అన్నట్టు బ్లాక్ టికెట్లు ఈ కాంప్లెక్స్ లో దొరికినట్టుగా ఇంకెక్కడా దొరకవు. అంత పేరుంది ఈ థియేటర్లకి. పదండి పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి కాళ్ళు నొప్పెడుతున్నాయా? ఆ ముందు ఉడిపి వీనస్ భవన్ లో ఒక టీ కొట్టి వెళ్దాం లెండి.


వచ్చేసాం. ఇదే మున్సిపల్ ఆఫీస్ సెంటర్. అదిగో ఆ కుడిచేతి పక్కన కనిపిస్తోంది అదే "కల్పన" థియేటర్. ఇదిగో ఇదే ఉడిపి వీనస్ భవన్. ఏంటి టీ అన్నాను కదా అని గుర్తు చేస్తున్నారా? ఒక్క నిమిషం కొద్దిగా ముందు ఇంకో మూడు థియేటర్లు ఉన్నాయి. దానితో సినిమా హాల్ స్ట్రీట్లో ఉన్న థియేటర్లు అయిపోతాయి. అవి కూడా చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి టీ తాగి తరవాత మెయిన్ రోడ్ లో ఉన్న సినిమా హాల్స్, మా ఊర్లో ఉన్న మిగిలిన థియేటర్ల ని చూసొద్దాం. ఓ..కే నా. పదండి.


అదిగో ఆ కుడి చేతి వైపు కనబడేదే మున్సిపల్ ఆఫీసు. ఆ రోడ్డు కనబడుతోంది చూసారా? తిన్నగా వెళ్తే సాంబమూర్తి నగర్ మీదుగా బీచ్ కి వెళ్లిపోవచ్చు. ఇంకోసారెప్పుడైనా తీసుకెళ్తాలెండి. అదిగో ఆ ఎడం చేతి వైపు చూడండి అదే "సూర్య కళా మందిర్ అనబడే సరస్వతీ గాన సభ". ఆంధ్రప్రదేశ్ లో సంగీత విద్వాంసులు, నటులు ఇలా కళాకారులందరూ ఈ వేదిక మీద ఒక్కసారైనా ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. అంత పేరుంది దీనికి. దీని గురించి మళ్ళీ ఒక సెపరేటు పోస్ట్ వేసుకుంటా. ఆ పక్కనే వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మారిపోయింది అనుకోండి. దాని పక్కనే పెద్ద బిల్డింగ్ కనిపిస్తోందా? అవే చాణక్య, చంద్ర గుప్త థియేటర్లు. అదండీ సినిమా హాల్ స్ట్రీట్. ఇక్కడితో ఈ వీధిలో సినిమా హాళ్ళు అయిపోయాయి. మరి రోడ్డింకా ఉంది కదా అంటారా? తిన్నగా వెళ్తే ఆనందభారతి, కొత్తపేట మార్కెట్ దగ్గర రైల్వే గేటు, RTC కాంప్లేక్స్ వస్తాయన్నమాట. అవి దాటి కొంచం ముందుకి వెళ్లి ఎడం చేతి వైపు తిరిగితే భానుగుడి సెంటర్లో కలుస్తారు. ముందు ఉడిపి వీనస్ భవన్ లో టీ తాగి అక్కడికి వెళ్దాం.



ఆ... టీ తాగడం అయిపోయిందా? పదండి పదండి. ఇందాక చెప్పిన రూట్లో భానుగుడి సెంటర్ కి వెళ్ళిపోదాం.


హమ్మయ్య, ఇదే భానుగుడి సెంటర్. ఈ కుడి చేతి వైపు చూసారుగా. ఇదే పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్ల కాంప్లెక్స్. బాబూ ఆ కిందున్న "యతి" కేసి చూడకండి. అక్కడి కెళ్తే ఓ పట్టాన బయటకి రారు. పోన్లెండి ఎవరికయినా ఆకలేస్తే వెళ్లి ఓ పిజ్జాయో ఏదో తినేసి తొందరగా వచ్చేయండి. ఇందాక టీ తాగని వాళ్లెవరైనా ఉంటే ఆ ఎదురుగా సిగ్నల్స్ దగ్గర కనిపిస్తోందే అదే "చార్మినార్ టీ సెంటర్" అక్కడికెళ్ళి టీ తాగేసి వచ్చేయండి. అన్నట్టు వాడి దగ్గర స్పెషల్ బాదం టీ ఉంటుంది ట్రై చేయండి. ఆ సెంటర్ మొత్తం చూసేయకండి. అక్కడికి మళ్ళీ ఇంకో పోస్ట్ లో తీసుకెళ్తా. తొందరగా రావాలండీ. జిడ్డు చేయకూడదు.

పద్మప్రియ కాంప్లెక్స్









రెడీయా? అందరూ వచ్చేశారా? పదండి ఇక్కడనుంచీ మనం టూ టౌన్ వంతెన మీదుగా మెయిన్ రోడ్ కి వెళ్తాం అన్నమాట.


అదిగో ఆ ఎడం చేతి వైపు కనిపిస్తోంది కదా అదే ఆనంద్ కాంప్లెక్స్. కాకినాడలో ముప్పాతిక మంది కాలేజి స్టూడెంట్స్ ఆస్థాన థియేటర్ కాంప్లెక్స్ ఇది. లోపల ఆనంద్, అంజని, గీత్, సంగీత్ అని నాల్గు థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఆలూ బోండా సైజు పకోడీ, ఐస్ క్రీం తింటే నాసామి రంగా. ఆ టేస్టే వేరు. ఇక్కడనుంచీ అదిగో ఆ ఓవర్ బ్రిడ్జి కనబడుతోంది కదా దాని మీదుగా వెళ్తే టూ టౌన్ సెంటర్ కి వెళ్ళిపోతాం. పదండి.



ఆనంద్ కాంప్లెక్స్ (బయట నుంచి)







ఆనంద్ కాంప్లెక్స్ (ఆనంద్ థియేటర్ ఎంట్రన్సు)


గీత సంగీత్ థియేటర్లు



మెయిన్ రోడ్ కి వచ్చేసాం. అదిగో అది విజయలక్ష్మి హాస్పిటల్. కొంచం ముందుకి వెళ్తే ఆ ఎడం చేతి వైపు కనిపించేదే టౌన్ హాల్ దాన్ని దాటేస్తే నెక్స్ట్ సెంటర్లో హెడ్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడ ఓ సారి ఆగి అల్లదిగో ఆ కుడిచేతి వైపు చూడండి అది తిరుమల థియేటర్. ఈ పోస్ట్ ఆఫీస్ పక్క వీధిలో వెళ్ళిపోతే మళ్ళీ దేవి శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి పోతారన్నమాట. అవండీ మెయిన్ థియేటర్లు.


ఇవి కాక జగన్నాధపురం లో చంద్రిక, తూరంగి సూర్య మహల్ (ఇప్పుడు రాఘవేంద్ర అని పేరు మార్చినట్టు ఉన్నారు), విద్యుత్ నగర్ కమల్ - వీర్ (ఇవి రెండు థియేటర్లు), వాకలపూడి సూర్య మహల్ ఇవీ ఉన్నాయి.



కమల్ వీర్ థియేటర్


అదండీ. మొత్తం మీద మా కాకినాడలో సినిమా హాల్స్ అన్నీ చూసేసారు కదా. నెక్స్ట్ టైం మా ఊరొస్తే ఏ సినిమా హాల్ ఎక్కడుందో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఎవరినీ అడగక్కర్లేకుండా వెళ్లి పోవచ్చన్నమాట.


(NEXT : భానుగుడి సెంటర్)

18, ఆగస్టు 2010, బుధవారం

మాటల యుద్ధం ముగిసిన వేళ...

http://naaspandhana.blogspot.com/2009/01/blog-post_06.html (లలిత-నా స్పందన)




"ఏవోయ్"
"................."
"ఇదిగో నిన్నే"
"...................."
"నిన్నేనోయ్ నా అర్ధాంగీ "
"......................."
"దయచూపగరాదా దేవీ........................."
"...................."
"ఐతే ఇక అంతేనా , నే పోనా..............."
"ఏవిటీ అంతేనా"?
"మూడురోజులనుండి బ్రతిమాలుతున్నా "
"ఎవరూ బ్రతిమాలమన్నదీ"
"నువ్వలా వుంటే నాకు వుండబుద్ది కావద్దూ"
"అబ్బో ప్రేమ కారిపోతుంది లెండి "
"మరికాదా"?
"అంత ప్రేమున్నవారు నన్నంత మాట ఎలా అనగలిగారో "?
"ఏ మాట".....ఎప్పుడూ"?
"అబ్బే ఏం ఎరగరుమరి"
" ఒహో...అదా నువ్వింకా అదే తల్చుకు బాధపడితే ఎలా "?
"ఎలా అంటే వదిలెయ్యండి .......ఈ బ్రతిమాలడాలెందుకూ"?
"ఎందుకేవిటీ నువ్విలా వుంటే నాకు పనిమీద మనసు నిలవటం లేదు మరి .ఎంత బాధగా వుందో తెలుసా "
"అంత బాధ పడేవారైతే నన్నంత మాటంటారా"?"............... " అదీ మీ అమ్మగారి ముందు"
"అదన్న మాట అసలు సంగతి ,మొగుడు కొట్టినందుకు కాదు తొడికోడలు నవ్వినందుకు అన్నట్టుంది "..........
"కాదూ మరి "! విన్న అవిడ వూరకే వుంటారా నలుగురికీ చెప్పకుండా "?
"చ అమ్మ అలా చేయదులే "
"ఆహా... మీరు నన్నంత మాట అంటుంటే ఆవిడ మొహం ఎంత వెలిగిపోయిందో గమనిస్తే తెలిసేది "
".............................."
" మా ఆయన నన్ను పల్లెత్తు మాటనరు " అని తోడికోడళ్ళతోనూ, ఆడబడుచుల తోనూ గర్వంగా చెప్పుకునేదాన్ని .............ఇప్పుడు అంతా కూడి నా వెనకే నవ్వరూ"?
"అదేవంత మాట . ఏదో ఆరోజు చికాకులో నోరు జారింది అందుకేగా క్షమించమని నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది "
"............................."
" అయినా ఆ చిన్న మాటకే నువ్వింత మనసు కష్ట పెట్టుకుంటావని తెలియకా................."
అవున్లెండి ...నా కష్టం తమకెప్పుడు తెలియాలి "?
"...................."
"ఇంటెడు చాకిరీ ఒక్క చేత్తో చేసుకొస్తున్నానన్న జాలైనా లేకుండా నన్నంట మాట అంటారా "?
"జాలి లేకేం బంగారూ....." సుకుమారంగా పెరిగిన మా రాణి గారి సేవకి ఒక్క పరిచారికనైనా నియమించలేకపొయితిమని బాధ పడని రోజుంటే ఒట్టు "
"అబ్బో ..........ఈ వెటకారాలకేం తక్కువ లేదు రాజా వారికి " అంత సుకుమారి వైతే పుట్టింటి నుంచి పనిమనిషిని తెచ్చుకోవలసింది అనేకదూ మీ దెప్పిపొడుపు"
"హవ్వ.... " " నా మాటకర్ధం అదికాదోయ్" నా వుద్దేసం ............"
"అర్ధం అదే, వుద్దేసం అదే ఆ మాత్రం పసిగట్ట లేని అమాయకురాలిని అనుకున్నారా"?
"అయ్యో ............ నువ్వలా వూరకే బాధ పడుతుంటే నా కేం మాట్లాడాలో తెలియట్లేదు "
"ఇంకేం తెలియాలి అనాల్సిన మాటలెప్పుడో అనేసారుగా "?
" నేనా......ఏమనేసానూ"?
"మళ్ళీ మొదటికొస్తున్నారా ..........నన్నన్న మాట మరిచిపోయారా"?
"అబ్బ ఇంకా అదే సాగదీస్తే ఎలా"
"నేనా సాగదీసింది "?...........నా మానాన నేనుంటే మీరు కదూ వచ్చి అదిపింది"
"కదపక పోతే ఎలా నువ్వల మూతి ముడుచుకుని ,మాట్లాడకుండా వుంటే నేనెలా హాయిగా బ్రతికేసేది"
"ఆహా....... చాల్లెండి బడాయి. అబ్బ .....చెయ్యొదలండి"
"ఆ............అమ్మా"
"అయ్యో ఏవయిందండీ"?
"నిన్ను బాధ పెట్టినదుకు పగ తీర్చుకుంది కామోలు"......... "నీ గాజు గీసుకుంది"
"అరెరే రక్తం వస్తుందండీ, లోపలికి తెగిందల్లే వుంది . అయ్యయ్యో ఆ చెయ్యిటివ్వండి "
"పర్వాలేదు నా కీ శాస్తి జర్గాల్సిందే
'చీ ,చీ పాపిస్టిదాన్ని అంతా నావల్లే , "చెయ్యి విదిలించి కొట్టాను"
"ఏం కాదులే కొద్దిగానేగా తెగింది"
"ఇంత రక్తం పోతుంటే కొద్దిగా అంటారేం "
"అయ్యో నేనింత పట్టుపట్టాల్సింది కాదు .మూర్ఖపు పీనుగని మీ రక్తం కళ్ళ చూసేవరకూ వదల్లేదు "
"లేదులే నేనా మాట ............."'
" చిరాకులో మొగుడో మాటం టే మటుకు ఇంత రాద్ధంతం చెయ్యాలా ......అంతా నావల్లే"
"నేనసలామాట.............."
" మళ్ళీ ఆ మాటెత్తితే నా మీద ఒట్టే "
"అదికాదోయ్............"
" ఇక చాల్లే వూరుకోండి " "అయినా మీకన్నా వుండక్కరలా'? నేను మిమ్మల్ని అంతలేసి మాటలంటూంటే మీరైనా ఒక్క గసురు గసిరితే ఆగేదాన్ని కాదా.....ఇది ఇంతవరకూ వచ్చేదా"??????
" ఆ............"
"ఆ............."

గెంతు రాజా గెంతు !

http://indralokam.wordpress.com(indra-ఇంద్ర లోకం )

పది అయ్యింది.
రాత్రి పది అయ్యింది.
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది.
ఇంట్లొకి వచ్చి షూ విప్పాను.
బెల్ట్ తీసాను.
అమ్మ, సుప్రజ నా వైపు భయంగా చూశారు.
బెల్ట్ చూసి భయపడ్డారేమోనని బెల్ట్ దాచేసాను.

ఇంకా అలానే చూస్తున్నారు. అప్పుడు గమనించాను.
టివిలో ఏదో ప్రొగ్రాం వస్తుంది. ఎవడో మూతి దగ్గర పెట్టుకోవలసిన మైక్ ని ముక్కు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు.

“అంతా బాగుంది కాని, నువ్వు కాళ్ళతో వెసిన స్టెప్స్ అన్నీ చేత్తొ వేస్తే ఇంకా బాగుండేది.”
“లేదు మాస్టర్, నేను వెయ్యలేను. ఎందుకంటే.. ఎందుకంటే.. నా చిటికిన వేలి గోరు విరిగింది.” అని ఏడ్చింది స్టేజ్ మీద కుక్కకి తిక్క తగిలితే చించిన గుడ్డలతో కుట్టిన గౌను వెసుకున్న చిన్నది. (గమనిక: చిన్నది – చినిగి పోయిన చిన్న డ్రెస్ వేసుకున్నది.)

(ఆలొచిస్తే గుర్తుకు వచ్చింది ఏదో ‘ఫోన్ కొట్టు..నన్ను పట్టు..’ ప్రొగ్రాంలో చూశాను ఈ పిల్లని. అక్కడ ఎవరో కొడితే ఇక్కడ పడినట్లుంది.)

స్లో మోషన్ లో ప్రేక్షకుల మొహాలు ఒకసారి చూపించారు.
కొందరు ఏడుస్తున్నట్లున్నారు.

“బంక మాస్టార్ మన శిల్పకి ఎన్ని మార్కులు ఇచ్చారో తెలుసుకునేముందు మన గెంతు రాజా గెంతు లో ఒక చిన్న (30నిమిషాలు) బ్రేక్ ” అని తన చేతులు గాలిలొ లేపి ఊపి కెమేరాని గుద్దింది.

ఆ గుద్దుకి నేను ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
ఇప్పుడు తెలిసింది వాళ్ళ ఎక్స్ ప్రెషన్ కి గల కారణం. అది భయం కాదు. ఆందోళన.
(డైలీ సీరియల్స్ చూసి చూసి ఎప్పుడు ఏ ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో మర్చిపోయారు.)

హడావిడిగా వంట గదిలోకి వెళ్ళారు నాకు డిన్నర్ రెడీ చెయ్యడానికి.
సొఫాలో కూర్చుంటూ టివి రిమోట్ అందుకుని చానల్స్ మార్చసాగాను.

ఒక న్యూస్ చానల్
“పంది ఇంకా లింగం చుట్టూ తిరుగుతునే వుంది. మరిన్ని వివరాలకు అక్కడే కుక్కలాగా కాచుకుని వున్న రామక్రిష్ట్నని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు రామక్రిష్ట్న.”

ఇంకో చానల్
“నువ్వు ఎంచుకొన్న రాగం ఏంటి…నువ్వు పాడుతున్న తాళం ఏంటి..” ఎవడో బోడి గుండు వెదవ 3ఏళ్ళ పాపని బెదిరిస్తున్నాడు.

ఇంకో చానల్
“మీ టివి వాల్యుం కొంచం తగ్గిచండి.”

ఒక చానల్లో
ఒక కుటుంబం మొత్తం దేనిగురించో మాట్లాడుకుంటుంది. జాగ్రత్తగా గమనించాను. అందులో ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవుడు ఒకేలాగ ఉన్నారు.
ఒకేలాగా ఎంటి.. ఒక్కడే… మన ‘కమలాకర్ ‘ (పేరు మార్చడం జరిగింది). ఏదో చానల్లో కొడితే ఈ చానల్లో పడ్డాడు.

మరో చానల్లో
“కావ్య ప్రదీప్ ని కలుసుకుంటుందా? సుశాంత్ మొబైల్ బిల్లు ఎంతవచ్చింది? తులసమ్మ ఏమి పీకుతుంది? అని తెలుసుకోవాలంటే ‘ దిక్కుమాలిన బ్రతుకులు ‘ చూడండి”

ఇంకో చానల్లో
“…ఇదంతా తెలియని రామయ్య యదావిదిగా ఇంటికి వచ్చాడు. ఇంటిముందున్న కుక్కని కాలుతొ తన్నాడు. అప్పటివరకు నిద్రపోతున్నట్లు నటిస్తున్న కుక్క అతని పిక్క పట్టుకొంది.”
స్క్రీన్ మీద ‘ కల్పిత పాత్రలతో’ (కుక్కతో సహా) అని వుంది.

ఇంకో చానల్లో
“…దానమ్మకి కోపం వచ్చింది. ఇప్పటివరకు దాన్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు. నీ ఎంకమ్మ, అనవసరంగా దాని పిల్లను తెచ్చావ్.”
డైనోసార్ జీప్ ని పడేసి తొక్కుతుంది. ‘జురాసిక్ పార్క్’ తెలుగులో వస్తుంది అనుకుంటా…

మరో చానల్ మార్చాను.
“ఇక్బాల్ కి స్వైన్ ఫ్లూ వస్తుందంట.”
స్క్రీన్ మీద అడవి పందులు దేన్నొ పీక్కు తింటున్నాయ్. ‘ నెషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ‘.
నేను షాక్ తిన్నాను. ఇంగ్లిష్ ఛానల్లో తెలుగు మాటలేంటానని మ్యూట్ లొ పెట్టాను.

అప్పుడు తెలిసింది ఆ మాటలు వంట గదిలోనుండి వస్తున్నాయని.

ఆసక్తిగా విన్నాను.
” …స్వైన్ ఫ్లూ నా? ఎలా వచ్చింది? ఇక్బాల్ అమెరికా వెళ్ళలేదే?”
“వెన్నెలని ఎయిర్ పొర్ట్ లో డ్రాప్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు అటాక్ అవుతొందంట.”
“అబ్బ పాపం ఇక్బాల్ కి అన్ని కష్టాలు వెన్నెల వల్లనే.”

నేను అటెన్షన్లోకి వచ్చెసాను.

“ఇందాక అనసూయ ఆంటి సన్ టివీలొ తమిళ్లో చూసిదంట.”
ఇప్పుడు నాకు పూర్తిగా అర్దమయ్యింది వాళ్ళు దేని గురించి మాట్లడుకుంటున్నారో…”మొగలి రేకులు పిచ్చి ఆకులు” అనే సీరియల్ గురించి…
నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మొదలైనట్లు గుర్తు.

“ఐనా అనసూయ ఆంటీకి తమిళ్ ఎలా వచ్చింది? వాళ్ళు ఎప్పుడైనా చెన్నైలో ఉన్నారా? స్కూల్ తమిళ్ మీడియంలో చదివిందా? మీ ప్రశ్నకు సమాధానం ‘ అవును ‘ ఐతే …..”
“అయ్య బాబోయ్.. కొంచం సేపు టివి చూస్తేనే ఇలా ఆలోచిస్తున్నానేంటి..”

అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు ఒక భయంకరమైన నిజం.

వాళ్ళు కొన్ని రోజులు ‘ చెన్నై షాపింగ్ మాల్ ‘ పక్క వీదిలో ఉన్నారు.

నా డిన్నర్ రెడీ అయ్యింది.
వాళ్ళెందుకో కొంచం హడవిడిగా కనిపించారు. దేని కోసమో వెతుకుతున్నట్లున్నారు.
సుప్రజ కళ్ళు నా చేతిలొ ఉన్న రిమోట్ మీద పడ్డాయి. మొహంలో ఆందొళన కనిపించిది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆనందం అని తర్వాత తెలిసింది.)

నేను రిమోట్ ఇచ్చేసాను.

“వెల్కం బ్యాక్ టూ గెంతు రాజా గెంతు.” టివిలో ప్రొగ్రాం మొదలైంది.

నేను డిన్నర్ చేస్తున్నంత సేపూ ఏవో అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించాయి. అప్పుడప్పుడు కొన్ని ‘బీప్’లు కూడా వినిపించాయి.

డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళ వేపు చూసాను. వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించింది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆందోళన అని అప్పుడే అర్ధమయ్యింది.)

నేను నా ‘లాప్ టాప్’ ఆన్ చేసి ఈ కధ వ్రాయడం మొదలు పెట్టాను.

(అయిపోయింది.)

“చెత్త చెత్త సీరియల్స్ తో, పరమ చెత్త ప్రొగ్రాములతో, బ్రేకింగ్ బేకింగ్ న్యూస్ లతో ప్రేక్షకులని హింసిస్తున్న టివి చానల్స్ కి నా ఈ కధ అంకితం.”